
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది.
వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు అనంతరం భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడతుంది. మార్చి 4న ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్.. గ్రూప్-బి టాపర్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.
రాణించిన శ్రేయస్, హార్దిక్, అక్షర్
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్-3 బ్యాటర్లు రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (2), విరాట్ కోహ్లి (11) విఫలమయ్యారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.
ఐదేసిన వరుణ్
250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో లక్ష్యానికి 45 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెరీర్‌లో రెండో వన్డే ఆడుతున్న వరుణ్ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కుల్దీప్ 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసి భారత్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు.
వీరందరూ చెలరేగడంతో భారత్ 250 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు. అయితే అతనికి సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 22, రచిన్ రవీంద్ర 6, డారిల్ మిచెల్ 17, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12, బ్రేస్‌వెల్ 2, మ్యాట్ హెన్రీ 2, విలియమ్ ఓరూర్కీ 1 పరుగు చేశారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (28) బ్యాట్ ఝులిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment