కొండలశ్రేణుల్లో హరిత సోయగాలు
కనువిందు చేస్తున్న అటవీ అందాలు
అడవులపై పరిచినట్టుగా మేఘ సౌందర్యం
తరలివస్తున్న పర్యాటకులు
కనిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో ఆహ్లాదకర వాతావరణం
అల్లూరి జిల్లా లంబసింగికి పర్యాటకంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు
పచ్చటి పర్వత శ్రేణులను ముద్దాడుతున్న మేఘమాలలు..దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు మరోవైపు ఆకుపచ్చని హరిత అందాలు.. అడవులపై పరిచినట్టుగా పవళించే మేఘాలు.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే కశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. లంబసింగిని సందర్శిస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తేవావ్ అనాల్సిందే.
చింతపల్లి: మండలంలోని లంబసింగికి తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఇదే కావడం అందుకు కారణం. చలికాలం బాగా ఉధృతంగా ఉండే తరుణంలో ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మూడు డిగ్రీలకు మించదు. అత్యల్ప ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌గా ఇక్కడ వివిధ సందర్భాల్లో నమోదైంది.
3,600 అడుగుల ఎత్తులో..
సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న లంబసింగి ఒకప్పుడు ఎలాంటి ప్రత్యేకతలూ లేని చిన్న గిరిజన పల్లె. అటవీశాఖ చెక్‌పోస్టు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆశ్రమ గురుకుల పాఠశాల మాత్రమే ఉండేవి. విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు నుంచి బస్సులు మాత్రం ఈ ప్రాంతం మీదుగా తరచూ తిరిగేవి.
⇒ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెక్‌పోస్టు సెంటర్‌లో చాలాకాలం క్రితం ఓ చెట్టుకింద ఒక వ్యక్తి చలికి కొయ్యబారి చనిపోయాడని చెబుతుంటారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని కొర్రబయలు అని కూడా పిలిచేవారు.
⇒ మైదాన ప్రాంతంలో సాధారణంగా ఏడాదికి నాలుగు నెలలు మాత్రం చలి ఉంటుంది. కానీ లంబసింగి ప్రాంతంలో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుంది. సెపె్టంబర్ మొదటి వారం నుంచి చలి ప్రభావం కనిపిస్తుంది. డిసెంబర్‌లో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైన సందర్బాలు ఉన్నాయి. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే చింతపల్లిలో ఉష్ణోగ్రత ఇక్కడకన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది.
నిత్యం భోగి మంటలే..
ప్రతీ ఇంట్లో అందరికీ పెద్ద రగ్గులు ఉంటాయి. స్వెటర్లు, కంబళ్లు తప్పనిసరి. మంట కోసం కట్టెలు సిద్ధంగా ఉంచుకుంటారు. సాయంత్రమయ్యేసరికి ప్రతి ఇంట్లో అన్నం వండుకోవడానికన్నా ముందు కుంపట్లు సిద్ధం చేసుకుంటారు.
తాజంగిలో బోటు షికార్, జిప్‌లైన్
తాజంగి జలాశయంలో ఐటీడీఏ ఏర్పాటుచేసిన బోట్ షికార్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లంబసింగి వచ్చే పర్యాటకులందరూ 20 నిమిషాలు బోటులో షికారు చేసి ఎంతో సంతోషం పొందుతుంటారు. జలాశయం మీదుగా ఏర్పాటుచేసిన జిప్‌వే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు 250 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జిప్ లైన్ ద్వారా కొండపై నుంచి చెరువు వరకు జారుతూ ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు.
మరో వ్యూపాయింట్
నర్సీపట్నం నుంచి లంబసింగి వచ్చే మార్గంలో బోడకొండమ్మ ఆలయం వద్ద మరో వ్యూపాయింట్ అందుబాటులోకి వచ్చింది. గత అరకు ఎంపీ మాధవి నిధులు వెచ్చించి దీనిని నిర్మించారు.
⇒ నర్సీపట్నం నుంచి ప్రయాణం ప్రారంభించాక చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో మలుపులతో కూడిన రోడ్లు, పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో కాఫీ, మిరియం తోటలు ఆకట్టుకుంటాయి.
⇒ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. దీనిని బట్టి ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం, నర్సీపట్నం నుంచి ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.
పర్యాటక సీజన్‌లో కళకళ
పర్యాటక సీజన్ వచ్చిందంటే చాలు లంబసింగి పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో వసతులు లేనందున సమీప నర్సీపట్నంలో బస చేసి తెల్లవారుజామున ఇక్కడి పర్యాటకులు వచ్చేవారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రిసార్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ కాటేజీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
కొండల్లో ‘పాల సముద్రం’
చెరువులవేనం కొండల్లో ప్రకృతి అందాలు పాలసముద్రాన్ని తలపిస్తాయి. ఈ ప్రాంతం లంబసింగికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పొగమంచు దట్టంగా కమ్మి ఉంటుంది. మేఘాలు మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది. ఈ అపురూప అందాలను తిలకించేందుకు ఎక్కడెక్కడినుంచో ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండేలా పాడేరు ఐటీడీఏ వ్యూపాయింట్‌ను నిర్మించింది.
⇒ శీతల వాతావరణం ప్రారంభమైన నాటి నుంచి వచ్చే పర్యాటకులతో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లంబసింగి సెంటర్ జాతరను తలపిస్తుంది. వీకెండ్‌లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. శని, ఆదివారాల్లో అయితే చెరువులవేనం జనసంద్రంగా మారుతుంది. కొంతమంది శనివారం రాత్రి లంబసింగి వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేస్తూ దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ గడుపుతారు. వేకువజామున చెరువులవేనం వెళ్లి ప్రకృతి అందాలను తిలకిస్తారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి
ఏజెన్సీలో పర్యాటక అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చించి అభివృద్ధి చేసింది. తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. చెరువులవేనం, బోడకొండ గుడి వద్ద వ్యూపాయింట్‌లు నిర్మించింది.కృష్ణాపురం వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేసింది. తాజంగి జలాశయాన్ని అభివృద్ధి చేసింది.
– మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే
కనీస వసతులు అవసరం
పర్యాటక ప్రాంతంగా పాచు ర్యం పొందడంతో ఈ ప్రాంత అందాలను చూడడానికి ఎంతోమంది కుటుంబాలతో వ స్తున్నారు.ఈ ప్రాంతంలో కనీస వసతులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు అ««ధికారులు చర్యలు చేపట్టాలి.వాహనాల నిలుపుదలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలి.
– ప్రశాంత్, పర్యాటకుడు విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment