మన్యంపై చలి పంజా, గిరిజనం గజగజ
=కనిష్ట ఉష్ణోగ్రతలతో గిరిజనం గజగజ
=దైనందిన కార్యకలాపాలకు ఇబ్బంది
=రమణీయ దృశ్యాలతో పర్యాటకులకు కనువిందు
తొందరగా పొద్దు గుంకిపోతోంది.. ఉదయం 10 గంటలైతేనే గానీ సూరీడు దర్శనమీయడు.. పొగమంచు కమ్మేసి పగలు సైతం లైట్లు లేకుండా వాహనాలు కదలలేని పరిస్థితి.. చలి పులి పంజా విసరడంతో గిరిజనం అల్లాడుతున్నారు.. ఇదీ ప్రస్తుతం మన్యంలో నెలకొన్న వాతావరణ స్థితి.. శీతలంతో నిత్యం సావాసం చేసే ఏజెన్సీవాసులనే వణికిస్తోందంటే చలి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ రాష్ట్ర ప్రజలను అబ్బురపరుస్తున్నాయి.
పాడేరు, అరకు, డుంబ్రిగుడ, న్యూస్‌లైన్: ‘వాహ్.. విశాఖ ఏజెన్సీ’ అంటారందరూ.. చలి చంపేస్తోంది బాబోయ్ అని వాపోతున్నారు మన మన్యవాసులు. కనిష్ట ఉష్ణోగ్రతల్లో లంబసింగి, మినుములూరు పోటీ పడుతున్నాయి. నా ప్రతాపం చూడండి.. అంటోంది పాడేరు ఘాట్‌లోని పాదాలు ప్రాంతం. ఈ ప్రదేశాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఈమధ్య కాలంలో ఒకటి, రెండు డిగ్రీలకు పడిపోతున్నాయి. దీంతో ఏజెన్సీవాసులు నరకయాతన పడుతున్నారు. పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో కూడా చలి అధికమైంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలుల తీవ్రతతో ప్రజలు వణుకుతున్నారు.
మండల కేంద్రాల్లో జనసంచారం పలుచబడుతుంది. దట్టమైన మంచు కూడా కురుస్తుండడంతో సూర్యోదయం ఆలస్యమవుతోంది. చలిగాలులతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. అటవీ ఉత్పత్తులను కాలినడకన వారపు సంతలకు తీసుకువెళ్లే మన్యవాసుల పరిస్థితి దయనీయం. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులో దగ్గరికొచ్చే వరకు వాహనాలు, వ్యక్తులు కనిపించలేనంతగా మబ్బు కమ్మడంతో వాహన చోదకులు సతమతమవుతున్నారు.
చలి చంపేస్తోంది..
పాడేరు ప్రాంతంలోని మినుములూరు ఎస్టేట్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మినుములూరు, వనుగుపల్లి, మోదాపల్లి పంచాయతీల్లోని గిరిజనులు నరకయాతన పడుతున్నారు. కాఫీ తోటల్లో పనులకు వెళ్లే వారంతా వణికించే చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల నుంచి కాఫీ పండ్ల సేకరణ సమస్యగా మారింది. బారెడు పొద్దెక్కి ఎండ ముదిరేవరకు పనుల జోలికి వెళ్లడం లేదు. వణికించే చలిలో పూర్తిస్థాయిలో పండ్లు ఏరలేక కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వేళకే చలిగాలులు వీస్తుండడంతో కాఫీ తోటల్లో కూడా మంట పెట్టుకుని చలికాచుకుంటున్నారు. అటవీ అభివృద్ధి సంస్థ కార్మికులకు ఉన్ని దుస్తులు సరఫరా చేయకపోవడంతో చలితో ఇబ్బందులు పడుతున్నారు.
మంచు కురిసే వేళలో..
పర్యాటక కేంద్రమైన అరకులోయలో పొగమంచు కమ్ముకొని సందర్శకులకు కనువిందు చేస్తోంది. పైలీన్ తుపాను అనంతరం ఇప్పటి వరకూ ఇంతలా పొగమంచు ఆవరించలేదు. ఒక పక్క ఎముకలు కొరికే చలి.. మరో పక్క వర్షాన్ని తలపించే విధంగా కమ్ముకున్న పొగ మంచుతో గిరిజనం అల్లాడిపోతున్నారు. ఎండ ముదరకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అరకులోయలోని పర్యాటక సందర్శిత ప్రాంతాలైన గిరిజన మ్యూజియం, పద్మావతి ఉద్యాన వన కేంద్రం, పర్యాటక అతిథి గృహాలు మంచుతో కప్పి ఉండడంతో అందులో బస చేసిన పర్యాటకులు వెండి మబ్బును తలపించే పొగమంచును ఆస్వాదిస్తున్నారు.