Bhuman
-
కోస్తా మెప్పు కోసం ‘సీమ’ కు ద్రోహం
బాబుపై ధ్వజమెత్తిన భూమన్ తిరుపతి: కోస్తా జిల్లాల వారి ఒత్తిడులకు తలొగ్గి ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ ఆరోపించారు. తాను రాసిన ‘రాయలసీమ రాష్ట్రం ఒక డిమాండ్’ అన్న పుస్తకం సోమవారం తిరుపతిలోని ప్రెస్‌క్లబ్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పి. అంజయ్య ఆవిష్కరించిన సందర్భంగా భూమన్ మాట్లాడుతూ, రాయలసీమకు కృష్ణా నది నీళ్లు రావడానికి ముఖద్వారం లాంటి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచితే, ఆ నీళ్లు రానీయకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుపడ్డారని ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 854 అడుగులకు చేరితేనే కిందకి వదలాలన్న నిబంధనను తుంగలోతొక్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 69వ నెంబరు జీవో తెచ్చి, 843 అడుగులకు చేరగానే కిందికి వదిలేసేటట్టు చేశారని, దీని వల్ల పోతిరెడ్డిపాడుకు నీళ్లు రాకుండా అడ్డు పడ్డారని ఆరోపించారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఈ సీమకు ద్రోహం చేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. ఈ చీకటి జీవోను రద్దు చేయాలని కోరారు. కడప ఉక్కు కర్మాగారం రాయలసీమ వాసుల హక్కని, దీన్ని సాధించాలని, అలాగే గుంతకల్లు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, కడప ఉక్కు కర్మాగారాన్ని వెంటనే నిర్మించాలని, విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలని, రాయలసీమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాలకంటే రాయలసీమ పెద్దదని, ప్రపంచంలో రాయలసీమకంటే చాలా చిన్న ప్రాంతాలు దేశాలుగా మనుగడ సాగిస్తున్నప్పుడు రాయలసీమ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు మనుగడ సాగించలేదని ప్రశ్నించారు. రాయలసీమలో దొరికినన్ని ఖనిజ లవణాలు మరెక్కడా లేవని, వీటిని వెలికి తీస్తే ఈ సీమ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాయలసీమ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఎలా మనుగడ సాగించగలదో తన పుస్తకంలో వివరాలన్నీ ఇచ్చానని చెప్పారు. -
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారమే రాజధాని
రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్ హైదరాబాద్: శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎంపిక చేయాలని రాయలసీమ జేఏసీ కో కన్వీనర్ భూమన్ డిమాండ్ చేశారు. రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో దీక్ష జరిగింది. దీనికి రాయలసీమ జేఏసీ కన్వీనర్ బొజ్జా దశరథ రాంరెడ్డి, మాజీ పోలీసు అధికారి హనుమంతరెడ్డి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనుమరాలు శ్యామలా రెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు. విభజన బిల్లులో తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌కు గతంలో మాదిరిగా కర్నూలును రాజధానిగా ప్రకటిస్తే ఈ వివాదం ఉండేది కాదని వక్తలు పేర్కొన్నారు. -
సీమలోనే రాజధాని ఉండాలి
తిరుపతి కల్చరల్: శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో రాజధాని ఏర్పా టు చేయడం ప్రభుత్వాల విధి అని దీనిని విస్మరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని పలువురు వక్తలు హెచ్చరించారు. రాయలసీమ అధ్యయన సంస్థల అధ్యక్షుడు భూమన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని గీతం స్కూల్లో ఆదివారం ‘రాయలసీమలోనే రాజధాని’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ముఖ్య అతిథిగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 1953 నుంచి రాజధాని విషయంలో తీవ్రంగా నష్టపోతున్నది సీమ వాసులేనన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోవడం మొదలు నేటి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వరకు సీమ ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక కమిటీ వేసిన ప్రభుత్వం ఆ నివేదిక రాకమునుపే గుంటూరు, విజయవాడ రాజధానులంటూ లీకులు ఇవ్వడం విడ్డూరమన్నారు. రాయలసీమ అభివృద్ధి జరగాలంటే కర్నూలును రాజధాని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని సాధనకు ఐక్య ఉద్యమాలు చేపట్టకతప్పని పరిస్థితి నెలకుంటోందన్నారు. రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ సీమలో రాజధాని కోరడం ప్రతి తెలుగువాడి హక్కు అన్నారు. రాజధాని ఏర్పాటులో భిన్నస్వరాలు వినపించడం భావ్యం కాదన్నారు. ఐక్యతతో ఉద్యమించినప్పుడే సీమలో రాజధాని సాధ్యమవుతుందని సూచించారు. ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఉద్యమం రాజకీయ స్వార్థపరుల కారణంగా నీరుగారిపోయిందన్నారు. కనీసం సీమలో రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచే సీమలో రాజధాని సాధన ఉద్యమం బలోపేతం కావాలని సూచించారు. రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నేడు రాజధాని విషయంలో కూడా సీమ వాసులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. గీతం స్కూల్ కరస్పాండెంట్ తమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ రాయలసీమపై స్పష్టమైన నివేదిక ఇచ్చినా దీనిపై తిరిగి కమిటీల పేరుతో పాలకులు కాల యాపన చేయడం దారుణమన్నారు. మరో ఉద్యమంతో పాలకులకు గుణపాఠం చెప్పి సీమలో రాజధాని సాధించాల్సిన అవసరం ఉందన్నా రు. రిటైర్డ్ ఐజీ హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు చట్టబద్ధతతో కర్నూలును రాజధాని చేశారన్నారు. దీనిని విస్మరించి ఇప్పుడు గుంటూరు, విజయవాడ రాజధానులకు అనుకూలమని పాలకులు చెప్పడం శోచనీయమన్నారు. సీమలో రాజధాని కోసం బలోపేతమైన ఉద్యమం అవసరమన్నారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయరామిరెడ్డి, రిటైర్డ్ ఎంఈవో బాలాజి, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు కుసుమ, రాయలసీమ ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథశర్మ, సీనియర్ జర్నలిస్టు రాఘవశర్మ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.