డల్లాస్ : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్‌టీ) ఆధ్వర్యంలో డల్లాస్(ఇర్వింగ్)లో ఆదివారం జూన్ 17న జరిగిన 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 300 మందికి పైగా యువతీ, యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాన్సుల్ అశోక్ కుమార్, ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంజీఎంఎన్‌టీ కార్యదర్శి రావు కల్వల అందరికీ స్వాగతం పలుకుతూ ఈ గాంధీ మెమోరియల్ దగ్గర యోగ దినోత్సవం జరుపుకోవడం ఇది నాల్గవ పర్యాయమని, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో అందరూ ఉత్సాహంగా యోగ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి సహకరించిన భారత కాన్సులేట్ అధికారులకు, ఇర్వింగ్ సిటీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంజీఎంఎన్‌టీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ షబ్నమ్ మోద్గిల్ కార్యవర్గ సభ్యులను అందరికీ పరిచయం చేశారు.
ఎంజీఎంఎన్‌టీ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ 5,000 సంవత్సరాల క్రితం రిషికేష్ యోగాకు జన్మస్థలం అయ్యిందని, 2014 లో ఐక్యరాజసమితి జూన్ 21 ని యోగా దినోత్సవంగా ప్రకటించడంతో ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలు యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయని తెలిపారు. గాంధీ మహాత్ముడు కూడా యోగాకు, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, ఈ రోజు అదే గాంధీ స్మారక స్థలంలో యోగా దినోత్సవం జరుపుకోవడం సముచితంగా ఉందని అభిప్రాయపడ్డారు. కాన్సుల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్, మహాత్మా గాంధీ మెమోరియల్ డల్లాస్‌తో కలిపి యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజ్య సమితి జూన్ 21న యోగా దినోత్సవాన్ని పాటించడం చారిత్రాత్మక విషయమని, నిత్యం అందరూ యోగా అభ్యసించాలని కోరారు.
విశాలమైన థామస్ జెఫెర్సన్ పార్కులో సుందరమైన మహాత్మా గాంధీ మెమోరియల్ ను ఏర్పాటు చేసిన సభ్యులందరకీ ఇర్వింగ్ సిటీ మేయర్ ప్రోటెం ఆలన్ మీఘర్ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా యోగాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సిటీ తరపున ఏ సహాయం చేయడానికైనా తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.
ఎంజీఎంఎన్‌టీ కో-చైర్మన్ కమల్ కౌషల్ యోగా ప్రాముఖ్యాన్ని వివరించారు. యోగా శిక్షకుడు విజయ్, వారి బృందంతో యోగా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించ వలసినదిగా ఆహ్వానించారు. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ యోగా శిక్షణలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే వేదిక పై ప్రతిష్ఠాత్మకమైన ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో’ ప్రథమ స్థానం సాధించిన కార్తీక్ నెమ్మాని, ద్వితీయ స్థానం పొందిన నైన మోడీ, తృతీయ స్థానంలో వచ్చిన అభిజయ్ కొడాలి, వారి తల్లిదండ్రులను, పిల్లలకు శిక్షణ ఇచ్చిన ‘జియోస్పెల్ అకాడమీ’ నిర్వాహకులు విజయ్ రెడ్డి, గీత మంకులను ఎంజీఎంఎన్‌టీ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర, ఇతర బోర్డు సభ్యులతో కలసి ఘనంగా సన్మానించారు. ఎంజీఎంఎన్‌టీ కోశాధికారి బి. ఎన్. రావు ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన అధికారులకు, కార్యకర్తలకు, మీడియా వారికి, బాంబే ఫోటోగ్రఫీ వారికి, మ్యూజిక్ మస్తీ వారికి, హర్యానా సంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment