Australian cricketers
-
షాపింగ్ చేస్తున్న క్రికెటర్స్
-
ఎట్టకేలకు సొంతగడ్డపై...
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనూహ్యంగా వాయిదా పడిన రోజునుంచి ఎప్పుడెప్పుడు ఇళ్లకు చేరుదామా అని ఎదురు చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఊరట లభించింది. భారత్‌నుంచి వచ్చే విమానాలపై తమ దేశం విధించిన ఆంక్షల నేపథ్యంలో మాల్దీవులలో కొన్ని రోజులు గడిపిన అనంతరం వీరంతా సొంతగడ్డపై అడుగు పెట్టారు. లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు అందరూ సోమవారం ఉదయం స్వదేశంలోకి ప్రవేశించారు. ‘ఎయిర్ సీషెల్స్’ ఫ్లయిట్ ద్వారా వీరంతా సిడ్నీ నగరానికి చేరుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రికెటర్లు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లేందుకు వీలు లేదు. రెండు వారాల పాటు వీరంతా స్థానిక మారియట్ హోటల్లో క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న చెన్నై కోచ్ మైక్ హస్సీ కూడా విడిగా ఖతర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మే 4న బీసీసీఐ ప్రకటించగా... అందరికంటే చివరగా ఆసీస్ క్రికెటర్లు సొంత దేశానికి వెళ్లగలిగారు. తమ ఆటగాళ్లు క్షేమంగా తిరిగి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ...అందుకు తగిన ఏర్పాట్లు చేసిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా...
సిడ్నీ: గత కొన్నేళ్లలో భారత క్రికెట్ జట్టు విదేశాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని గెలుచుకోవడం పెద్ద విశేషం. ఈ విజయాల వెనక భారత ‘ఎ’ జట్టు కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చి దిద్దిన రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉంది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం గ్రెగ్ చాపెల్ గుర్తు చేస్తున్నాడు. గతంలో తమ దేశంలో ఇలాంటి పటిష్టమైన వ్యవస్థ ఉండేదని... దానిని స్ఫూర్తిగా తీసుకొని ద్రవిడ్ భారత్‌లో ఫలితాలు సాధిస్తే తమ టీమ్ మాత్రం వెనుకబడిపోయిందని అతను అభిప్రాయపడ్డాడు. ‘చరిత్రను చూస్తే యువ ఆటగాళ్లను తీర్చిదిద్ది సీనియర్ టీమ్‌లోకి వచ్చేసరికి రాటుదేల్చే గొప్ప వ్యవస్థ ఆస్ట్రేలియా క్రికెట్లో ఉంది. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. ఎంతో మంది ప్రతిభావంతులైన కుర్రాళ్లను నేను చూశాను. కానీ వారు దారితెన్నూ లేనట్లు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విషయంలో ఆస్ట్రేలియా ఇప్పటికే వెనుకబడిపోయింది. ఇంగ్లండ్ ఇందులో బాగా పని చేస్తుండగా భారత్ కూడా ఆసీస్‌ను వెనక్కి నెట్టేసింది. భారత్‌లో దీనిని రాహుల్ ద్రవిడ్ సమర్థంగా అమలు చేస్తున్నాడు. నిజానికి అతను ఆస్ట్రేలియాలో ఉన్న వ్యవస్థను చూసి నేర్చుకొని భారత్‌లో దానిని తీర్చిదిద్దాడు’ అని చాపెల్ వ్యాఖ్యానించాడు. -
‘హోం వర్క్’ చేసి సంతకాలు పెట్టండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో పాల్గొనే ముందు అన్ని అంశాలు చూసుకొని, మున్ముందు రాబోయే సమస్యలను అంచనా వేసి సంతకాలు పెట్టాలని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) తమ ఆటగాళ్లను హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశంలోకి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఐపీఎల్లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లంతా ఒక రకంగా చిక్కుకుపోయారు. నేరుగా స్వదేశం వెళ్లలేక ఇప్పుడు మాల్దీవుల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనినే ఏసీఏ గుర్తు చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వాయిదా పడిన సమయంలో కూడా లిన్, క్రిస్టియాన్, కటింగ్ కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ‘భవిష్యత్తులో ఇలాంటి స్థితి రాకూడదని కోరుకుంటున్నా. అయితే ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు కాస్త హోంవర్క్ చేసుకుంటే మంచిది. కరోనా కారణంగా ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. మన దేశంలో అయితే అంతా బాగుండి మీరంతా ఎంతో స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. సరిహద్దులు మూసేసి ప్రయా ణాలపై ఆంక్షలు పెడతారని ఆటగాళ్లూ ఊహించలేదు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన పెరగడం సహజం’ అని ఏసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ అన్నారు. మైక్ హస్సీ మినహా.... కరోనా పాజిటివ్‌గా తేలిన చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మినహా మిగతా ఆస్ట్రేలియన్లంతా మాల్దీవులకు చేరుకున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించిన ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)... ప్రభుత్వ ఆంక్షల్లో సడలింపులు వచ్చేవరకు వారంతా మాల్దీవులలోనే ఉండి ఆస్ట్రేలియాకు బయల్దేరతారని చెప్పారు. హస్సీ మాత్రం కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయల్దేరతాడు. హస్సీ, బౌలింగ్ కోచ్ బాలాజీలను ముందు జాగ్రత్తగా సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించింది. ఇక్కడ తమకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్నాయని... అవసరమైతే చెన్నైలో చికిత్స అందించడం సులువవుతుందని సీఎస్కే వర్గాలు వెల్లడించాయి. ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు చేరుకున్న తర్వాతే ధోని తన ఇంటికి బయల్దేరనున్నాడు. ఎలాంటి ఆంక్షలులేని ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆటగాళ్లు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు దూరమవుతున్న న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్ కూడా స్వదేశం వెళ్లిపోగా... విలియమ్సన్, సాన్‌ట్నర్, జేమీసన్ మాత్రం భారత్‌లోనే ఉండి మే 11న ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. ‘మా మెడికల్ పాలసీ పని చేస్తుందా’ భారత్‌లో కరోనా పరిస్థితుల వార్తలు సోషల్ మీడియాలో చదువుతూ భయపడిన ఐపీఎల్ విదేశీ క్రికెటర్లు లీగ్‌లోకి కూడా కరోనా ప్రవేశించడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. భారత ఆటగాళ్లు వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించినా విదేశీ క్రికెటర్లలో భయం మరింత పెరిగిపోయిందని సన్‌రైజర్స్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి అన్నాడు. ‘అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కానీ వైరస్ ఎలా బబుల్‌లోకి వచ్చిందో తెలీదు. ఒక్కసారి కరోనా సహచరుడికి వచ్చిందని తెలిశాక ఆటగాళ్లంతా భయపడిపోయారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు అప్పటికే ఇక్కడి పరిస్థితులు, ఆక్సిజన్ సమస్యలు, బెడ్లు లేకపోవడంలాంటి వార్తలు చదివి ఉండటంతో మరింత బెంగ పెరిగిపోయింది. కొందరు క్రికెటర్లయితే నాకు ఇక్కడ కోవిడ్ వస్తే పరిస్థితి ఏమిటి. నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ భారత్‌లో పని చేస్తుందా అని కూడా అడిగేశారు’ అని గోస్వామి వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే లీగ్ వాయిదా ప్రకటనకు ముందు క్రికెటర్లలో ఎంతటి అభద్రతా భావం నెలకొందో అర్థమవుతుంది. -
Ravichandran Ashwin: ఐపీఎల్లో ఆడలేను!
చెన్నై: భారత సీనియర్ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ కరోనా తాజా పరిస్థితులతో కలత చెందాడు. కోవిడ్–19 విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు తన ఆత్మీయులు ఒకవైపు ప్రయ త్నిస్తుండగా, మరో వైపు తాను క్రికెట్ ఆడలేనంటూ స్పష్టం చేశాడు. తాజా సీజన్ ఐపీఎల్‌నుంచి తప్పుకుంటున్నట్లు అతను ప్రకటించాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌నుంచి విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబంతో పాటు బంధుమిత్రులు ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలనుకుంటున్నాను. మున్ముందు పరిస్థితులు మెరుగుపడితే మళ్లీ వచ్చి ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. లీగ్‌లో అశ్విన్ 5 మ్యాచ్‌లు ఆడాడు. దేశం పరిస్థితి చూస్తుంటే తన గుండె బద్దలవుతోందని...తన వం తుగా ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉంటే తాను సిద్ధమేనంటూ మూడు రోజుల క్రితం కూడా అశ్విన్ ట్వీట్ చేయడాన్ని బట్టి చూస్తే అతను మానసికంగా సంఘర్షణకు లోనైనట్లు అర్థమవుతోంది. మా వల్లా కాదు... భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మున్ముందు ఆంక్షలు విధిస్తే స్వదేశం చేరలేమనే ఆందోళనతో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్‌నుంచి తప్పుకున్నారు. ఆర్సీబీ జట్టులో ఉన్న కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపాలతో పాటు రాజస్తాన్ టీమ్ సభ్యుడు ఆండ్రూ టై లీగ్‌కు గుడ్‌బై చెప్పారు. రిచర్డ్సన్, జంపా ‘వ్యక్తిగత కారణాలు’ అంటూ వెల్లడించగా...సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉంటున్న ఒత్తిడిని తట్టుకోలేకపోయానని టై స్పష్టం చేశాడు. గత ఆగస్టు నుంచి 11 రోజులు మాత్రమే టై తన ఇంట్లో గడిపాడు. -
అభిమాన ఆటకు చేటు చేశామని వేదన..
బాల్ ట్యాంపరింగ్ ఘటనతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కుదుపునకు లోనైతే... అందుకు పాల్పడి శిక్షకు గురైన ఆటగాళ్లు తీవ్ర మనో వ్యథకు గురవుతున్నారు. తమది ఎంత పెద్ద తప్పో, తమను ఇంతవారిని చేసిన ఆటకు చేసిన చేటేమిటో తలచుకుని కుమిలిపోతున్నారు. సస్పెన్షన్ కారణంగా స్వదేశానికి తిరిగివచ్చిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు గురువారం మీడియాతో మాట్లాడారు. దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీ చేరుకున్న స్మిత్ విమానాశ్రయంలోనే మీడియా సమావేశం నిర్వహించాడు. ఓ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చాడు. అబద్ధమాడాను... ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువు విషయంలో నేను అబద్ధమాడాను. ఆస్ట్రేలియన్లంతా తలదించుకునేలా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరడం ఒక్కటే ఇప్పుడు చేయగలను. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించాను. అయితే అంపైర్లు, మీడియాతో దానిని పసుపు రంగు టేపుగా చెప్పాను. విచారణ తర్వాత అసలు విషయం తేలింది. భవిష్యత్‌లోనూ నేను చింతించే అంశం ఇది. ఈ ఘటన నా హృదయాన్ని చాలా బాధించింది. జట్టులో స్థానాన్ని చేజేతులా పోగొట్టుకున్నా. గతంలో ఎన్నడూ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదు. వ్యక్తిగా, ఆటగాడిగా నమ్మిన విలువల విషయంలో రాజీ పడ్డాను. అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ, క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తూ పాల్పడిన ఈ చర్య క్రికెట్ ఎలా ఆడకూడదో చెప్పేందుకు ఓ ఉదాహరణ. కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి పొందడం కష్టమే అయినా అది నాకు చాలా ముఖ్యం. నిషేధంలో భాగమైన స్వచ్ఛంద సేవ ద్వారా సమాజానికి ఎంతో కొంత చేస్తాను. నేను కూడా... ► రాజీనామా ప్రకటించిన లీమన్ ► స్మిత్ భావోద్వేగ ప్రసంగమే కారణం ► హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై జొహన్నెస్‌బర్గ్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆటగాళ్ల నిషేధం తర్వాత ఇప్పుడు కోచ్ వంతు! క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నివేదిక ప్రకారం తన తప్పేమీ లేదని తేలినా... జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం లీమన్ ప్రకటించాడు. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టు కోచ్‌గా తనకు చివరిదని అతను వెల్లడించాడు. వివాదంలో తన గురించి వినిపించిన వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందానన్న లీమన్... ఉదయం స్మిత్ భావోద్వేగ ప్రసంగం కూడా తన రాజీనామాకు కారణమని వెల్లడించాడు. ‘గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, తీవ్రమైన పదజాలంతో మమ్మల్ని ద్వేషిస్తున్న తీరును బట్టి చూస్తే ఇక కొనసాగడం కష్టమనిపించింది. నేను, నా వాళ్లు ఎంతో భరించాం. వివాదంలో నాకు భాగం లేదని మరోసారి చెబుతున్నాను. సంవత్సరంలో నేను 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు నా వాళ్లతో సమయం గడిపేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. గత ఐదు రోజులుగా మేమెవ్వరం సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో, మనసులో ఎంతో సంఘర్షణతో ఆటతో అనుబంధం కొనసాగించలేం’ అని లీమన్ వ్యాఖ్యానించాడు. తన నిర్ణయం జట్టుకు కూడా ఉపయోగపడుతుందని, అన్నీ మరచి కొత్త ఆరంభంతో ముందుకు వెళ్లేందుకు అది అవసరమని లీమన్ ఉద్వేగంగా చెప్పాడు. ‘ఇద్దరు యువ ఆటగాళ్లు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు అసాధారణం. స్మిత్ ఏడవడం చూస్తే నాకు చాలా బాధ వేసింది. మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు’ అని లీమన్ అన్నాడు. తాను రాజీనామా చేయడం లేదని ఇంతకు ముందే ప్రకటించినా... స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను చూసిన తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు అతను స్పష్టం చేశాడు. ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియా కోచ్‌గా లీమన్ బాధ్యతలు చేపట్టాడు. మళ్లీ మాట్లాడతా... చిన్నతనం నుంచి నేను అభిమానించిన క్రీడపై మచ్చపడేలా చేసినందుకు దేశంలోని, ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరికి క్షమాపణలు కోరుతున్నాను. ఇది నా భార్య, పిల్లలకు తీవ్ర భావోద్వేగ సమయం. ఇప్పుడు నా ప్రాధాన్యం నా పిల్లలను నిద్ర పుచ్చడమే. మనసు కొంత స్థిమితపడ్డాక రెండు రోజుల్లో మళ్లీ మాట్లాడతాను. ఏడాది నిషేధ సమయాన్ని కుటుంబం, స్నేహితులు, సన్నిహితులతో గడపాలని అనుకుంటున్నా. కుటుంబంతో వార్నర్ పూర్తి బాధ్యత నాదే... ట్యాంపరింగ్ ఘటన నా నాయకత్వ వైఫల్యమే. అందుకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఇతరులెవరినీ నిందించలేను. చేసిన తప్పునకు పర్యవసానాలను ఎదుర్కొంటున్నాను. గొప్ప వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు. ఇలా చేసేందుకు అనుమతించడం నా నిర్ణయ లోపం. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్‌లో జరగదని హామీ ఇస్తున్నాను. ఇది జీవితాంతం చింతించాల్సిన విషయం. అందరికీ పాఠం. కానీ నష్టం భర్తీకి చేయగలిగినంత చేస్తా. ఓ మార్పునకు నేనో కారణం కావొచ్చు. కాలంపై ఆశగా ఉన్నా. కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందగలనన్న నమ్మకం ఉంది. ప్రపంచంలోనే క్రికెట్ గొప్ప క్రీడ. ఇది నా జీవితం. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఉన్నత స్థితి, గౌరవం పొందా. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఓ నిర్ణయం తీసుకునేటపుడు దాని ప్రభావం ఎవరిపై ఉంటుందో ఆలోచించాలి. అది తల్లిదండ్రులనూ ఇబ్బంది పెట్టొచ్చు. వృద్ధాప్యంలోని నా తండ్రి బాధను చూడండి. నా చర్యతో అమ్మ కూడా బాధపడుతోంది. అందరి మనసులను తీవ్రంగా గాయపర్చినందుకు ఆస్ట్రేలియా ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. -
కుట్ర పన్నింది అతడే.. ఎన్నటికీ కెప్టెన్ కాలేడు!
న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అసాధారణ నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్తులో ఎవరూ బాల్ ట్యాంపరింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడకుండా ఆదర్శప్రాయమైన శిక్షలు విధించిందని చెప్పాలి. కెప్టౌన్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మూడో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌పై అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ ఆడకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. బాల్ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన బౌలర్ కామెరాన్ బెన్క్టాఫ్ట్పై తొమిది నెలల నిషేధం విధించింది. అయితే, బాల్ ఆకారాన్ని మార్చేందుకు టేప్‌ను కాకుండా సాండ్‌పేపర్‌ను (గరుకైన కాగితాన్ని) ఉపయోగించినట్టు విచారణలో తేలింది. అతనే కుట్రదారుడు.. ఎన్నటికీ కెప్టెన్సీ లేదు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన తాజా బాల్ ట్యాంపరింగ్ పథకానికి ప్రధాన సూత్రధారి డేవిడ్ వార్నర్ అని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చింది. బాల్ ఆకారాన్ని మార్చేందుకు వార్నర్ చేసిన పథక రచన గురించి స్మిత్ కూడా పూర్తిగా తెలుసునని తెలిపింది. ఈ వివాదానికి ప్రధాన కారకుడైన డేవిడ్ వార్నర్ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్, బౌలర్ బెన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. అలాగే కెప్టెన్సీ విషయంలో బెన్క్రాఫ్ట్పైనా రెండేళ్ల నిషేధం ఉంటుందని తెలిపింది. ఈ రెండేళ్లకాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని, ఆ తర్వాత ప్రజల నుంచి, క్రికెట్ అభిమానుల నుంచి, క్రికెట్ అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే.. అప్పుడు వీరు జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. అయితే, ఈ ఏడాది నిషేధకాలంలో వీరు క్లబ్ క్రికెట్ ఆడవచ్చునని, ఇలా క్లబ్ క్రికెట్ ఆడుతూ.. క్రికెట్ కమ్యూనిటీతో సంబంధాలు కొనసాగించేందుకు వారిని తాము ప్రోత్సహిస్తామని తెలిపింది. ఈ మేరకు విధించిన ఆంక్షలపై అప్పీల్ చేసుకునేందుకు దోషులైన క్రికెటర్లకు ఏడు రోజులు గడువు ఇచ్చింది. -
నీ భార్యాపిల్లలకు జరిగితే.. ఇలాగే స్పందిస్తావా?
బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొందరు నెటిజన్లు ఆసీస్ క్రికెటర్లపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆసీస్ క్రికెటర్లపై ‘వ్యక్తిగత దూషణలు’ ప్రోత్సహించేవిధంగా ఆయన ట్వీట్ ఉండటంతో.. డేవిడ్ వార్నర్ భార్య క్యాండైస్ ఘాటుగా స్పందించింది. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడించింది. అయితే, క్రికెటర్లపై ‘వ్యక్తిగత దూషణ’ను తాను ప్రోత్సహించడం లేదని వాన్ వివరణ ఇచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ బౌలర్ బెన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం.. ఈ వివాదంలో జట్టు కెప్టెన్ స్టీవ్ స్మీత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై వేటుపడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లపై సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆగ్రహంపై వాన్ స్పందిస్తూ.. ‘తమకు వ్యక్తిగత దూషణ ఎదురవుతోందని ఆసీస్ ఆటగాళ్లు అధికారికంగా ఫిర్యాదుచేయడం నాకు కితకితలు తెప్పిస్తోంది’ అని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై క్యాండైస్ ఆగ్రహంగా స్పందించింది. ‘నీకు నవ్వు తెప్పించడం నాకు ఆనందంగా ఉంది. కాబట్టి, నీ భార్యా, పిల్లలకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఎదురైతే.. నువ్వు ఆమోదిస్తావన్నమాట’ అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే, దానిని తాను అంగీకరించబోనని, అయితే, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన ఆధారంగానే బయట ప్రతిస్పందన వ్యక్తమవుతుందని, ఈ విషయాన్ని గుర్తించాలని వాన్ మరో ట్వీట్లో వివరణ ఇచ్చారు. ఆస్ట్రేలియా జట్టు తాజా దక్షిణాఫ్రికా పర్యటన వివాదాల మధ్య నడుస్తున్న సంగతి తెలిసిందే. వార్నర్ భార్య క్యాండైస్, న్యూజీల్యాండ్ రగ్బీ స్టార్ సోని బిల్ విలియమ్స్‌కు ఎఫైర్ ఉందని, 2007లో సిడ్నీలో వీరు గడిపారనే పుకార్లను మైదానంలో సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీ కాక్.. వార్నర్‌ను రెచ్చగొట్టేలా పేర్కొనడంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగే పరిస్థితి నెలకొంది. దక్షిణాఫ్రికా అభిమానులు కూడా ఈ ఎఫైర్ గురించి మైదానంలో వ్యాఖ్యలు చేయడం, సొని బిల్ మాస్కులు ధరించి రావడం ఆసీస్ ఆటగాళ్లను రెచ్చగొట్టింది. ఈ నేపథ్యంలో వెలుగుచూసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ ఆటగాళ్ల ప్రతిష్టను దిగజార్చింది. -
పరువు పాతాళంలోకి!
అనూహ్యంగా బయటడిన బాల్ ట్యాంపరింగ్ పెద్ద కుదుపులకే దారి తీస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్లో పెను సంక్షోభంగా నిలుస్తోంది. స్వదేశీ, విదేశీ మాజీ ఆటగాళ్ల విమర్శల తుఫానులో చిక్కుకుంది. ఏకంగా ఆ దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ రంగంలోకి దిగేంతగా తీవ్ర స్థాయి దాల్చింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను తక్షణమే పదవుల నుంచి తప్పించాలని ఆయన ఆదేశించగా... ఇటువైపు స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై జీవితకాల నిషేధం వంటి మరిన్ని సంచలన నిర్ణయాలకూ ఆస్కారం కనిపిస్తుండగా... పులి మీద పుట్రలా దక్షిణాఫ్రికా చేతిలో మూడో టెస్టులో దారుణ పరాజయం ఆసీస్‌ను మరింత కుంగదీసింది. సిడ్నీ/దుబాయ్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, ఏకంగా దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ జోక్యం చేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచి తప్పించింది. వికెట్ కీపర్ టిమ్ పైన్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. ‘ఈ టెస్టు పూర్తిగా సాగాల్సిన అవసరం ఉంది. స్మిత్, వార్నర్‌లతో చర్చించాం. వైదొలగేందుకు వారు అంగీకరించారు’ అని సీఏ చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపాడు. దీంతోపాటు ట్యాంపరింగ్ ఘటనపై అత్యవసర విచారణ జరిపేందుకు సీఏ హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, టీమ్ ఫెర్ఫార్మెన్స్ హెడ్ ప్యాట్ హోవార్డ్‌లు దక్షిణాఫ్రికా బయల్దేరారు. ‘మాతో సహా ఆస్ట్రేలియన్లంతా సమాధానం కోరుకుంటున్నారు. మా దర్యాప్తులో తేలిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రాధాన్యంగా తెలియపరుస్తాం’ అని సదర్లాండ్ పేర్కొన్నాడు. మరోవైపు బాల్ ట్యాంపరింగ్‌కు గాను ఆసీస్ సారథిపై ఒక టెస్టు నిషేధంతో పాటు వంద శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. నేరుగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతతో పాటు, మూడు డి మెరిట్ పాయింట్లు ఇచ్చింది. ‘క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే తీవ్ర చర్యలకు పాల్పడిన ఆటగాళ్లకు మద్దతుగా నిలిచినందుకు స్మిత్‌పై కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2.1 ఆర్టికల్ కింద, బంతి ఆకారం మార్చేందుకు ప్రయత్నించి లెవల్ 2 నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆర్టికల్ 2.2.9, నిబంధన 41.3 కింద బాన్‌క్రాఫ్ట్‌పై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ ఈ చర్యలు చేపట్టారు. దీంతో పాటు రెండు సస్పెన్షన్ పాయింట్లను ఎదుర్కొన్న స్మిత్ తదుపరి టెస్టుకు దూరం కానున్నాడు. అతడి ఖాతాలో నాలుగు డి మెరిట్ పాయింట్లు కూడా జమ కానున్నాయి. ‘ట్యాంపరింగ్ చేసేలా స్వయంగా ఆస్ట్రేలియా జట్టు నాయకత్వమే ప్రోత్సహించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఇది తీవ్రమైన అంశం. కెప్టెన్‌గా స్మిత్ దీనికి పూర్తిగా బాధ్యుడు. సస్పెన్షనే సరైనది’ అని రిచర్డ్సన్ స్పష్టం చేశారు. ఈ సిరీస్‌లో చోటుచేసుకున్న దూషణలు, అంపైర్ల నిర్ణయాలపై నిరసన, ప్రేక్షకుల అతి వంటి వాటిని ఇకపై నివారించే దిశగా ఐసీసీ చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. సభ్య దేశాలు కూడా క్రికెట్ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రయత్నించాలని కోరాడు. ఆలోచించాకే నిర్ణయం... న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో స్మిత్, వార్నర్‌ల ఐపీఎల్ భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఆస్ట్రేలియా బోర్డు, ఐసీసీ చర్యలు చేపట్టినప్పటికీ... బీసీసీఐ ఈ విషయమై ఎటువంటి ఆలోచన చేయడం లేదని శుక్లా వివరించారు. బీసీసీఐతో సమాలోచన చేశాకే స్మిత్‌పై తమ నిర్ణయం వెలువరిస్తామని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తెలిపింది. వార్నర్‌పై మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పందించలేదు. స్మిత్, వార్నర్ వంటి కీలక ఆటగాళ్లను ఒక్క ఘటనతో దూరం పెట్టలేమని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ చేశారనే వార్త విని షాక్‌కు గురయ్యా. ఆదర్శంగా నిలవాల్సిన వారు మోసపూరిత చర్యలకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ డేవిడ్ పీవెర్తో ఈ విషయంపై మాట్లాడాను. స్మిత్, వార్నర్‌లను వారి బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించాను. –టర్న్‌బుల్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి నిజాయతీగా చెప్పాలంటే గత 24 గంటలు మాకెంతో భారంగా గడిచాయి. మా అభిమానులందరినీ ఈ సందర్భంగా నేను క్షమాపణలు కోరుతున్నాను. మా నుంచి వారు ఇలాంటి ప్రదర్శనను ఆశించలేదు. –టిమ్ పైన్, ఆసీస్ తాత్కాలిక సారథి స్మిత్ చేసింది చాలా చాలా పెద్ద తప్పే. సరైన వ్యక్తులు పిలిస్తే ఆస్ట్రేలియా జట్టులోకి మళ్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. –మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఎంతవాడుగానీ... నైతికత లేకుంటే పతనమే! స్టీవ్ స్మిత్ ఉదంతం చెబుతున్నదిదే అతడు ఎనిమిదేళ్ల క్రితం టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసింది ఒక స్పిన్నర్‌గా. బ్యాటింగ్‌కు దిగింది 8వ స్థానంలో. కానీ, తర్వాత ఎంతో మెరుగయ్యాడు. ఓపెనింగ్‌తో పాటు 3, 4, 5 ఇలా పలు స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. కీలక ఆటగాడిగా ఎదగడమే కాదు... కెప్టెన్ కూడా అయ్యాడు. సంధి దశలో ఉన్న జట్టును ముందుండి నడిపించాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌గానూ నిలిచాడు. 64 టెస్టులు ముగిసేసరికి ఇప్పుడతడి సగటు 61.37. అయినా... ఏం లాభం? నైతికత అనే ఒక్క లక్షణం లేకపోవడంతో నాయకుడు కాస్తా ప్రతినాయకుడిలా కనిపిస్తున్నాడు. అతడే ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్. ఒక్కో మెట్టు ఎక్కి... క్రీజులో చిత్రవిచిత్ర స్టాన్స్, మెరుపు ఫీల్డింగ్‌తో పాటు అచ్చం బొమ్మలాంటి ముఖంతో తొలినాళ్లలో స్మిత్ కొంత ప్రత్యేకంగా కనిపించే వాడు. స్పిన్నర్‌గా అడుగుపెట్టినా పేరుగాంచింది మాత్రం బ్యాట్స్‌మన్‌గానే. అడ్డదిడ్డమైన షాట్లతో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి, ప్రపంచ వ్యాప్తంగా పరుగులు రాబడుతూ ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యధిక సగటు ఉన్న ఆటగాడిగా ఎదిగాడు. ఇలా కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎంతటి పేరు సంపాదించాడో, దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌తో అంతటి చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. తన ప్రతిష్ఠకు తానే మచ్చ తెచ్చుకున్నాడు. గతేడాది బెంగళూరులో భారత్‌తో టెస్టు సందర్భంగా డీఆర్ఎస్ కోరేందుకు జట్టు సభ్యులున్న బాల్కనీ వైపు చూసి స్మిత్ అప్పట్లోనే వివాదాస్పదమయ్యాడు. మతి చెడి అలా చేశానని తర్వాత ఒప్పుకున్నాడు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో టెస్టులోనూ అనుచిత ప్రవర్తనతో జరిమానాకు గురయ్యాడు. ఆ సందర్భంలో ‘నాయకుడిగా నేనింకా ఎదగాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని చెప్పాడు. తర్వాత కూడా అండర్సన్, రబడ వంటి బౌలర్లతో వాగ్యుద్ధానికి దిగాడు. ఇప్పుడు ఏకంగా ట్యాంపరింగ్‌తో పెద్ద తప్పే చేశాడు. అంత అవసరం ఏమొచ్చింది... దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్ 1–1తో ఉంది. జరుగుతున్నది మూడో టెస్టు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ పోరాడి ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. సఫారీల నుంచి రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటన ఎదురవుతోంది. మరీ బెదిరిపోవాల్సిన పనిలేదు. తమ రెండో ఇన్నింగ్స్‌లో దానికి బదులివ్వొచ్చు. అప్పటికీ విఫలమైతే టెస్టు చేజారుతుంది అంతే! లోపాలు సరిచేసుకుని చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయొచ్చు. ఆసీస్‌లాంటి జట్టుకు ఇదేమంత కష్టమూ కాదు. కానీ తప్పు దారిలో ఆలోచించి దోషిగా నిలబడ్డాడు. పైగా జట్టంతా తీసుకున్న నిర్ణయమంటూ అందరికీ ఆపాదించాడు. కొత్త కుర్రాడు బాన్‌క్రాఫ్ట్ సహా, నేరుగా ప్రమేయం లేని వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తునూ బలి చేశాడు. జీవితకాలం వెంటాడే తప్పు... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మిత్ ఆల్‌టైమ్ రెండో అత్యధిక రేటింగ్ పాయింట్లు (945) సాధించి ఉండవచ్చుగాక, చరిత్రలో రెండో అత్యధిక సగటుతో కెరీర్ ముగించొచ్చుగాక... ఇలాంటి ఘనతలు ఇంకెన్ని తన ఖాతాలో ఉన్నా బాల్ ట్యాంపరింగ్ అతడిని జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. ఒక మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలా, ఒక అండర్ ఆర్మ్ బౌలింగ్‌లా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. –సాక్షి క్రీడా విభాగం -
ఐపీఎల్ వల్లే మా జట్టు విఫలం: స్టీవ్ వా
సిడ్నీ: టెస్ట్, వన్డే క్రికెట్ ను కొన్నేళ్లపాటు ఎలాంటి ఇబ్బందులే లేకుండా ఏలిన దిగ్గజ జట్టు ఆస్ట్రేలియా ప్రస్తుతం తడబడుతోంది. వరుస సిరీస్ లలో ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలవడమే కాదు ఏకంగా వైట్ వైష్ అవుతుంది. ఆస్ట్రేలియా ఓట్టు ఓటమికి కారణాలపై దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా భిన్నంగా స్పందించాడు. ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగి పోయిందని, ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కూడా ఆసీస్ వైఫల్యానికి కారణమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో ఆడటం, ఆ వెంటనే తీరికలేని సిరీస్ షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు అలసటతో పాటు ఒత్తిడికి గురువతున్నారని చెప్పాడు. రెండు నెలల కిందట లంక గడ్డపై వారి చేతిలో మూడు టెస్టుల సిరీస్ లో 3-0తో వట్ వాష్ అయింది. కొన్ని రోజుల కిందట దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్ లో ఏకంగా 5-0తో దారుణ వైఫల్యాన్ని మూటకట్టుకుంది. వచ్చే ఏడాది ఆసీస్ జట్టు భారత్ లో పర్యటించనుంది. వాస్తవానికి తనతో పాటు అంతకంటే ముందు తరం క్రికెటర్లు క్లబ్ క్రికెట్ కూడా ఆడారని గుర్తుచేశాడు. ప్రస్తుత క్రికెట్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం, బీజీ షెడ్యూల్స్ వల్ల ప్లేయర్లు గాయాలపాలయ్యే అవకాశాలు అధికమని స్టీవ్ వా వివరించాడు.