
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.


మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.


మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.