
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ప్రముఖ మతాధికారి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇటీవలికాలంలో తరుచూ టార్గెట్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగడాన్ని తప్పుబట్టిన మౌలానా షాబుద్దీన్ రజ్వీ.. తాజాగా షమీ కూతురు ఐరా హోలీ ఆడటాన్ని పెద్ద ఇష్యూ చేశాడు. హోలీ రోజు ఐరా రంగులు పూసుకొని దిగిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షం కావడంతో మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఫైరయ్యాడు.
పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడటాన్ని తప్పుబట్టాడు. ఐరాను రంగులు పూసుకునేందుకు అనుమతించిన తల్లి హసీన్ జహాను తిట్టి పోశాడు. రంజాన్ మాసంలో ముస్లింలు హోలీ ఆడటం అక్రమమని.. షరియత్‌కు ఇది వ్యతిరేకమని అన్నాడు.
ఐరా లాంటి చిన్నారి రంజాన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హెలీ ఆడి ఉంటే అది నేరం కాదు. అయితే ఐరా రంజాన్ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం అది ఇస్లాం చట్టానికి విరుద్ధమని ఓ వీడియో ద్వారా సందేశాన్ని పంపాడు. ఐరా విషయంలో మౌలానా షాబుద్దీన్ రజ్వీ స్పందించిన తీరును చాలా మంది తప్పుబడుతున్నారు.
చిన్నారి సరదాగా రంగులు పూసుకుంటే ఇంత రాద్దాంతం చేయాలా అని మండిపడుతున్నారు. కొందరేమో ఇందులో చిన్నారి ఐరా తప్పు లేదు కానీ, రంజాన్ మాసం అని తెలిసి కూడా ఆమె తల్లి హోలీ ఆడేందుకు అనుమతించడం పెద్ద నేరమని కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయంలో ఐరా తల్లిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఐరా తల్లి హసీన్ జహా మహ్మద్ షమీతో విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరుగా ఉంటుంది. కాగా, మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగినప్పుడు కూడా పెద్ద రాద్దాంతం చేశాడు. రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉండకుండా షమీ పెద్ద నేరం చేశాడని అరోపించాడు.
ఇలా చేసి షమీ ఇస్లాం సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడని విమర్శించాడు. మౌలానా షాబుద్దీన్ రజ్వీ వ్యాఖ్యలపై అప్పట్లో భారత క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. షమీ ఏం తప్పు చేశాడని ఇంత పెద్ద షో చేస్తున్నావని రజ్వీని ప్రశ్నించారు. దేశం కోసం శ్రమించాల్సి వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలని అనడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మతోన్మాధం ఎక్కువైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చురకలంటించారు.
ఇదిలా ఉంటే, షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి భారత్ టైటిల్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన షమీ.. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో 3 వికెట్లు పడగొట్టాడు.
షమీ త్వరలో ఐపీఎల్‌లో ఆడనున్నాడు. ఈ సీజన్‌లో షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. షమీ గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు. మెగా వేలంలో షమీని సన్‌రైజర్స్ రూ. 10 కోట్లకు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment