
టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) తన టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సంప్రదాయ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) స్పందించిన తీరు వైరల్‌గా మారింది.
కాగా ఢిల్లీకి చెందిన కోహ్లి, గంభీర్‌ల మధ్య గతంలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఎన్నోసార్లు ఈ విషయం బహిర్గతమైంది. మైదానంలోనే ఇద్దరూ గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అనూహ్యంగా ఇద్దరూ కలిసిపోయారు
అలాంటిది గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా రాగానే కోహ్లి కెరీర్ ప్రమాదంలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఇద్దరికీ పొసగదని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇద్దరూ కలిసిపోయారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరూ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.
టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శన
అంతేకాదు.. జట్టు ప్రయోజనాల కోసం తామిద్దరం కలిసి ప్రయాణిస్తామని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే వారి మధ్య అనుబంధం పెరిగిందని బీసీసీఐ వర్గాలు కూడా పేర్కొన్నాయి. అయితే, గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.
గంభీర్ మార్గదర్శనంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో కోల్పోయింది.
ఈ క్రమంలో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన రోహిత్ శర్మ రిటైర్ అవ్వాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగా ఇంగ్లండ్ టూర్‌కు ముందు బుధవారం రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా కోహ్లి కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు.
నిన్ను మిస్సవుతాము చీక్స్
నిజానికి కోహ్లి ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి ఆ తర్వాత రిటైర్ అవ్వాలని అనుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే, ఇందుకు యాజమాన్యం నిరాకరించిందని.. గంభీర్ యువ నాయకుడిని కోరుకోవడం దీనికి కారణమనేది వాటి సారాంశం.
ఈ నేపథ్యంలో కోహ్లి రిటైర్మెంట్ తర్వాత గంభీర్ ఎక్స్ వేదికగా తన స్పందన తెలియజేసిన తీరు వైరల్‌గా మారింది. ‘‘ఆట పట్ల సింహంలాంటి ఆకలి కలిగి ఉన్న వ్యక్తి.. నిన్ను మిస్సవుతాము చీక్స్’’ అంటూ కోమ్లి ఫొటోను పంచుకున్నాడు. కాగా కోహ్లి ముద్దు పేరు చీకూ అన్న విషయం తెలిసిందే.
వీడ్కోలు మ్యాచ్, సిరీస్ అవసరం లేదు
ఇదిలా ఉంటే.. ఇటీవల రోహిత్, కోహ్లిల గురించి గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారి భవిష్యత్తు గురించి తాను ఏమీ చెప్పలేనని, వారిద్దరి ఆట బాగున్నంత కాలం వయసుతో సంబంధం లేదని అభిప్రాయపడ్డాడు.
‘జట్టును ఎంపిక చేయడం సెలక్టర్ల బాధ్యత. అది నా చేతుల్లో లేదు. బాగా ఆడుతున్నంత వరకు కోహ్లి, రోహిత్ జట్టులో ఉంటారు. అతని వయసు 40 అయినా 45 అయినా సమస్య ఏముంది. కోచ్, సెలక్టర్ లేదా బీసీసీఐ కూడా ఫలానా ఆటగాడిని నువ్వు తప్పుకోవాలని చెప్పదు.
ప్రదర్శన బాగుంటే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కూడా ఉంటారేమో. అయినా వారి ఆట ఎలా ఉందో చాంపియన్స్ ట్రోఫీలో ప్రపంచమంతా చూసింది కాబట్టి నేను కొత్తగా చెప్పేదేముంది.
నా అభిప్రాయం ప్రకారం క్రికెటర్లకు వీడ్కోలు మ్యాచ్ లేదా సిరీస్ అనేది ఉండరాదు. అలాంటి ఒక్క మ్యాచ్‌కంటే ఇన్నేళ్లు జట్టు కోసం ఏం చేశాడో గుర్తు చేసుకోగలిగితే అదే పెద్ద గౌరవం. దేశపు అభిమానులు మిమ్మల్ని, మీ ఆటను ఇన్నేళ్లు ఇష్టపడటానికి మించి ఫేర్‌వెల్ ఏముంటుంది’ అని గంభీర్ ప్రశ్నించాడు.
చదవండి: కోహ్లి రిటైర్మెంట్‌పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
A man with lion’s passion!
Will miss u cheeks…. pic.twitter.com/uNGW7Y8Ak6— Gautam Gambhir (@GautamGambhir) May 12, 2025