రాయల సీమ ఒక రాష్ట్రం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం
బాబుపై ధ్వజమెత్తిన భూమన్
తిరుపతి: కోస్తా జిల్లాల వారి ఒత్తిడులకు తలొగ్గి ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ ఆరోపించారు. తాను రాసిన ‘రాయలసీమ రాష్ట్రం ఒక డిమాండ్’ అన్న పుస్తకం సోమవారం తిరుపతిలోని ప్రెస్‌క్లబ్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పి. అంజయ్య ఆవిష్కరించిన సందర్భంగా భూమన్ మాట్లాడుతూ, రాయలసీమకు కృష్ణా నది నీళ్లు రావడానికి ముఖద్వారం లాంటి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచితే, ఆ నీళ్లు రానీయకుండా తెలుగుదేశం నాయకులు అడ్డుపడ్డారని ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 854 అడుగులకు చేరితేనే కిందకి వదలాలన్న నిబంధనను తుంగలోతొక్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే 69వ నెంబరు జీవో తెచ్చి, 843 అడుగులకు చేరగానే కిందికి వదిలేసేటట్టు చేశారని, దీని వల్ల పోతిరెడ్డిపాడుకు నీళ్లు రాకుండా అడ్డు పడ్డారని ఆరోపించారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఈ సీమకు ద్రోహం చేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. ఈ చీకటి జీవోను రద్దు చేయాలని కోరారు. కడప ఉక్కు కర్మాగారం రాయలసీమ వాసుల హక్కని, దీన్ని సాధించాలని, అలాగే గుంతకల్లు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, కడప ఉక్కు కర్మాగారాన్ని వెంటనే నిర్మించాలని, విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయాలని, రాయలసీమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
దేశంలోని చాలా రాష్ట్రాలకంటే రాయలసీమ పెద్దదని, ప్రపంచంలో రాయలసీమకంటే చాలా చిన్న ప్రాంతాలు దేశాలుగా మనుగడ సాగిస్తున్నప్పుడు రాయలసీమ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు మనుగడ సాగించలేదని ప్రశ్నించారు. రాయలసీమలో దొరికినన్ని ఖనిజ లవణాలు మరెక్కడా లేవని, వీటిని వెలికి తీస్తే ఈ సీమ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాయలసీమ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఎలా మనుగడ సాగించగలదో తన పుస్తకంలో వివరాలన్నీ ఇచ్చానని చెప్పారు.