మొహమ్మద్‌ షమీ విధ్వంసం.. సెలెక్టర్లకు సవాల్‌ | Mohammed Shami Sends Champions Trophy Reminder To Selectors With Fiery Cameo In Vijay Hazare Trophy, Check Details Inside | Sakshi
Sakshi News home page

మొహమ్మద్‌ షమీ విధ్వంసం.. సెలెక్టర్లకు సవాల్‌

Published Sun, Jan 5 2025 4:04 PM | Last Updated on Sun, Jan 5 2025 4:43 PM

Mohammed Shami Sends Champions Trophy Reminder To Selectors With Fiery Cameo In VHT

విజయ్‌ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్‌ బౌలర్‌, బెంగాల్‌ ఆటగాడు మొహమ్మద్‌ షమీ చెలరేగిపోయాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షమీ.. 34 బంతుల్లో 5 బౌండరీలు, సిక్సర్‌ సాయంతో అజేయమైన 42 పరుగులు చేశాడు. షమీ బ్యాట్‌ ఝులిపించడంతో ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.

సెలెక్టర్లకు సవాల్‌..
తాజాగా ఇన్నింగ్స్‌తో షమీ భారత సెలెక్టర్లకు సవాల్‌ విసిరాడు. గాయం కారణంగా చాలాకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్‌ ఆడుతున్నాడు. షమీ ఫిట్‌గా ఉన్నప్పటికీ భారత సెలెక్టర్లు అతన్ని బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోలేదు. 

త్వరలో భారత్‌ ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఆతర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడనుంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లు తప్పించినా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో భాగం కావాలని షమీ భావిస్తున్నాడు. తాజా ఇన్నింగ్స్‌ షమీని టీమిండియా తలుపులు తట్టేలా చేస్తాయేమో వేచి చూడాలి.

పరుగు తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్న కెప్టెన్‌
ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ కెప్టెన్‌ సుదీప్‌ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. ఘరామీ 125 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

బెంగాల్‌ ఇన్నింగ్స్‌లో ఘరామీతో పాటు సుదీప్‌ ఛటర్జీ (47), షమీ (42 నాటౌట్‌), కౌశిక్‌ మైతి (20 నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించారు. షమీ-మైతీ జోడి ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 64 పరుగులు జోడించారు. మధ్యప్రదేశ్‌ బౌలర్లలో ఆర్యన్‌ పాండే, ఆవేశ్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్‌ జైన్‌, సాగర్‌ సోలంకీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ 23 ఓవర్ల అనంతరం 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మధ్య ప్రదేశ్‌ ఓపెనర్లు హర్ష్‌ గావ్లీ, హిమాన్షు మంత్రి డకౌట్లయ్యారు.  శుభమ్‌ శ్యామ్‌ సుందర్‌ శర్మ (53), కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (49) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ గెలవాలంటే మరో 27 ఓవర్లలో 162 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement