మిస్టరీ స్పిన్నర్, తమిళనాడు ఆటగాడు వరుణ్ చక్రవర్తి విజయ్ హజారే ట్రోఫీ రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ తన ఐదు వికెట్ల ప్రదర్శనలో ఏకంగా ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో వరుణ్ ఓ క్యాచ్ కూడా పట్టాడు. వరుణ్‌తో పాటు సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) కూడా వికెట్లు తీయడంతో రాజస్థాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్ అభిజీత్ తోమర్ (111) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (60) అర్ద సెంచరీతో కదం తొక్కడంతో రాజస్థాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో వీరిద్దరితో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అభిజీత్ తోమార్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో బాధ్యతాయుతమైన సెంచరీ చేయగా.. లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకం బాదాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో సచిన్ యాదవ్ 4, దీపక్ హూడా 7, అజయ్ సింగ్ 2, మానవ్ సుతార్ 1, అనికేత్ చౌదరీ 2, ఖలీల్ అహ్మద్ 1, అమన్ షెకావత్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.
Varun Chakravarthy with a peach of a delivery. 🤯🔥 pic.twitter.com/kL0BfOHH5m
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2025
అనంతరం 268 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0) ఔట్ కాగా.. నారాయణ్ జగదీశన్ (37 బంతుల్లో 52; 9 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (13) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీకి తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 183 పరుగులు చేయాలి.
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఖాయం
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటించడానికి ముందు వరుణ్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన అనంతరం వరుణ్ టీమిండియాకు ఎంపిక కావడం ఖాయమని తెలుస్తుంది. భారత జట్టులో చోటు విషయంలో వరుణ్‌కు రవి భిష్ణోయ్ నుంచి పోటీ ఉండింది. అయితే తాజా ప్రదర్శన నేపథ్యంలో సెలెక్టర్లు ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వరుణ్ ఇటీవల టీమిండియా తరఫున టీ20ల్లోనూ అదరగొట్టాడు. గతేడాది నవంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ 12 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో వరుణ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది.
ఇదిలా ఉంటే, ఇవాళే జరుగుతున్న మరో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో (మొదటిది) హర్యానా, బెంగాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment