
అనుకున్నదే జరిగింది.. ఊహాగానాలే నిజమయ్యాయి!.. అవును.. టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో కీలక సిరీస్‌కు ముందు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
ఈ మేరకు.. ‘‘బ్యాగీ బ్లూ ధరించి టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టి ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి. ఈ ఫార్మాట్లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా ఊహించనే లేదు.
ఈ ఫార్మాట్ ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. ఎన్నో పాఠాలు నేర్పించింది. వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని అనుసరిస్తాను.
వైట్ జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైనది. సుదీర్ఘంగా క్రీజులో ఉండటం.. అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి.
ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది.. కానీ ఇందుకు ఇదే సరైన సమయమని అనిపించింది. ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. అందుకు ఆట కూడా నాకెంతో తిరిగి ఇచ్చింది. నిజానికి నేను చేసిన దాని కంటే.. ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చింది.
మనస్ఫూర్తిగా.. కృతజ్ఞతా భావంతో నేను ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నాను. క్రికెట్‌కు, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
టెస్టు కెరీర్ సంతృప్తికరం. నేనెప్పుడు దీని గురించి తలచుకున్నా తప్పకుండా నా మోముపై చిరునవ్వు వెల్లివిరిస్తుంది. #269.. ఇక సెలవు’’ అంటూ కోహ్లి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.

2011లో టెస్టుల్లో అరంగేట్రం
కాగా 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లి.. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో జమైకా వేదికగా టీమిండియా ఆడిన తొలి టెస్టులో క్యాప్ అందుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

చేదు అనుభవం తర్వాత
తొలి ఇన్నింగ్స్‌లో పది బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 54 బంతులు ఎదుర్కొని 15 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే, ఈ చేదు అనుభవం తర్వాత కోహ్లి తన ఆటను మెరుగుపరచుకున్నాడు.
టీమిండియా మేటి టెస్టు బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. కెప్టెన్‌గానూ సంప్రదాయ క్రికెట్‌లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయం అందించాడు.

తన కెరీర్‌లో మొత్తంగా 123 టెస్టులు ఆడిన కోహ్లి 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 31 అర్ధ శతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254.

రోహిత్‌తో పాటే..
కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పిన ఆరు రోజులకే తానూ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కాగా గత కొంతకాలంగా రోహిత్, కోహ్లి టెస్టుల్లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇక కోహ్లి చివరగా పెర్త్‌లో ఆస్ట్రేలియా మీద తన టెస్టు సెంచరీ సాధించాడు. ఇక రోహిత్, కోహ్లి వన్డేలలో మాత్రం కొనసాగనున్నారు.
చదవండి: PSL 2025: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!