Visakhapatnam Agency
-
చలి పంజా
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది. సాధారణంగా ఈ సమయంలో 22 నుంచి 26 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఏజెన్సీ ప్రాంతాల్లో 18 నుంచి 22 డిగ్రీల వరకూ కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండేవి. కానీ.. తాజాగా మైదాన ప్రాంతాల్లోనే 18 నుంచి 24 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ రీజియన్‌లోనూ చాలాచోట్ల 12 నుంచి 20 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు మించడం లేదు.ఏజెన్సీలో చలి విజృంభణచలితో ఏజెన్సీలో ప్రజలు వణుకుతున్నారు. మళ్లీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు శుక్రవారం పడిపోయాయి. సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి సమయంలో చలిప్రభావం మరింత అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. అరకులోయలో 8.2 డిగ్రీలు, జి.మాడుగుల 9, డుంబ్రిగుడ 9.2, అనంతగిరి 9.5, జీకే వీధి 9.8, పాడేరు మండలం మినుములూరు 10, హుకుంపేట 10.5, చింతపల్లి 10.6, కొయ్యూరు 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి.వణుకుతున్న ఏజెన్సీఅల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో డిసెంబర్ 16న అతి తక్కువగా 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోయారు. ఈ నెల 4న అరకు సమీపంలోని కుంటలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, అనంతగిరి, డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో 7 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే చాలాచోట్ల ఏజెన్సీలో 12 నుంచి 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ అంతకంతకు పడిపోతున్నాయి. రాయలసీమలోని వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 నుంచి 23 డిగ్రీల వరకూ పడిపోయాయి.ఎల్‌నినో ప్రభావమే కారణంనైరుతి రుతుపవనాలు తిరోగమించే సమయంలో ఈసారి రాష్ట్రమంతటా వర్షాలు కురిశాయి. డిసెంబర్ చివరి వరకూ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేకువజామున మంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి.దట్టమైన మంచులో వాహనాలు వెళ్లేందుకు దారులు కనిపించడంలేదు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటితే గానీ మంచు వీడటం లేదు. చలికి చల్లగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు సైతం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. -
ఇక లంబసింగి.. లెక్క పక్కా..!
సాక్షి, విశాఖపట్నం: లంబసింగి.. ఈ పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది అందమైన, ఎత్తయిన కొండ ప్రాంతం. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఓ కుగ్రామం. పర్వత శ్రేణుల్లో మంచు సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశం. ఆంధ్రా కశీ్మరుగా ఖ్యాతి గడించింది. ‘0’(సున్నా) డిగ్రీల కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతల నమోదుతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అందుకే శీతాకాలం వచ్చిందంటే చాలు.. లంబసింగికి టూరిస్టులు క్యూ కడతారు. దేశ, విదేశాల నుంచి వచ్చి వాలతారు. అక్కడ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తారు. శీతాకాలంలో లంబసింగిలో ‘జీరో’ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట! అంటూ జనం తరచూ విశేషంగా చర్చించుకుంటారు. కానీ ఆ లెక్క పక్కా కాదని ఎంతమందికి తెలుసు? అక్కడ ఉష్ణోగ్రతలను గాని, వర్షపాతాన్ని గాని నమోదు చేసే యంత్రాంగం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో లంబసింగి ఉంది. ఇక్కడికి 19.7 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్)లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతల కంటే లంబసింగిలో రెండు డిగ్రీలు తక్కువగా రికార్డయినట్టు చెబుతున్నారు. ఉదాహరణకు చింతపల్లిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే లంబసింగిలో ‘0’ డిగ్రీలు రికార్డయినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లూ దీనినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లంబసింగిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. దీనిని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో దీనిపై కొంత కసరత్తు జరిగినా ఆ తర్వాత మరుగున పడింది. లంబసింగిలో ఏఆర్జీ.. తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లంబసింగిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్జీ) స్టేషన్‌ను మంజూరు చేసింది. లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సమీపంలో దీనిని ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ఏఆర్జీ ఏర్పాటయితే ఆ ప్రాంతంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షపాతం, గాలిలో తేమ శాతం రికార్డవుతాయి. దీని నిర్వహణను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (సీడబ్ల్యూసీ) చూస్తుంది. మరికొన్నాళ్లలో లంబసింగిలో ఏఆర్జీ సిస్టం అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచి అక్కడ కచ్చితమైన వాతావరణ సమాచారం రికార్డవుతుందని సీడబ్ల్యూసీ డైరెక్టర్ సునంద ‘సాక్షి’కి చెప్పారు. సముద్రమట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో.. లంబసింగి తూర్పు కనుమల పర్వత శ్రేణుల్లో ఎత్తయిన ప్రదేశంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ కాఫీ తోటలు, యూకలిప్టస్ చెట్లతో నిండి ఉంటుంది. సముద్రమట్టానికి అరకు 2,700 అడుగులు, చింతపల్లి 2,800 అడుగుల ఎత్తులోనూ ఉంటే లంబసింగి 3,000 అడుగుల (వెయ్యి మీటర్ల) ఎత్తులో ఉంది. దీంతో లంబసింగి శీతాకాలంలో పొగమంచు దట్టంగా అలముకుని ఆహ్లాదం పంచుతుంది. మంచు ఐస్‌లా గడ్డ కట్టుకుపోతుంది. అంతేకాదు.. అత్యల్ప (0–3 డిగ్రీల) ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. లంబసింగి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం పర్యాటకశాఖ గుడారాలను కూడా ఏర్పాటు చేసింది. కొర్రబయలు నుంచి లంబసింగి.. లంబసింగికి కొర్రబయలు అనే పేరు కూడా ఉంది. కొర్ర అంటే కర్ర. బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా చలికాలంలో మంచు తీవ్రతకు ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారని, అందుకే కొర్రబయలు పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతారు. -
‘ఔషధాల అడ్డా’కు
హుకుంపేట(అరకు): గిరిజన ప్రాంతంలో ఆరోగ్యపరంగా, వాణిజ్యపరంగా పేరు గాంచింది అడ్డ తీగ. ఫణెర వహ్లి అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ అడ్డ చెట్లు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో అడవితో పాటు పలు చోట్ల సహజంగాను పెరుగుతాయి. ఈ అడ్డ ఆకులతో విస్తరాకులు, బెరడుతో తాళ్లు, అడ్డ గింజలు.. ఇలా చెట్టులోని అన్ని భాగాలు గిరిజనులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను, గింజలను, అడవుల నుంచి సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు అడ్డ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఈ ఆకులను తింటే ఆరోగ్యానికి మేలు చేకూరటమే కాక, జీర్ణ సంబంధిత సమస్యలు కూడ తగ్గుతాయి. అడ్డ గింజల్లో ప్రోటీన్, కాల్షియం ఇంకా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఏజెన్సీలో సంక్రాంతి రోజు గిరిజన సంప్రదాయ వంటకం పులగంలో ఈ అడ్డ గింజలు వేసి దేవతలకు నివేదిస్తారు. ఆ తర్వాత పులగాన్ని అడ్డాకులలో భుజిస్తారు. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అడ్డాకులను ప్రసాదం ప్యాకింగ్ కోసం నేటికీ వాడుతుండటం విశేషం. నేటి తరానికి వివరించాలి క్రమేపీ గిరిజనుల్లో అడ్డ ఆకుల సంప్రదాయపు అలవాట్లు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత తరానికి వీటి ప్రాముఖ్యత తెలియక వాటిని పట్టించుకోవటం లేదు. మరోవైపు అడ్డాకుతో తయారయ్యే విస్తరాకుల ఉత్పత్తి తగ్గటం వలన పేపర్ ప్లేట్ వాడటం పెరిగింది. పేపర్ ప్లేట్లు పర్యవరణానికి అంత అనుకూలమైనది కాదు కనుక ఈ అడ్డతీగ ప్రాముఖ్యత అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. సహజంగా దొరికే ఈ అడ్డాకులతో విస్తర్లుగా చేసి పేపర్ ప్లేట్లకు ప్రత్యామ్నయంగా వాడితే పర్యవరణానికి మేలు చేసినట్లేనని పలువురు మేధావులు, గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు. అడ్డ ఆకు, తీగలతో ప్రయోజనాలు ► అడ్డాకులతో విస్తరాకుల తయారీ ► అడ్డ తీగలతో నారలు చేసి కంచెలు కట్టడం ► అడ్డ తీగలతో బుట్టలు అల్లుకోవటం ► అడ్డ గింజలను ఆహారం(స్నాక్స్) రూపంలో తీసుకోవటం అప్పట్లో అడ్డాకులే జీవనాధారం మా చిన్నతనంలో అడవిలోకి వెళ్లి అడ్డాకులు సేకరించే వాళ్లం. వాటిని ఎండబెట్టి, వారానికి ఒకసారి వారపు సంతల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించాం. అడ్డ గింజలతో కూర వండుకునేవాళ్లం. ఇప్పుడు అడ్డాకులు సంతల్లో అమ్ముదామన్నా గిట్టుబాటు ధర ఉండట్లేదు. ప్రభుత్వ అధికారులు జీసీసీ ద్వారా అడ్డాకులు కొనుగోలు చేస్తే మాకు ఉపాధి కలుగుతుంది. –పాంగి కాసులమ్మ, కామయ్యపేట గ్రామం, హుకుంపేట మండలం ఆరోగ్యానికి మంచిది విశాఖ ఏజెన్సీ అడవుల్లో సహజంగా దొరికే ఈ అడ్డాకులు, అడ్డ గింజలు ఆరోగ్యపరంగా ఎంతో మంచివి. వీటిని వీడీవీకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే గిరిజనులకు మంచి ఉపాధి లభిస్తుంది. వీటితో విస్తరాకులు తయారు చేసి ఉపయోగిస్తే పేపర్ ప్లేట్లు విక్రయాలు తగ్గించి, పర్యావరణాన్ని కాపాడవచ్చు. విస్తరాకుల ద్వారా మంచి ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. –డా.శ్రావణ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విశాఖ -
మన్యంలో చలి పులి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతుండడంతో పాటు పొగమంచు దట్టంగా కురుస్తున్నది. చింతపల్లిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు దిగజారాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వ్యాప్తి చెందుతుండడంతో మన్యం వాసులు చలిపులితో ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 10 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
Andhra Pradesh: రాష్ట్రంపై చలి పంజా
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గతానికి భిన్నంగా రాష్ట్రంలో చలి ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయింది. శీతాకాలంలో చలి వాతావరణం సాధారణమే అయినా ఈసారి దాని తీవ్రత ఎక్కువైంది. అన్ని ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. విజయవాడ వంటి వెచ్చని ప్రదేశాలను కూడా ఈ శీతాకాలం వణికిస్తోంది. 50 ఏళ్ల తర్వాత విజయవాడలో రెండు రోజుల కిందట 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మామూలుగా విజయవాడ, పరిసర ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుంది. శీతాకాలం కూడా అంత తీవ్రమైన చలి వాతావరణం కనిపించదు. కానీ ఈ సంవత్సరం రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. ఈనెల 18వ తేదీ నుంచి వరుసగా 13.5 నుంచి 13.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచే చలి తీవ్రత పెరిగి ఉదయం 8 గంటల వరకు కొనసాగుతోంది. కృష్ణాజిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే ఉంది. 2 నుంచి 4 డిగ్రీలకు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల వరకు నమోదవుతాయి. విశాఖ మన్యంలో 8 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలుంటాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చింతపల్లి, పెదబయలు, డుంబ్రిగూడ, అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో 5 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆ ప్రాంతాలు చలికి గడ్డకడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లోను చలితీవ్రత పెరిగింది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్‌లో ఈ నెల 18న 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకులో 5.4 డిగ్రీలు గురువారం ఉదయం విశాఖ జిల్లా అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 5.4 డిగ్రీలు నమోదైంది. పెదబయలు, డుంబ్రిగూడల్లో 5.7, జి.మాడుగులలో 5.9, జీకే వీధిలో 6.5, చింతపల్లి 7.7లో, హకుంపేటలో 7.8, పాడేరులో 8 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అదేరోజు కర్నూలు నగరంలో 14.2 డిగ్రీలు, విజయవాడలో 14.6, అనంతపురంలో 15.2, తిరుపతిలో 15.8, ఒంగోలు, ఏలూరుల్లో 15.9, శ్రీకాకుళం, కడపల్లో 16.2, గుంటూరులో 16.3, విశాఖపట్నంలో 18.2, కాకినాడలో 18.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి కారణాలివే.. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కిలోమీటర్ల ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలితీవ్రత పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తూర్పు గాలులు ఉత్తర భారతదేశం నుంచి మన రాష్ట్రానికి నేరుగా వీస్తున్నాయి.తేమ తక్కువగా ఉండడం వల్ల చలిగాలులు పెరిగాయి. చలితీవ్రత మరో 2, 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత జనవరి 15వ తేదీ వరకు మామూలు చలి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చలిలో తిరగవద్దు చలి గాలుల వల్ల శ్వాసకోశ సమస్యలు, బ్రాంకైటిస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. చలిలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలి ముక్కు, చెవులకు తాకకుండా జాగ్రత్త వహించాలి. – డాక్టర్ గోపీచంద్, పల్మనాలజీ విభాగాధిపతి, విజయవాడ జీజీహెచ్ -
రాష్ట్రం గజగజ
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా మంగళవారం విశాఖ జిల్లా జి.మాడుగులలో 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు లోయలో 3.9, డుంబ్రిగూడ 4.4, జీకే వీధి 4.8, ముంచంగిపుట్టు 5.1, పెదబయలు 5.2, హుకుంపేట 5.9, పాడేరులో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్‌లో 7.1 డిగ్రీలు నమోదైంది. విజయవాడలోనూ చలి తీవ్రత పెరగడంతో మంగళవారం 13.8 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 13.6 నమోదైంది. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరులో 14.2, తిరుపతిలో 15.9, విశాఖలో 18.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర తీరం మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో మూడు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ముంచంగిపుట్టులో 12.63 డిగ్రీలు, జి.మాడుగులలో 13.64, డుంబ్రిగూడలో 13.74, అరకులో 13.91, పెదబయలులో 14.61, హుకుంపేటలో 14.80, పాడేరులో 15.16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
80.8 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో నిర్వహిస్తున్న ఆపరేషన్ పరివర్తనలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు బృందాలు గురువారం మొత్తం 80.8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ అన్నవరం, గొర్లమెట్ట గ్రామాల్లో 70 ఎకరాలు, జి.కె.వీధి మండలం రింతాడ పంచాయతీ మర్రిపాలెం సమీపంలో 10.8 ఎకరాల గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. ముందుగా ఆయా గ్రామాల్లో గిరిజనులకు గంజాయి నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పోలీసుల ప్రచారాలకు ప్రభావితమైన గిరిజనులు స్వచ్ఛందంగానే గంజాయి తోటల ధ్వంసానికి ముందుకొస్తున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ సతీష్‌కుమార్ పర్యవేక్షణలో గంజాయి తోటలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప ఎస్ఐ జె.లోకేష్‌కుమార్, జి.కె.వీధి ఎస్ఐ షేక్ షమీర్ తదితరులు పాల్గొన్నారు. 34 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద గురువారం పోలీసులు రూ.68 వేల విలువైన 34 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఒకరు పరారయ్యారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనం, బైకు, స్కూటీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని మాకవరం పంచాయతీ అరబీరు గ్రామానికి చెందిన సీసా నాగేశ్వరరావు, ఒడిశా రాష్ట్రం కలహండి గ్రామానికి చెందిన పబిత్రా కటలుగా గుర్తించినట్లు ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. -
288 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు : ఆపరేషన్ పరివర్తనలో భాగంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలు రోజువారీ గంజాయి తోటలపై దాడులు చేపడుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లోని 288 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శంకర్‌రెడ్డి చెప్పారు. జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ బీరం, గడ్డిబందలు, అనర్భ, వెంకటపాలెం, చెలమరంగి గ్రామాల సమీపంలోని 211 ఎకరాలు, డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ గంజిగుడ, కండ్రూం గ్రామాల సమీపంలోని 15 ఎకరాలు, చింతపల్లి మండలం అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోటగున్నల కాలనీ, చోడిరాయి, రామారావుపాలెం గ్రామాల్లోని 62 ఎకరాల్లోని గంజాయి తోటలన్నింటినీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసుశాఖ బృందాలు ధ్వంసం చేశాయి. చింతపల్లి మండలం బెన్నవరం, లోతుగెడ్డ, అన్నవరం గ్రామాల్లో కళాజాత బృందాలు గంజాయి వలన జరిగే అనర్థాలపై గిరిజనులకు పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. -
గంజాయి తోటల నిర్మూలనే లక్ష్యం
పాడేరు/చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) బృందాలు పనిచేస్తున్నాయని ఆ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఏజెన్సీలో గురువారం మొత్తం 190 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. ఏజెన్సీలోని పెదబయలు మండలం మారుమూల మావోయిస్టు ప్రభావిత పూటూరు, పంగలం గ్రామాల పరిధిలోని గంజాయి తోటల ధ్వంసాన్ని ఆయన గురువారం పర్యవేక్షించారు. ఈ మారుమూల గ్రామాలకు కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్‌తో పాటు ఎస్ఈబీ విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఏడు ఎస్ఈబీ బృందాల సభ్యులు వెళ్లారు. ఇక్కడ సాగవుతున్న గంజాయి తోటలను కమిషనర్ పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 115 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. సుమారు 5.75 లక్షల గంజాయి మొక్కలను నరికేసి నిప్పంటించారు. చింతపల్లి మండలం అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని కొండపల్లి, వర్తనపల్లి గ్రామాల పరిధిలో సుమారు 75 ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని గురువారం గిరిజనులతో కలిసి ఏఎస్పీ తుషార్ డూడి ధ్వంసం చేశారు. అన్నవరం ఎస్ఐ ప్రశాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 120 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు గురువారం రూ.2.4 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. మండలంలోని జోలాపుట్టు నుంచి ముంచంగిపుట్టు మార్గంలో గుమ్మసీర్గంపుట్టు వద్ద వనుగుమ్మ నుంచి వస్తున్న ఎపి35టి9551 నంబరు జీపులో తనిఖీ చేసి 6 బస్తాల గంజాయిని పట్టుకున్నట్లు స్థానిక ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. జీపులో ఉన్న నలుగురిని, జీపు వెనక బైకుపై పైలెటింగ్ చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయిని, జీపును, బైకును సీజ్‌చేశామన్నారు. నిందితుల వద్ద ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. -
గిరిజన గర్భిణులకు కొండంత రక్షణ
