
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోర్ (196/8) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన క్లాస్‌ను ప్రదర్శించాడు.
శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) భారీ స్కోర్లు చేయకపోయిన బాగా ఆడారు. స్లోగా ఉన్న పిచ్‌పై ఈ ముగ్గురు సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్‌లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్‌లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్‌ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.
ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది.
ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది.
మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌ను బ్లాక్ సాయిల్ పిచ్‌పై ఆడాము. ఇది మాకు కలిసొచ్చింది. మొదటి మ్యాచ్‌కు ముందే ఈ పిచ్‌పై ఆడాలని నిర్ణయించుకున్నాము. ఈ వికెట్ మాకు సూటైంది. బంతి పాతబడిన తర్వాత ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టం. అందుకే పవర్ ప్లేలోపే వీలైనన్ని పరుగులు సాధించేందుకు ప్రయత్నించాము.
మనందరం ప్రణాళికలు వేసుకుంటాము. కొన్ని వర్కౌట్ అవుతాయి. మరికొన్ని కావు. రషీద్ ఖాన్‌ను తన కోటా నాలుగు ఓవర్లు వేయించకపోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. వాస్తవానికి రషీద్‌ను ఆఖర్లో బౌలింగ్ చేయిద్దామనే అనుకున్నాను. కానీ పేసర్లు బాగా బౌలింగ్ చేస్తుండటంతో అతన్ని బరిలోకి దించలేదు. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.