
భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో జరుగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుగా అభివర్ణించవచ్చు. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత్, న్యూజిలాండ్ రెండు జట్ల బ్యాట్స్మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా న్యూజిలాండ్ బ్యాట్స్మన్ ఎక్కడా తడబడినట్టు కానీ, తక్కువ స్థాయిలో ఆడుతున్నట్టు కానీ కనిపించలేదు. న్యూజిలాండ్ ను ఈ మ్యాచ్ లో నిలువరించి ఘనత భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి దక్కుతుంది.
తొలి పోరులో వరుణ్ దే పైచేయి
గత ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాట్స్మన్‌ని తన వైవిధ్యమైన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టాడు. అంటే న్యూ జిలాండ్ బ్యాట్స్మన్ కి స్పిన్నర్లను ఆడటం తెలియక కాదు. వారి జట్టులోనూ అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లపై ఆధిపత్యం సాధించే అద్భుతమైన బ్యాట్స్మన్ కూడా ఉన్నారు. కానీ వరుణ్ మాత్రం విభిన్నమైన స్పిన్నర్. అతని బౌలింగ్ యాక్షన్ బట్టి అతని ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం కష్టం.
అదే ప్రత్యర్థి బ్యాట్స్మన్ కి పెద్ద అవరోధంగా కనిపిస్తోంది. అందుకే ఆ మ్యాచ్ లో వరుణ్ మిస్టరీ కోడ్‌ను అర్థం చేసుకోవడానికి కివీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడ్డారు. ఈ మ్యాచ్ లో వరుణ్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరియు మిచెల్ సాంట్నర్ వంటి కీలక వికెట్లు కూడా ఉన్నాయి.
ఆ తర్వాత సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై కూడా వరుణ్ మంచి వైవిధ్యం తో బౌలింగ్ చేసాడు. ఎప్పడూ భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకి గా నిలిచే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను తన తొలి బంతితోనే బోల్తా కొట్టించాడు. వరుణ్ ఫామ్ ఫైనల్‌కి ముందు భారత్‌కు అదనపు బలాన్నిస్తునడంలో సందేహం లేదు.
వరుణ్ గురించి హెచ్చరించిన కివీస్ కోచ్
అందుకే మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ బ్యాట్సమన్లని వరుణ్ నుంచి ఎదురయ్యే సవాలుకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. గత మ్యాచ్ లో మా జట్టు పై 5/42 గణాంకాలతో పైచేయి సాధించిన వరుణ్ ఫైనల్లో ఆడతాడని కచ్చితంగా చెప్పగలను. వరుణ్ ఒక క్లాస్ బౌలర్.
గత మ్యాచ్ లో మాకు తన నైపుణ్యం మేమిటో రుచి చూపించాడు. ఫైనల్లో వరుణ్ మాకు పెద్ద ముప్పుగా భావిస్తున్నాం. ఈ విషయం (వరుణ్ మా ప్రధాన అడ్డంకి అని ) ముందే తెలిసింది కాబట్టి అతన్ని ఎలా ఎదుర్కోగలం. ఎలా పరుగులు సాధించగలము అనే దాని పై అంచనాలు వేస్తున్నామని స్టీడ్ అన్నాడు.
హెన్రీ ఆడతాడా?
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సందర్భంగా కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయపడ్డాడు. ప్రమాదకరమైన బ్యాట్స్మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేసే ప్రయత్నంలో డైవింగ్ క్యాచ్ తీసుకుంటుండగా, హెన్రీ కుడి భుజంపై గాయమైంది.
వెంటనే ఫిజియోలు అతనిని పరిశీలించినప్పటికీ అతను తీవ్ర అసౌకర్యంతో ఉన్నట్టు కనిపించాడు. చివరికి హెన్రీ మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో మాట్ హెన్రీ తన 10 ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. అతను కేవలం 7 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 42 పరుగులు ఇచ్చాడు.
ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. మాట్ హెన్రీ భుజం కొంచెం నొప్పిగా ఉందని.. అతను భారత్‌తో ఫైనల్ ఆడగలడో లేదో వేచి చూడాలన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్మన్ ని నిలువరించడంలో హెన్రీ కీలక పాత్ర వహించాడు. ఈ మ్యాచ్ లో హెన్రీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తన అత్యుత్తమ గణాంకాలు (5/42) నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజిలాండ్‌కు పెద్ద దెబ్బ అవుతుంది.