సాక్షి,అమరావతి: మన్యంలోని గర్భిణులకు కొండంత రక్షణగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మరింత సమన్వయంతో సమర్థవంతమెన ఆరోగ్య సేవలు అందించేలా ‘ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ మానిటరింగ్ సిస్టం’ (గిరిజన ఆరోగ్య సమన్వయ పర్యవేక్షణ విధానం) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ దీనిని నిర్వహించనుంది. గిరిజన గర్భిణులకు కొత్తగా అందించనున్న సేవలతోపాటు కొత్త యాప్‌ను కూడా సోమవారం ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. విశాఖ జిల్లా పాడేరులో నిర్వహించే ట్రయల్ రన్‌ను ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పర్యవేక్షిస్తారు. యాప్‌తో ప్రయోజనాలు ఇలా ఏజెన్సీ ప్రాంత గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన ఈ ప్రత్యేక యాప్‌తో ప్రయోజనం మెండుగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గిరిజనుల ఆరోగ్య సమాచారం సేకరించి ఈ యాప్‌లో పొందుపరుస్తారు. గర్భిణుల నుంచి చిన్నారుల వరకు అవసరమైన వైద్యసేవలు సకాలంలో అందించేలా ఈ యాప్ ఎప్పటికప్పుడు అధికారులను, సంబంధిత విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. సమాచార సేకరణ నుంచి వైద్య సేవలు అందించే వరకు గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, విద్యా శాఖల సమన్వయంతో పనిచేసేలా దీనిని రూపొందించారు. యాప్‌లో పొందుపరిచిన సమాచారం మేరకు ప్రసవానికి 30 రోజుల ముందు నుంచే గర్భిణులకు వైద్యం అందించే వైద్యంపై ఆయా కుటుంబాల వారికి ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అవగాహన కల్పిస్తారు. 20 రోజుల ముందు వారిని ఏ ఆస్పత్రికి తరలించేది గ్రామ సచివాలయాలకు సమాచారం అందిస్తారు. ప్రసవానికి 15 రోజుల ముందు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రికి సమాచారం అందిస్తారు. 10 రోజుల ముందు ఐటీడీఏ పీవోలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తారు. ప్రసూతి వసతి గృహాలకు తరలింపు ఈ యాప్ ద్వారా ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూ మరోవైపు గర్భిణులకు అవగాహన, వారి బంధువులకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రసవానికి 30 నుంచి 10 రోజుల సమయం ఉండగానే ప్రసూతి వసతి గృహాలకు తరలిస్తారు. ఇందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 41 ప్రసూతి వసతి గృహాలను ఏర్పాటు చేశారు. వాటిలో 2,600 బెడ్లు సమకూర్చారు. ప్రసవానికి ముందు నుంచి గర్భిణులు ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేలా ఆట పాటలతో కూడిన వాతావరణ కల్పిస్తారు. అంతేకాకుండా వారికి ఆరోగ్యం పట్ల అవగాహన తరగతులు నిర్వహించడంతోపాటు బలమైన ఆహారం అందిస్తారు. తల్లీబిడ్డల మరణాలు తగ్గించడమే లక్ష్యం గిరిజన ప్రాంతాల్లో తల్లీబిడ్డల మరణాలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డోలీతో మోసుకొచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతూ బైక్ అంబులెన్సులు అందుబాటులోకి తెచ్చాం. ఈ యాప్‌లో గర్భిణుల వివరాలతోపాటు గురుకుల విద్యార్థుల వివరాలు, చిన్నారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వారికి అందించాల్సిన వైద్య సేవలు వంటి ఎన్నో వివరాలు ఉంటాయి. – పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
రెండ్రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో స్వల్ప అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలహీనపడి నెల్లూరు, తమిళనాడు వైపుగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వివరించారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 12న దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఈ నెల 13 నుంచి మొదలయ్యే సూచనలున్నాయని వెల్లడించారు. విజయవాడలో అత్యధిక వర్షపాతం 2021లో అత్యధిక వర్షపాతం నమోదైన నగరంగా విజయవాడ రికార్డు సృష్టించింది. తర్వాత స్థానంలో కడప ఉండటం విశేషం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాల్ని పరిశీలిస్తే.. విజయవాడలో అత్యధికంగా 1,548 మి.మీ. వర్షపాతం నమోదైంది. కడపలో 1,342, విజయనగరంలో 1,331 మి.మీ. వర్షం కురిసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నగరాల జాబితాలో అట్టడుగున నెల్లూరు 440 మి.మీ. వర్షపాతంతో ఉండగా, కర్నూలులో 461, కావలిలో 552, ఒంగోలులో 698 మి.మీ. వర్షపాతం నమోదైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ ఏజెన్సీలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సూర్యోదయం అయ్యే వరకు చలి తీవ్రత నెలకొంది. అతిశీతల ప్రాంతాలుగా గుర్తింపు పొందిన కాఫీ తోటల ఏరియాల్లో మాత్రం చలిగాలులు అధికంగా వీస్తున్నాయి. పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిశీతల ప్రాంతం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నెల 3న 17 డిగ్రీలు, 4వ తేదీన 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం ఉదయం 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం 14.4, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయంలో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత
గొలుగొండ/మాడుగుల: విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బొలెరో జీపులో అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని గొలుగొండ ఎస్ఈబీ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కొయ్యూరు మండలం ధర్మవరం వద్ద గంజాయి పట్టుకున్నట్లు ఎస్ఈబీ సీఐ రాజారావు, ఎస్ఐ గిరి తెలిపారు. దీని విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఎస్.సత్యనారాయణ, రామన్న, నారాయణరావు అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. వారి నుంచి బైక్, బొలెరో జీపు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 60 కిలోల పట్టివేత విశాఖ జిల్లా మాడుగుల మండలం తాటిపర్తి జంక్షన్ వద్ద బుధవారం మాడుగుల ఎస్ఐ పి.రామారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గంజాయి పట్టుకున్నారు. తాటిపర్తి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖ మన్యం నుంచి వస్తున్న మారుతీ కారులో 60 కిలోల గంజాయి బయటపడింది. కారు సీజ్ చేసి గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
గంజాయి నిర్మూలనకు గిరిజనుల ప్రతిన
జి.మాడుగుల/గూడెం కొత్తవీధి: గంజాయి పంటను ఇకపై సాగు చేయబోమని గిరిజనులు ప్రతిన బూనారు. గంజాయి సాగు, రవాణాను పూర్తిగా రూపుమాపేందుకు నడుం కట్టారు. విశాఖ ఏజెన్సీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ‘పరివర్తన’ కార్యక్రమంతో గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. జి.మాడుగుల మండలం మారుమూల గ్రామాల్లో ఇప్పటికే గిరిజనులు గంజాయి సాగును నిషేధిస్తూ తీర్మానించుకుని తోటలను నరికి పారేస్తున్నారు. మండలంలోని నుర్మతి పంచాయతీ పినజాగేరు, వండ్రాంగుల, వాకపల్లి, డిప్పలగొంది, గాదిగుంట గ్రామాల సమీపంలోని కొండ ప్రాంతాల్లో 100 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను సోమవారం గిరిజనులు కత్తులు పట్టి నరికి ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలోని దామనాపల్లిలో సర్పంచ్ కుందరి రామకృష్ణ గ్రామపెద్దలు, యువకులను చైతన్యపరిచి సాగు చేస్తున్న గంజాయి తోటల్లో మొక్కలను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ ఫీల్డ్‌మెన్ గోవింద్, గ్రామ వలంటీర్లు, యువకులు పాల్గొన్నారు. -
పూల సాగు.. గిరిజన రైతులకు వరం
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: గిరిజన ప్రాంతాల్లో పూల సాగును చేపట్టేలా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణ పరిస్థితులు, భూమి ఇందుకు అనువుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతిన పూలు, కూరగాయల సాగు చేపడితే హార్టీకల్చర్ విభాగంతో పాటు.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇతోధికంగా తోడ్పడుతుందని వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. విశాఖ ఏజెన్సీ రైతులు తరతరాలుగా వరి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, రాజ్మా, చిక్కుళ్లు, వలిశలు వంటి ఆహార పంటలను, అల్లం, మిరియాలు, కాఫీ వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. అధిక వర్షాలతో ఈ పంటలు ఆశించిన ఆదాయాన్ని ఇవ్వలేకపోతుండడంతో కొంతమంది రైతులు చట్ట విరుద్ధమైన పంటల్ని సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను నిషేధించినా అటువైపే మొగ్గు చూపుతుండటంతో.. రైతులను పూల సాగు వంటి వాణిజ్య పంటల వైపు మరల్చేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యాచరణను తయారు చేసినట్టు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. పూలసాగుతో లంబసింగి, అరకు మరింత ఆకర్షణీయం ఇందులో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్నే ఓ ప్రయోగ క్షేత్రంగా మార్చాలని, పెద్ద ఎత్తున పూలసాగు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత వాతావరణం పూల సాగుకు అనువైన స్థలంగా అభివర్ణించారు. రైతులకు ఈ మేరకు అవగాహన కల్పించేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 5 రకాల గ్లాడియోలస్, 3 రకాల ట్యూబారస్, రెండు రకాల చైనా ఆస్టర్, బంతి, చామంతి, తులిప్ వంటి పూల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు వివరించారు. ఈ పూల సాగును విజయవంతం చేసి.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్‌కు మారుపేరుగా నిలపాలని సూచించారు. పూల తోటల్ని విరివిగా పెంచితే లంబసింగితో పాటు, ఏపీ ఊటీ అయిన అరకు.. పర్యాటకుల్ని మరింత ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు పాలీహౌస్‌ల అవసరం లేకుండానే పూలను సాగు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూల సాగును ఇప్పటికిప్పుడు చేపడితే ఐదేళ్లలో గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో పూల సాగు.. వివిధ రకాల పూలు, కూరగాయల పంటల సాగుపై శిక్షణ పొందుతున్న చింతపల్లి సేంద్రియ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఈ పంటల్ని సాగు చేసేందుకు నడుంకట్టారు. గ్లాడియోలస్, తులిప్, నేల సంపంగి, చైనా ఆస్టర్, బంతి, చేమంతి సాగు చేపట్టారు. వీటితో పాటు సేంద్రియ పద్ధతిన కూరగాయల పెంపకాన్ని కూడా చేపట్టి చదువుతో పాటు రోజు వారీ ఖర్చులకు డబ్బును సమకూర్చుకుంటున్నారని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రామారావు వివరించారు. -
మొదలకంటా ‘గంజాయి’ నరికివేత
సాక్షి, విశాఖపట్నం/జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట నిర్మూలన కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. గంజాయి ఎక్కడ సాగవుతుందో తెలుసుకొని.. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి నిర్మూలనలో పాల్గొంటున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారులతో కలిసి పోలీసులు గంజాయి నిర్మూలనకు ‘పరివర్తన’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జి.మాడుగుల మండలం ఏడుసావళ్లు, చీకుంబంద గ్రామాల సమీపంలో శనివారం ఒక్కరోజే దాదాపు 80 ఎకరాల్లోని గంజాయి తోటలను పోలీసులు, స్థానికులు ధ్వంసం చేశారు. విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది కత్తి చేతపట్టి గంజాయి మొక్కలను నరికేశారు. గూడెం కొత్తవీధి మండలం నేలజర్త, బొరుకుగొంది, కనుసుమెట్ట, కిల్లోగూడా, కాకునూరు, గుమ్మిరేవుల సమీప ప్రాంతాల్లో సుమారు 25 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను కూడా శనివారం ధ్వంసం చేశారు. -
2,000 కిలోల గంజాయి స్వాధీనం
చింతూరు: రాష్ట్రంలో గంజాయి రవాణాపై దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ.. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఏఎస్పీ కృష్ణకాంత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. మోతుగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుకుమామిడి అటవీ ప్రాంతం మీదుగా గంజాయి రవాణా జరుగుతుందంటూ వచ్చిన సమాచారంతో సీఐ యువకుమార్, ఎస్ఐ సత్తిబాబు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో కొబ్బరికాయల లోడ్‌తో వచ్చిన ఓ వ్యానును తనిఖీ చేయగా.. కొబ్బరికాయల కింద గంజాయి మూటలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి తెలంగాణకు చెందిన కడియం గురుసాగర్, పొగిడాల పర్వతాలు, ఒడిశాకు చెందిన నైని రామారావును అరెస్టు చేసి.. 2 వేల కిలోల గంజాయి, వ్యాన్‌ను, కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏజన్సీ వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు విస్తృతంగా చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఏజెన్సీలో ముమ్మరంగా గంజాయి తోటల ధ్వంసం సీలేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం కొనసాగుతోంది. బుధవారం గుమ్మరేవుల పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల్లో గంజాయి మొక్కలను స్థానికులు నరికేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా తమ గ్రామాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ చేపట్టిన చర్యలతో చింతగుప్ప, పొలుతురుకోట గ్రామాల ప్రజలు గంజాయి మొక్కలను నరికేసి.. ఇకపై గంజాయి సాగు చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. చింతగుప్ప గ్రామంలో గంజాయి మొక్కలు నరికివేస్తున్న గిరిజనులు -
అడవికి రాచబాట!
► విశాఖ జిల్లా పెదబయలు మండలంలోని నివాసిత ప్రాంతం కొండ్రుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేదు. కొండలు, గుట్టలు ఎక్కి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఆ దుస్థితి తొలగనుంది. గుల్లేలు నుంచి కొండ్రుకు రూ.15.93 కోట్లతో 18.40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ► డుంబ్రిగుడ మండలం సోవ్వ నుంచి చెమడపొడు వరకు 22 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.11.42 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటిదాకా అక్కడ రోడ్డు సదుపాయం లేదు. ► పెదబయలు మండలం రుద్రకోట నుంచి కుమడ పంచాయతీ కిందుగూడ మీదుగా ఒడిశా సరిహద్దు వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. కిందుగూడకు ఇన్నేళ్లుగా కేవలం మట్టి రోడ్డు మాత్రమే ఉంది. వర్షాకాలం అక్కడకు వెళ్లాలంటే అసాధ్యమే. ఇప్పుడు అక్కడ 25.60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ► ముంచంగిపుట్టు మండలం బుంగపుట్ ఏజెన్సీ గ్రామానికి 25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు ఖర్చు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల గిరిజన ప్రాంతాలకు మౌలిక వసతులు కరువయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని పలు నివాసిత ప్రాంతాలకు రహదారుల సదుపాయం లేక అడవి బిడ్డలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరైతే కొండకోనల్లో ప్రయాసలతో వెళ్లాల్సిందే. మట్టి రోడ్లున్నా వర్షాకాలంలో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తితే దేవుడిపై భారం వేయాల్సిందే. ఈ దుస్థితిని తొలగించి ఏజెన్సీ గ్రామాలకు మట్టి రోడ్లు కాకుండా మెటల్, బీటీ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చకచకా పనులు జరుగుతున్నాయి. విడతలవారీగా ఏజెన్సీ గ్రామాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రవాణా సదుపాయం పెరిగి రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 548.91 కిలోమీటర్లు... రూ.308.98 కోట్లు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 11 మండలాలున్నాయి. ఇందులో 3,789 నివాసిత ప్రాంతాల్లో (ఆవాసాలు) 6,58,354 మంది జీవనం సాగిస్తున్నారు. వీటిల్లో 1,610 నివాసిత ప్రాంతాలు, గ్రామాలకు మాత్రమే రోడ్డు కనెక్టివిటీ ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రూ.308.98 కోట్లతో గత రెండేళ్లలో 340 నివాసిత ప్రాంతాలకు 548.91 కిలోమీటర్ల మేర రోడ్డు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టడంతో మొత్తం 1,950 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది. ఇంకా 1,839 నివాసిత ప్రాంతాలకు రోడ్డు సదుపాయాన్ని కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రూ.714 కోట్ల మేర నిధులు అవసరమని అంచనా వేశారు. సాగు హక్కులు.. పథకాల ప్రయోజనం ఇప్పటికే గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూ పంపిణీ చేపట్టి సాగు హక్కులు కల్పించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. గిరిజన గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవలతో పాటు హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. గిరిజనులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏజెన్సీలోని అన్ని నివాసిత ప్రాంతాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వే చేపట్టింది. ‘కనెక్ట్ పాడేరు’ పేరుతో అన్ని వివరాలను సేకరిస్తున్నాం. రోడ్డు సౌకర్యం లేక గర్భిణులు బాగా ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా 340 నివాసిత ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేలా పనులు జరుగుతున్నాయి. –ఆర్.గోపాలకృష్ణ, ఐటీడీఏ పీవో దశాబ్దాల కల సాకారం గుల్లేల గ్రామం నుంచి కొండ్రు వరకు దశాబ్దాల తర్వాత రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాలకు చెందిన గిరిజనుల రవాణా కష్టాలు తీరతాయి. రహదారి సమస్యను గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతోంది. – వరద నాగేశ్వరరావు, ఇంజిరి పంచాయతీ, పెదబయలు మండలం డోలి కష్టాలకు తెర... సోవ్వ నుంచి ఒడిశా బోర్డర్ వరకు రహదారి నిర్మాణం జరుగుతుండడం శుభపరిణామం. సరైన రవాణా వ్యవస్థ లేక అత్యవసర పరిస్థితుల్లో మేం పడుతున్న కష్టాలు ఆ దేవుడికే తెలుసు. రోగులు, గర్భిణులను డోలిలో మోసుకుంటూ ఆస్పత్రులకు తరలించే కష్టాలు తీరనున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే పలు గ్రామాలకు ఉపయోగం. ఒడిశా వాసులకు సైతం రవాణా సౌకర్యం కలుగుతుంది. – తిరుమలరావు, సోవ్వ గ్రామం, డుంబ్రిగుడ మండలం -
కాఫీ ఘుమఘుమ.. అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు..
ఈ ఏడాది కూడా కాఫీ పంట సిరులు కురిపించనుంది. ముందుగానే పండ్ల దశకు చేరుకోవడం రైతులకు ఆనందాన్నిస్తోంది. విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు వాతావరణ పరిస్థితులు కలిసొచ్చాయి. సాక్షి, పాడేరు: ప్రతి ఏడాది ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు వారి జీవనోపాధికి కాఫీ పంట ప్రధానంగా మారింది. విశాఖ మన్యంలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ పంటకు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ ఏజెన్సీని అనేక దేశాలు గుర్తించాయి. ప్రతి ఏడాది గిరిజన రైతులకు ఆర్థిక అవసరాలు తీర్చే ప్రధాన వాణిజ్య పంటగా మారింది. ప్రపంచ స్థాయిలో కాఫీ నాణ్యతలో బ్రెజిల్ ప్రసిద్ధి. ఆ దేశం తర్వాత మన దేశంలో కర్ణాటక రాష్ట్రంతోపాటు విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు ఎంతో పేరుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలోని కాఫీ పంటను ప్రోత్సహిస్తున్నాయి. కాఫీ సాగుకు విశాఖ ఏజెన్సీ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో ప్రతి ఏడాది కాఫీ పంట సాగు విస్తరిస్తుంది. మేలు చేసిన వర్షాలు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే విశాఖ ఏజెన్సీవ్యాప్తంగా వర్షాలు కురవడం కాఫీ తోటలకు ఎంతో మేలు చేసింది. కాఫీ మొక్కలకు పూల పూత కూడా ముందస్తుగానే ఏర్పడింది. తర్వాత కూడా వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ గింజలు వేగంగానే ఏర్పడి ఆశాజనకంగా ఎదగడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా కాఫీ తోటలు విరగ్గాయడంతోపాటు ఇటీవల ముందస్తుగానే కాఫీ పండ్ల దశకు చేరుకోవడం గిరిజన రైతులను మరింత సంతోషపెడుతుంది. గత ఏడాది 12 వేల మెట్రిక్ టన్నుల వరకు క్లీన్ కాఫీ దిగుబడులు ఏర్పడగా, ఈ ఏడాది కూడా అదేస్థాయిలో దిగుబడులు అధికంగా ఉంటాయని కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాడేరు మండలం మోదాపల్లి ప్రాంతంలో పండ్ల దశకు చేరుకున్న కాఫీ మొక్కలు ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలో 2 లక్షల 21 వేల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలు ఉన్నాయి. 2 లక్షల 5 వేల 464 మంది గిరిజన రైతులు ప్రభుత్వాల సహకారంతో కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. వీటిలో లక్షా 58 వేల 21 ఎకరాల కాఫీ తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ఈ తోటల్లో ప్రస్తుతం కాఫీ కాపు అధికంగా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గింజ దశలో ఉన్న కాఫీ పంట ముందస్తుగానే పండ్ల దశకు చేరుకుంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో నవంబర్ రెండో వారం నాటికే గిరిజన రైతులు తమ సాగులో ఉన్న కాఫీ ఫలసాయాన్ని సేకరించే పరిస్థితులు ఉన్నాయి. అధిక దిగుబడులు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే విస్తారంగా వర్షాలు కురవడంతో పూత విరగ్గాసింది. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో కాఫీ తోటల్లో మొక్కలు గింజ దశకు వేగంగానే చేరుకున్నాయి. ప్రస్తుతం కాయలన్నీ పండ్ల దశకు చేరుకుంటుండడంతో ఈ ఏడాది నవంబర్ నుంచే గిరిజనులు ఫలసాయాన్ని సేకరించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది కూడా సుమారు 12 వేల మెట్రిక్ టన్నుల క్లీన్ కాఫీ గింజలు దిగుబడికి వస్తాయని అంచనా వేస్తున్నాం. –భాస్కరరావు, ఇన్చార్జి కాఫీ ఏడీ, ఐటీడీఏ -
గొడ్డళ్లతో గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి/నర్సీపట్నం/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. లంబసింగి సమీపంలో గంజాయి స్మగ్లర్లను తరలిస్తున్న తెలంగాణ పోలీసులపై అక్రమ రవాణా ముఠా దాడికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం వారు గాలిలోకి కాల్పులు జరిపినట్లు విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. నల్లగొండ పోలీసుస్టేషన్లో నమోదైన గంజాయి కేసులో నిందితుల కోసం తెలంగాణ పోలీస్ ప్రత్యేక బృందం విశాఖకు వచ్చిందన్నారు. 15–20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేస్తుండగా రోడ్డుకు అడ్డంగా టిప్పర్‌ను నిలిపి కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఓ గంజాయి స్మగ్లర్కి గాయాలయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. చింతపల్లి మండలం తురబాలగెడ్డ సమీపంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో ఈ ఘటన జరిగింది. గాలిపాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గత వారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ నల్లగొండ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఈ నెల 15వ తేదీన కిల్లో బాలకృష్ణ (30), కిల్లో భీమరాజు (26), నారా లోవ (30) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అక్రమ ఆపరేషన్లపై విచారణ వేగవంతం
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెం గ్రామంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఇటీవల అక్రమంగా నిర్వహించిన కుటుంబ సంక్షేమ ఆపరేషన్లపై సమగ్ర విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. కలెక్టర్, పాడేరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆదేశాల మేరకు పాడేరు తహసీల్దార్ ప్రకాష్‌రావు సోమవారం ఉదయాన్నే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు జరిగిన మెడికల్ షాపుతోపాటు సమీప వీధిని ఆయన పరిశీలించి అక్కడి గిరిజనులను విచారించారు. అనంతరం ఈదులపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని విచారించారు. మెడికల్ షాపులో ఆపరేషన్లు చేసిన వైద్యబృందం వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రి సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. ఆపరేషన్ చేయించుకున్న గిరిజన మహిళల కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల వీఆర్వోలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లో సంక్షేమ ఆపరేషన్లు చేయించుకున్న గిరిజన మహిళల వివరాలను సేకరిస్తున్నారు. -
అక్రమ కు.ని. ఆపరేషన్లపై విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీలో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు వైద్య బృందంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విశాఖ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలకు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మారుమూల ఈదులపాలెం ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఓ మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి గిరిజనుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్న వైనంపై ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఏడీఎంహెచ్‌వో, ఇతర వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. మెడికల్ షాపులో ఇంతవరకు జరిగిన ఆపరేషన్ల వివరాలను సేకరించడంతో పాటు ఆపరేషన్ జరిగిన మహిళలందరితో మాట్లాడి పూర్తి నివేదికను తనకు అందజేయాలని ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలా ప్రసాద్‌ను ఆదేశించారు. విచారణ అధికారిగా ఈదులపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లకే శివప్రసాద్ పాత్రుడును నియమించారు. పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు, మరో ప్రభుత్వ స్టాఫ్ నర్సు అని గుర్తించారు. ఇందుకు ఈదులపాలెం ఆస్పత్రిలోని కొంతమంది వైద్య సిబ్బంది కూడా సహకరించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. ఇక్కడ రెండు విడతలుగా భారీ సంఖ్యలో కు.ని. ఆపరేషన్లు చేసినట్టు ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు ప్రాథమిక సమాచారాన్ని అందజేశారు. -
అరకు అందాలకు రాచబాట
సాక్షి, అమరావతి: చుట్టూ పచ్చని కొండలు.. ఆకాశాన్ని తాకుతున్నట్టుండే దట్టమైన వృక్షాలు.. వాటి మధ్య నల్లటి నాగులా మెలికలు తిరుగుతూ రహదారి.. ఓ వైపు లోయలు.. అక్కడక్కడా కనువిందు చేసే జలపాతాలు.. సేద తీరేందుకు వేసవి విడిదిలు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా తూర్పుగోదావరి–విశాఖ ఏజెన్సీలను కలుపుతూ మణిహారం వంటి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం ఏజెన్సీలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ముందుగా నిర్ణయించిన రహదారులను అనుసంధానిస్తూ ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా కొత్త రహదారి నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. 406 కి.మీ. మేర రూ.900 కోట్లతో ఈ రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది. పర్యాటకానికి మణిపూసలా.. ఎన్హెచ్ఏఐ ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని విజయనగరం జిల్లాతో కలుపుతూ రెండు రహదారులను నిర్మిస్తోంది. బౌదర నుంచి విజయనగరం, పాడేరు నుంచి అరకు వరకు 76.31 కి.మీ. మేర రూ.493 కోట్లతో రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. అదేవిధంగా కొయ్యూరు నుంచి పాడేరు వరకు రూ.785.72 కోట్లతో మరో రహదారి నిర్మిస్తోంది. ప్రస్తుతం అరకులోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు ఈ మార్గం నుంచే వెళ్తున్నారు. అటు విశాఖపట్నం నుంచి.. ఇటు విజయనగరం నుంచి బౌదర మీదుగా అరకు వెళ్తున్నారు. అంటే ఉత్తరాంధ్ర నుంచే ఆ మార్గం అరకుకు కనెక్టివిటీగా ఉంది. కాగా అరకు లోయకు రాష్ట్రంలోని మరో వైపు నుంచి కూడా కనెక్టివిటీ పెంచితే పర్యాటకులను మరింతగా ఆకర్షించ వచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ప్రధానంగా రాజమహేంద్రవరం నుంచి నేరుగా అరకు లోయకు కనెక్టివిటీ మెరుగుపరిస్తే రాష్ట్రంలోని మిగిలిన 10 జిల్లాల వారికి కూడా అరకు పర్యటన మరింత సులభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ వైపు నుంచి వచ్చేవారికి రాజమహేంద్రవరం మీదుగా అరకుకు అనుసంధానించేలా రహదారి నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం 406 కి.మీ. మేర నిర్మించే ఈ రహదారులకు రూ.900 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రణాళికను ఖరారు చేశారు. దీనిపై సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)రూపొందిస్తున్నారు. డీపీఆర్ అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
సీతా'సోకు' చిలుకలు
సాక్షి, అమరావతి: సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అంటూ సప్తవర్ణ శోభితమైన వాటి అందాన్ని ఓ సినీకవి ఎంతో రమణీయంగా వర్ణించినట్లే పచ్చదనం పర్చుకున్న ఈ ప్రకృతి కూడా ఎన్నో అందాలతో మనకు కనువిందు చేస్తుంది. ఇందులో రకరకాల వృక్ష సంపదే కాదు.. అనేక రకాల కీటకాలూ మనల్ని అలరిస్తాయి.. ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి సీతాకోక చిలుకలు. ఓ పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకు.. ఓ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు.. వయ్యారంగా రెక్కలూపుకుంటూ ఎగిరే ఈ సీతాకోకలు సర్వమానవాళికీ ఆహార భద్రత కలిగిస్తాయి. పర్యావరణంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ జాతిలో ఇప్పుడు కొత్తగా నాలుగు రకాలు చేరాయి. అది కూడా ఎక్కడో కాదు.. మన ఏపీలోనే. ఆ వివరాలు.. రుతుపవనాలు పర్యావరణంలో కొన్ని అందమైన మార్పులు తీసుకొస్తాయి. పెరుగుతున్న పచ్చదనం, వికసిస్తున్న పువ్వులు, కొత్త వృక్ష సంపద.. వాటి చుట్టూ అనేక రకాల పురుగుల మనుగడ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రకృతిలో జరిగే ఈ అందమైన మార్పులు, కీటకాల మనుగడను ప్రకృతి ప్రేమికులు నిశితంగా పరిశీలిస్తారు. వారి అన్వేషణలో (నేచర్ వాక్స్) ఇటీవల రాష్ట్రంలో నాలుగు కొత్త సీతాకోక చిలుక జాతులు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుమలలో ఫ్లంబియస్ సిల్వర్‌లైన్, నారో బ్యాండెడ్ బ్లూ బాటిల్ జాతి సీతాకోక చిలుకలను కనుగొన్నారు. విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు ప్రాంతంలో లాంగ్ బ్యాండెడ్ సిల్వర్‌లైన్, డార్క్ పైరాట్ జాతులను గుర్తించారు. ఈ నాలుగు జాతుల సీతాకోక చిలుకలు ఇంతవరకు మన రాష్ట్రంలో రికార్డు కాలేదు. విజయవాడ నేచర్ క్లబ్‌కి నేతృత్వం వహిస్తున్న రాజేష్ వర్మ దాసి, రాజశేఖర్ బండి బృందం ఇటీవల నిర్వహించిన నేచర్ వాక్స్‌లో తొలిసారిగా వాటిని తమ కెమెరాల్లో బంధించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అరుదైన ఆర్కిడ్ టిట్ జాతి సీతాకోక చిలుక కూడా రికార్డయింది. ఇది గతంలో రికార్డయినా చాలా అరుదైనది. ప్రకృతి ప్రేమికుడు జిమ్మీ కార్టర్ దీన్ని రికార్డు చేశారు. ఈ ఆర్కిడ్ టిట్ సీతాకోక చిలుక 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం షెడ్యూల్–1 పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం.. పులులను సంరక్షిస్తున్నట్లే ఈ జాతి సీతాకోక చిలుకల్ని సంరక్షించాల్సి వుంది. అందుకే పర్యావరణంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. 170 సీతాకోక చిలుక జాతులు, 200 చిమ్మట జాతులు సీతాకోక చిలుకలు, చిమ్మటలు (పురుగు సీతాకోక చిలుకలు), తేనెటీగలు, కందిరీగల వంటి కీటకాలు ముఖ్యమైన పరాగ సంపర్క జీవులు. ఇవి అనేక ఆహార పంటలను పరాగ సంపర్కం చేయడం ద్వారా మానవాళికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయి. మన దేశంలో వెయ్యి కంటే ఎక్కువ జాతుల సీతాకోక చిలుకలు, 10 వేల జాతుల చిమ్మటలు ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 170కి పైగా సీతాకోకచిలుక జాతులు, 200కి పైగా చిమ్మటలు రికార్డయ్యాయి. వీటి జీవిత కాలం ఎంతంటే.. కొన్ని రకాలు కేవలం 15 రోజులు మాత్రమే జీవిస్తే.. మరికొన్ని 12 నెలల వరకూ బతుకుతాయి. నేచర్ వాక్స్‌తో కొత్త విషయాలు ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), తిరుపతి విభాగం తరచూ నేచర్ వాక్స్ నిర్వహిస్తుంది. ఈ వాక్స్‌లో అనేక కొత్త సీతాకోక చిలుకలు, ఇతర కీటకాలను రికార్డు చేస్తున్నాం. ప్రకృతి, జీవ వైవిధ్యానికి సంబంధించి ఎన్నో కొత్త విషయాలు వీటి ద్వారా తెలుస్తాయి. సెప్టెంబర్ నెలను బిగ్ బటర్‌ఫ్లై మంత్‌గా పిలుస్తారు. వలంటీర్లు వారి చుట్టూ ఉన్న సీతాకోక చిలుక జాతులను రికార్డ్ చేసి సిటిజన్ సైన్స్ పోర్టల్స్‌లో పంచుకుంటారు. మన దేశంలో ఈ సమాచారాన్ని ifoundbutterflies,indiabiodiversityportal, moths of india and inaturalist వంటి వెబ్సైట్లలో సమర్పిస్తారు. ప్రకృతి ప్రేమికులు ఎవరైనా జీవవైవిధ్య పరిరక్షణకు ఈ పనిచేయవచ్చు. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి గొప్ప జీవ వైవిధ్యం ఏపీ సొంతం రాష్ట్రంలో చాలా గొప్ప జీవ వైవిధ్యం ఉంది. దురదృష్టవశాత్తు అది తగినంతగా నమోదుకాలేదు. దైనందిన జీవితంలో మన చుట్టూ కనిపించే జీవవైవిధ్యం, జీవులను రికార్డు చేసి డాక్యుమెంట్ చేయడం చాలా ముఖ్యం. వాటి ఆవాసాల విధ్వంసం, వాతావరణ మార్పులు, పురుగు మందులు అధిక వినియోగం వంటి అనేక అంశాలు కొన్ని పరాగ సంపర్క జాతుల్ని కనుమరుగయ్యేలా చేస్తున్నాయి. అందుకే వాటి సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంటుంది. ఇటీవల మేం చేపట్టిన నేచర్ వాక్స్‌లో నాలుగు సీతాకోక చిలుక జాతులను కొత్తగా మన దగ్గర రికార్డు చేశాం. – రాజేష్ వర్మ దాసి, విజయవాడ నేచర్ క్లబ్ నిర్వాహకుడు -
స్ట్రాబెర్రీ సాగుతో ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధి
సాక్షి,అమరావతి: స్ట్రాబెర్రీ సాగుకు విశాఖ ఏజెన్సీ అనుకూలంగా ఉన్నందున సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంకు ఆమె స్ట్రాబెర్రీ పండ్లను బహూకరించారు. చింతపల్లి మండలం లంబసింగి పరిసర గ్రామాల్లో గిరిజనులు ఎక్కువగా స్ట్రాబెర్రీ సాగుచేస్తున్నారని, దీనిని మరింత ప్రోత్సహిస్తే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.