
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన పాకిస్తాన్ క్రికెట్ (Pakistan Cricket) మళ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ జట్టు ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. తరచూ కెప్టెన్లు, క్రికెట్ బోర్డు యాజమాన్యాన్ని మారుస్తూ ఒక దశ, దిశ లేకుండా కొట్టుమిట్టాడుతోంది.
ఇటీవల సొంతగడ్డపై జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy 2025)లోనూ రిజ్వాన్ బృందం పేలవ ప్రదర్శన కనబరిచింది. గ్రూప్-ఎలో భాగంగా న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడి.. కనీసం సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల అదీ రద్దై పోవడంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌కు అసలు గెలుపన్నదే లేకుండా పోయింది.
పరిమిత ఓవర్ల సిరీస్‌లోనైనా గెలవాలని..
ఈ క్రమంలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు భావిస్తోంది. అయితే, ఇప్పట్లో అదీ జరిగేలా లేదు. కాగా.. ఉగ్రదాడుల నేపథ్యంలో సుదీర్ఘకాలం సొంతగడ్డపై క్రికెట్ మ్యాచ్‌లకు పాక్ జట్టు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితులే ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.
నాడు శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడి
కాగా 2009లో శ్రీలంక జట్టుపై పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అంతర్జాతీయ జట్లు ఆ దేశంలో పర్యటించడాన్ని దాదాపు నిషేధించగా... ఇటీవలే పరిస్థితులు తిరిగి మెరువడంతో కొన్ని జట్లు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పాకిస్తాన్‌లో క్రికెట్‌కు పూర్వవైభవం రావడం ఖాయమే అనుకుంటున్న దశలో... మరోసారి దీనికి బ్రేక్ పడేలా కనిపిస్తోంది.
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ గజగజ
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం గట్టిగా బదులిస్తోంది.‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్తాన్‌లోని పలు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఇందుకు బదులుగా పాకిస్తాన్ ప్రతిదాడులు ప్రారంభించగా... భారత సాయుధ బలగాలు వాటిని బలంగా తిప్పికొట్టాయి.
5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం
ఈ నేపథ్యంలో అతిత్వరలో పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉన్న బంగ్లాదేశ్ జట్టు... ఈ పర్యటనపై పునరాలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలించడంతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో నిరంతరం చర్చిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి.
ఆటగాళ్ల భద్రతే ముఖ్యం
‘ఆటగాళ్ల భద్రతే అన్నిటికంటే ముఖ్యం. పాకిస్తాన్ బోర్డుతో చర్చిస్తున్నాం. ఏ నిర్ణయమైనా త్వరలోనే వెల్లడిస్తాం’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 17 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మరోవైపు పాకిస్తాన్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ నిలిచిపోగా... అందులో పాల్గొంటున్న రిషాద్ హుసేన్, నహీద్ రాణా ఇప్పటికే బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు.
చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!