కాఫీ పండ్ల సేకరణ ప్రారంభం
పండ్ల దశలోనే కొనుగోలుకు ప్రైవేట్ సంస్థల మొగ్గు
అల్లూరి జిల్లాలో ఈ ఏడాది కాఫీ విరగ్గాసింది. ఎక్కడ చూసినా ఎర్రటి పండ్లతో తోటలు కళకళలాడుతున్నాయి. తోటలు మంచి కాపుకాయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా పండ్ల దశలోనే కొనుగోలు చేస్తుండడంతో వాటి సేకరణను రైతులు ప్రారంభించారు. తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలు అనుకూలంగా ఉండడంతో కాఫీ పంట విరగ్గాసిందని కాఫీ విభాగం అధికారులు అంటున్నారు.
సాక్షి,పాడేరు: అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన అల్లూరి జిల్లాలో కాఫీకి ఈఏడాది కూడా మహర్దశ పట్టింది. కాయలు పక్వానికి వచ్చాయి. తోటల్లో విరగ్గాసిన ఎర్రని కాఫీ పండ్ల సేకరణను గిరిజన రైతులు ప్రారంభించారు. కాఫీ పంటను పండ్ల దశలోనే పాడేరు ఐటీడీఏతో పాటు గిరిజన రైతు ఉత్పత్తి సంఘాలు,పలు ఎన్‌జీవో సంస్థలు కొనుగోలు ప్రారంభించాయి. చింతపల్లి మాక్స్ సంస్థ ద్వారా పాడేరు ఐటీడీఏ రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. కాఫీ పండ్ల సేకరణలో కాఫీ రైతులు వారం రోజుల నుంచి బిజీగా ఉన్నారు. సేకరించిన పండ్లను ఐటీడీఏతో పాటు పలు సంస్థలు వెంటనే కొనుగోలు చేస్తూ పల్పింగ్ యూనిట్లకు తరలిస్తున్నాయి. జీసీసీ సిబ్బంది కూడా కాఫీ గింజలు కొనుగోలు చేస్తున్నారు.
1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం
పాడేరు డివిజన్‌లోని 11 మండలాల్లో 2.42 లక్షల ఎకరాల్లో కాఫీతోటలను గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటిలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం ఇచ్చే కాఫీతోటలు ఉన్నాయి. ఆయా తోటల్లో కాఫీ పండ్లు విరగ్గాయడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాది 17వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను రైతులు విక్రయించారు. ఈ ఏడాది కూడా కాపు ఆశాజనకంగా ఉండడంతో 18వేల మెట్రిక్ టన్నుల వరకు కాఫీ గింజల ఉత్పత్తి ఉంటుందని కేంద్ర కాఫీబోర్డు,పాడేరు ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జీసీసీ,ఐటీడీఏలు గిట్టుబాటు ధరలు ప్రకటన
ఈఏడాది కూడా గిరిజన రైతులు ఉత్పత్తి చేసే కాఫీ పంటకు ఎఫెక్స్ కమిటీ సిఫారసు మేరకు జీసీసీ,పాడేరు ఐటీడీఏలు గిట్టుబాటు ధరలను ప్రకటించాయి. చింతపల్లి మాక్స్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసే కాఫీ పండ్లకు కిలో రూ.44ధర చెల్లించేందుకు పాడేరు ఐటీడీఏ నిర్ణయించింది. పార్చ్‌మెంట్ కాఫీ గింజలను కిలో రూ.285 ధరతో, అరబికా చెర్రీ రకాన్ని కిలో రూ.150,రోబస్ట చెర్రీ రకాన్ని కిలో రూ.80కు కొనుగోలు చేయనున్నారు.
డ్రైకాఫీ దిగుబడి ఎకరాకు 150 కిలోల వరకు ఉంటుంది. ఐటీడీఏ ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి 45 వేల వరకు రైతుకు ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ. 8 కోట్లతో పండ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఐటీడీఏ నిర్ణయించుకోగా, రూ. 57 కోట్ల లావాదేవీలు నిర్వహించాలని జీసీసీ భావిస్తోంది. జిల్లా మొత్తం ఈ ఏడాది రూ.400 కోట్ల వరకూ కాఫీ లావాదేవీలు జరగవచ్చని భావిస్తున్నారు.
పండ్ల సేకరణ ప్రారంభించాం
నాకు ఉన్న రెండు ఎకరాల్లో కాఫీ తోటలు విరగ్గాసాయి. కాపు ఆశాజనకంగా ఉంది. రెండు రోజుల నుంచి పండ్ల సేకరణ జరుపుతున్నాం. గత ఏడాది కాఫీ పంట విక్రయం ద్వారా రూ.70వేల ఆదాయం వచ్చింది. ఈ సారి కాపు అధికంగా ఉండడంతో దిగుబడి పెరుగుతుందని ఆశిస్తున్నాను. సొంతంగా పల్పింగ్ చేసి పార్చ్‌మెంట్ కాఫీని తయారు చేసి జీసీసీకే విక్రయిస్తాను.
– సుర్ర చిట్టిబాబు, కాఫీ రైతు, కరకపుట్టు,పాడేరు మండలం
కాఫీ పంటకు గిట్టుబాటు ధర
గిరిజన రైతులు సాగు చేస్తున్న కాఫీ పంట నాణ్యతలో నంబర్–1గా నిలుస్తుంది. కాఫీ ఉత్ప త్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఐటీడీఏ,జీసీసీ యంత్రాంగం ద్వారా కాఫీ రైతులకు మేలు చేసేలా గిట్టుబాటు ధరలను ప్రకటించాం. గిరిజనులు ఎలాంటి అపోహలకు గురికాకుండా కాఫీ పండ్లను ఐటీడీఏకు, పార్చ్‌మెంట్, అరబికా, రొబస్ట కాఫీ గింజలను జీసీసీకి విక్రయించి లాభాలు పొందాలి. దళారీలను ఆశ్రయించి మోసపోవద్దు.
–ఎ.ఎస్.దినేష్ కుమార్, కలెక్టర్.
Comments
Please login to add a commentAdd a comment