
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన (Pahalgam Incident) నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. డెబ్బై ఎనిమిదేళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూమి కూడా చేతులు మారలేదని.. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. మరి అలాంటప్పుడు శాంతియుత జీవనం గడపకుండా.. అమాయకుల ప్రాణాలు తీస్తే వచ్చే లాభమేమిటంటూ తీవ్రవాదులకు చురకలు అంటించారు.
బైసరన్ లోయలో
ఉగ్రవాదులు, వారికి మద్దతుగా నిలిచే వారు ఇకనైనా వాస్తవాన్ని గుర్తించి.. ఇలాంటి పిరికిపంద చర్యలను చాలించాలని గావస్కర్ సూచించారు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లో ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుగాంచిన బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది మృతి చెందారు.
బాధితులకు అండగా
ఈ నేపథ్యంలో తీవ్రవాదుల చర్యను క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండి... బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అనీల్ కుంబ్లే, రవిశాస్త్రి, శ్రీవత్స గోస్వామి, టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ నిఖత్ జరీన్, పీఆర్ శ్రీజేశ్ తదితరులు ఉగ్రవాదుల దాడిని ఖండించారు.
అంతేకాదు.. పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలు ఎప్పటికీ పునరుద్ధరించకూడదని పలువురు ప్లేయర్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సునిల్ గావస్కర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారతీయులందరిపై దీని ప్రభావం ఉంటుంది.
మరో 78 వేల ఏళ్లు గడిచినా ఇదే పరిస్థితి
దుశ్చర్యలకు పాల్పడేవారిని, వారికి మద్దతునిచ్చే వారిని నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా.. ఇలాంటి పనుల వల్ల మీరు ఏం సాధించారు? ఇకపై ఏం సాధిస్తారు?
గత 78 ఏళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూభాగం కూడా చేతులు మారలేదు. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాదు. మరి అలాంటపుడు శాంతియుతంగా జీవిస్తూ.. దేశాభివృద్ధిపైన దృష్టి పెట్టడం మంచిది కదా! దయచేసి ఇకనైనా పిరికిపంద చర్యలు మానుకుని.. బుద్ధిగా ఉండండి’’ అని ఉగ్రవాదులకు హితవు పలికారు.
చదవండి: PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..