పోషకాల పండు..లాభాలు మెండు 'అవకాడో' | Avocado added to the list of profitable crops | Sakshi
Sakshi News home page

పోషకాల పండు..లాభాలు మెండు 'అవకాడో'

Published Sat, Mar 22 2025 5:28 AM | Last Updated on Sat, Mar 22 2025 5:28 AM

Avocado added to the list of profitable crops

చింతపల్లి: గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి అల్లూరి జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్‌ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. 

నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్‌లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. 

కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్‌లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్‌లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు.  

ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు 
చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. 

ఔషధ గుణాలు, పోషకాలు అధికం 
అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్‌ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు  ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు.

» కాఫీ చెట్లకు నీడనిచ్చేందుకు తీసుకొచ్చిన విదేశీ మొక్క
» పోషకవిలువలున్నఫలాలనూఇస్తోంది.. 
» చింతపల్లిఉద్యాన పరిశోధన స్థానంలో 6 దేశీ, విదేశీ రకాలపై పరిశోధనలు 

చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు 
అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టకేడి–1, హోస్‌ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్‌ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్‌లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు.

ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్‌లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం.  – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి

విదేశీ పంటలకు అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడాఇస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement