
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవిత్ర రంజాన్ మాసంలో షమీ పెద్ద నేరం చేశాడని ఆరోపించాడు. షమీ ఓ క్రిమినల్ అని సంభోదించాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్నాయి.
అసలేం జరిగిందంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. దీనిపై ముస్లిం మత పెద్ద రజ్వీ తీవ్రంగా స్పందించాడు.
#WATCH | Bareilly, UP: President of All India Muslim Jamaat, Maulana Shahabuddin Razvi Bareilvi says, "...One of the compulsory duties is 'Roza' (fasting)...If any healthy man or woman doesn't observe 'Roza', they will be a big criminal...A famous cricket personality of India,… pic.twitter.com/RE9C93Izl2
— ANI (@ANI) March 6, 2025
పవిత్ర రంజాన్ మాసంలో షమీ రోజా (ఉపవాసం) పాటించకుండా పెద్ద నేరం చేశాడని అన్నాడు. రంజాన్ మాసంలో ఆరోగ్యకరమైన వ్యక్తి రోజా పాటించకపోతే నేరస్థుడవుతాడని తెలిపాడు. రంజాన్ మాసంలో ముస్లింలంతా రోజా పాటిస్తుంటే షమీ ఇలా చేయడమేంటని ప్రశ్నించాడు. రోజా పాటించకుండా షమీ ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపుతున్నాడని అన్నాడు.
రోజా పాటించనందుకు షమీని క్రిమినల్‌తో పోల్చాడు. ఇలా చేసినందుకు షమీ దేవునికి సమాధానం చెప్పాలని ఓ వీడియో రిలీజ్ చేశాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. మతాన్ని క్రీడలతో ముడిపెట్టకూడదని అంటున్నారు. షమీ దేశం కోసం ఆడుతూ రోజా ఉండలేకపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ముస్లిం సమాజంతో పాటు యావత్ దేశం షమీకి మద్దతుగా నిలుస్తుంది. షమీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌పై దృష్టి పెట్టాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో షమీ 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లో షమీ వికెట్లు తీయలేకపోయాడు.
సెమీస్‌లో ఆసీస్‌పై విజయం సాధించి భారత్ ఫైనల్‌కు చేరింది. మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 2000 ఎడిషన్ (ఛాంపియన్స్ ట్రోఫీ) తర్వాత భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్‌తో తలపడిన రెండు సందర్భాల్లో న్యూజిలాండే విజేతగా నిలిచింది. 2000 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ భారత్‌పై జయకేతనం ఎగురవేసి ఐసీసీ టైటిళ్లు ఎగరేసుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment