
సీన్ అబాట్ (ఫైల్ ఫొటో)
రావల్పిండి: ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో క్షిపణి దాడి నుంచి తప్పించుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, అందులో పాల్గొంటున్న పలువురు విదేశీ ఆటగాళ్లు పాక్‌లోని రావల్పిండి నూర్ ఖాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికి అక్కడ క్షిపణి దాడి జరిగింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి బదులుగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ముష్కరులను మట్టుపెట్టగా... దానికి పాక్ ప్రతిదాడి చేసింది. దీంతో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం... పాకిస్తాన్‌లోని మూడు వైమానిక స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడి జరగడానికి కాసేపు ముందే అంతర్జాతీయ క్రికెటర్లు నూర్ ఖాన్ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది.
ఈ ఘటనతో మరోసారి
ఆసీస్‌కు చెందిన సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్, ఆస్టన్ టర్నర్, మిచ్ ఓవెన్ ఆ సమయంలో పాక్‌లో ఉన్నట్లు పేర్కొంది. పీఎస్‌ఎల్ వాయిదా పడటంతో శనివారం విదేశీ ఆటగాళ్లు చార్టర్ ఫ్లయిట్లో రావల్పిండి నుంచి బయలుదేరగా... గంటల వ్యవధిలోనే అక్కడ క్షిపణి దాడితో పరిస్థితి భయానకంగా మారిందని పేర్కొంది. పౌర విమాన రాకపోకలను కవచంగా వినియోగించుకుంటూ పాకిస్తాన్ దాడులకు పాల్పడిందనే అంశం ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.
మరోవైపు పీఎస్‌ఎల్‌లోని మిగిలిన 8 మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. మిగిలిన టోర్నీని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించినా... అటువైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో నిరవధికంగా వాయిదా వేసింది.
ఇదీ చదవండి: బాబ్ కూపర్‌కు నివాళి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన టెస్టు క్రికెటర్ బాబ్ కూపర్ (84) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కూపర్ కన్నుమూసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదివారం వెల్లడించింది.
ఆసీస్ క్రికెట్‌కు విశేష సేవలందించిన కూపర్ మృతికి సంతాపం వ్యక్తం చేసింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1964 నుంచి 1968 మధ్య జాతీయ ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కూపర్ 27 టెస్టులాడి 2,061 పరుగులు చేశారు. తన ఆఫ్‌స్పిన్‌తో 36 వికెట్లు సైతం పడగొట్టాడు.
1966లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కూపర్ 12 గంటల పాటు క్రీజులో నిలిచి 589 బంతుల్లో 307 పరుగులు చేశారు. 20వ శతాబ్దంలో ఆస్ట్రేలియాలో నమోదైన ఏకైక త్రిశతకం ఇదే. 28 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం కూపర్ స్టాక్ బ్రోకర్‌గా మారడంతో పాటు ఐసీసీ మ్యాచ్ రిఫరీగానూ పనిచేశారు. ఆస్ట్రేలియా క్రికెట్‌కు చేసిన సేవలకు గానూ కూపర్‌కు 2023లో ‘మెడల్ ఆఫ్ ద ఆర్డర్’ అవార్డు దక్కింది.
చదవండి: 16 లేదా 17 నుంచి ఐపీఎల్!