అన్ని ప్రాంతాల్లోనూ పెరిగిన చలి
అనేకచోట్ల 18 నుంచి 24 డిగ్రీలకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
పగటి ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీలలోపే నమోదు
అరకులో అతి తక్కువగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత
విశాఖ ఏజెన్సీ, రాయలసీమలోనూ బాగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఎల్‌నినో ప్రభావం, నైరుతి తిరోగమనంలో ఎక్కువ వర్షాలు కురిసిన ఫలితం
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది. సాధారణంగా ఈ సమయంలో 22 నుంచి 26 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఏజెన్సీ ప్రాంతాల్లో 18 నుంచి 22 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండేవి.
కానీ.. తాజాగా మైదాన ప్రాంతాల్లోనే 18 నుంచి 24 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ రీజియన్‌లోనూ చాలాచోట్ల 12 నుంచి 20 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు మించడం లేదు.
ఏజెన్సీలో చలి విజృంభణ
చలితో ఏజెన్సీలో ప్రజలు వణుకుతున్నారు. మళ్లీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు శుక్రవారం పడిపోయాయి. సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి సమయంలో చలిప్రభావం మరింత అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.
అరకులోయలో 8.2 డిగ్రీలు, జి.మాడుగుల 9, డుంబ్రిగుడ 9.2, అనంతగిరి 9.5, జీకే వీధి 9.8, పాడేరు మండలం మినుములూరు 10, హుకుంపేట 10.5, చింతపల్లి 10.6, కొయ్యూరు 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి.
వణుకుతున్న ఏజెన్సీ
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో డిసెంబర్ 16న అతి తక్కువగా 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోయారు. ఈ నెల 4న అరకు సమీపంలోని కుంటలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, అనంతగిరి, డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో 7 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సాధారణంగా కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే చాలాచోట్ల ఏజెన్సీలో 12 నుంచి 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అంతకంతకు పడిపోతున్నాయి. రాయలసీమలోని వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 23 డిగ్రీల వరకూ పడిపోయాయి.
ఎల్‌నినో ప్రభావమే కారణం
నైరుతి రుతుపవనాలు తిరోగమించే సమయంలో ఈసారి రాష్ట్రమంతటా వర్షాలు కురిశాయి. డిసెంబర్ చివరి వరకూ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేకువజామున మంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి.
దట్టమైన మంచులో వాహనాలు వెళ్లేందుకు దారులు కనిపించడంలేదు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటితే గానీ మంచు వీడటం లేదు. చలికి చల్లగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు సైతం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment