అరకు, లంబసింగిలో 15 ఎకరాల్లో సాగు
గత రెండేళ్లుగా నష్టాలు ఈ ఏడాది మంచి దిగుబడి
ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం
గత రెండేళ్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక నష్టపోయిన స్ట్రాబెర్రీ రైతులకు ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నిఖర్చులు పోనూ ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. సేంద్రియ విధానంలో పండించడం వల్ల కొనుగోలు చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
సాక్షి,పాడేరు: అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో స్ట్రాబెర్రీ పండ్ల సీజన్ ప్రారంభమైంది. పర్యాటక సీజన్ కావడంతో మంచి ఆదరణ నెలకొంది. అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. కొంతమంది మైదాన ప్రాంత రైతులు గిరిజనుల వద్ద భూములు లీజుకు తీసుకుని చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో పండిస్తున్నారు. అరకులోయలోని పెదబల్లుగుడ సమీపంలో ఎకరా విస్తీర్ణంలో గిరిజన రైతులే స్వయంగా స్ట్రాబెర్రీని పండిస్తున్నారు.
ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పండ్ల దిగుబడి ఆశాజనకంగా ఉంది. అరకులోయ, లంబసింగి, రాజుపాకల ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ పండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా పండించడం వల్ల పండ్లకు మంచి డిమాండ్ ఉంది.
200 గ్రాములు రూ.100
అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో రైతులు, వ్యాపారులు 200 గ్రాముల పండ్లను రూ.100కు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులకు వారు ఇదే పండ్లను రూ.90కు అమ్ముతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు లంబసింగి ప్రాంతం నుంచి ప్రతిరోజు ఎగుమతి అవుతోంది.
ఎకరానికి రూ.2లక్షల ఆదాయం
ఎకరాకు మూడు వేల కిలోల వరకు దిగుబడి వస్తోందని రైతులు తెలిపారు. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని వారు వివరించారు. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉందని రాజుపాకలు ప్రాంతానికి చెందిన రైతు సత్యనారాయణ తెలిపారు.
అనుకూలించిన వాతావరణం
స్ట్రాబెర్రీ సాగుకు ఈఏడాది వాతావరణం అనుకూలంగా ఉంది. గత రెండేళ్లు అధిక వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది. ఈసారి మాత్రం పూత బాగుంది. పండ్ల సైజు కూడా పెద్దదిగా ఉండడంతో మరింత ఇష్టంగా తింటున్నారు. గిరిజన రైతులు సాగు చేపట్టేందుకు ముందుకు వస్తే ప్రోత్సహిస్తాం. హెక్టార్‌కు రూ.50వేల వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. – రమేష్ కుమార్‌రావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, పాడేరు
Comments
Please login to add a commentAdd a comment