టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గాయం కారణంగా గతేడాది కాలంగా కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉన్న షమీ ఇటీవలే ఓ రంజీ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో షమీ ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించిన సమయానికి షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. అందుకే అతన్ని మెగా సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే ప్రస్తుతం టీమిండియా ఉన్న పరిస్థితుల్లో టీమిండియా మేనేజ్‌మెంట్ షమీ వైపు చూస్తుంది. బీజీటీకి అతన్ని ఎంపిక చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది. షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో పాటు రంజీ మ్యాచ్‌లో 40కి పైగా ఓవర్లు వేసి పూర్వ స్థితికి చేరాడు.
బీజీటీ సుదీర్ఘకాలం సాగనుంది కాబట్టి షమీని ఏ సమయంలోనైనా భారత జట్టుకు ఎంపిక చేయవచ్చని తెలుస్తుంది. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి బలం చేకూరుస్తున్నాయి.
మోర్నీ మోర్కెల్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ.. మేము షమీని చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాం. అతను సంవత్సరం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. షమీ తిరిగి క్రికెట్ ఆడటం టీమిండియాకు సానుకూలాంశం. షమీ తిరిగి జట్టులో చేరేందుకు తాము చేయాల్సినవన్నీ చేస్తున్నాం. భారత్‌లో షమీకి దగ్గరగా ఉన్న వాళ్లతో మేము టచ్‌లో ఉన్నాం. షమీ వరల్డ్ క్లాస్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు.
మోర్నీ మాటలను బట్టి చూస్తే షమీని బీజీటీలో బరిలోకి దించేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. బీజీటీలో షమీ సేవలు టీమిండియాకు చాలా అవసరం. ఈసారి బీజీటీలో భారత పేస్ అటాక్ మునుపెన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తుంది.
ప్రస్తుత జట్టులో బుమ్రా ఒక్కడే అనుభవజ్ఞుడైన పేసర్. సిరాజ్‌కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉన్నా, ఇటీవలికాలంలో అతను పెద్దగా ఫామ్‌లో లేడు. మిగతా పేసర్లు ఆకాశ్‌దీప్, ప్రసిద్ద్ కృష్ణలకు అనుభవం చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో షమీ జట్టులో ఉంటే టీమిండియా విజయావకాశాలు మెరుగుపడతాయి. మరి భారత మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment