
PC: PSL
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాలు భారత్‌లో బంద్ అయిపోయాయి. పాక్ బోర్డుకు చెందిన పీఎస్‌ఎల్ టోర్నీని భారత్‌లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్ కోడ్’ మొబైల్ స్ట్రీమింగ్ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
పహల్గావ్ ఘటన నేపథ్యంలో భారత్‌లో ఇకపై పీఎస్‌ఎల్ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్ కోడ్’ వెల్లడించింది.
మరోవైపు పీఎస్‌ఎల్ టోర్నీ కోసం పాకిస్తాన్‌లో ఉండి మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది.
భారత్‌కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్‌ఎల్‌లో ఇంజినీర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, కెమెరామెన్‌లు, ప్లేయర్ ట్రాకింగ్ ఎక్స్‌పర్ట్‌లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది.
నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐ
మరోవైపు- టీమిండియా- పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది.
అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్‌ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లపై మళ్లీ చర్చ మొదలైంది.
‘పాక్‌తో క్రికెట్ సిరీస్‌ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం లేదు.
ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్ శుక్లా వివరించారు.
ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడింది. పాక్‌ను లీగ్ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్‌గా నిలిచింది.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా