మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన స్మిత్
బాల్ ట్యాంపరింగ్ ఘటనతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కుదుపునకు లోనైతే... అందుకు పాల్పడి శిక్షకు గురైన ఆటగాళ్లు తీవ్ర మనో వ్యథకు గురవుతున్నారు. తమది ఎంత పెద్ద తప్పో, తమను ఇంతవారిని చేసిన ఆటకు చేసిన చేటేమిటో తలచుకుని కుమిలిపోతున్నారు. సస్పెన్షన్ కారణంగా స్వదేశానికి తిరిగివచ్చిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు గురువారం మీడియాతో మాట్లాడారు. దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీ చేరుకున్న స్మిత్ విమానాశ్రయంలోనే మీడియా సమావేశం నిర్వహించాడు. ఓ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చాడు.
అబద్ధమాడాను...
ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువు విషయంలో నేను అబద్ధమాడాను. ఆస్ట్రేలియన్లంతా తలదించుకునేలా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరడం ఒక్కటే ఇప్పుడు చేయగలను. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించాను. అయితే అంపైర్లు, మీడియాతో దానిని పసుపు రంగు టేపుగా చెప్పాను. విచారణ తర్వాత అసలు విషయం తేలింది. భవిష్యత్‌లోనూ నేను చింతించే అంశం ఇది.
ఈ ఘటన నా హృదయాన్ని చాలా బాధించింది. జట్టులో స్థానాన్ని చేజేతులా పోగొట్టుకున్నా. గతంలో ఎన్నడూ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదు. వ్యక్తిగా, ఆటగాడిగా నమ్మిన విలువల విషయంలో రాజీ పడ్డాను. అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ, క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తూ పాల్పడిన ఈ చర్య క్రికెట్ ఎలా ఆడకూడదో చెప్పేందుకు ఓ ఉదాహరణ. కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి పొందడం కష్టమే అయినా అది నాకు చాలా ముఖ్యం. నిషేధంలో భాగమైన స్వచ్ఛంద సేవ ద్వారా సమాజానికి ఎంతో కొంత చేస్తాను.
నేను కూడా...
► రాజీనామా ప్రకటించిన లీమన్
► స్మిత్ భావోద్వేగ ప్రసంగమే కారణం
► హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై
జొహన్నెస్‌బర్గ్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆటగాళ్ల నిషేధం తర్వాత ఇప్పుడు కోచ్ వంతు! క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నివేదిక ప్రకారం తన తప్పేమీ లేదని తేలినా... జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం లీమన్ ప్రకటించాడు. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టు కోచ్‌గా తనకు చివరిదని అతను వెల్లడించాడు. వివాదంలో తన గురించి వినిపించిన వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందానన్న లీమన్... ఉదయం స్మిత్ భావోద్వేగ ప్రసంగం కూడా తన రాజీనామాకు కారణమని వెల్లడించాడు.
‘గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, తీవ్రమైన పదజాలంతో మమ్మల్ని ద్వేషిస్తున్న తీరును బట్టి చూస్తే ఇక కొనసాగడం కష్టమనిపించింది. నేను, నా వాళ్లు ఎంతో భరించాం. వివాదంలో నాకు భాగం లేదని మరోసారి చెబుతున్నాను. సంవత్సరంలో నేను 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు నా వాళ్లతో సమయం గడిపేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. గత ఐదు రోజులుగా మేమెవ్వరం సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో, మనసులో ఎంతో సంఘర్షణతో ఆటతో అనుబంధం కొనసాగించలేం’ అని లీమన్ వ్యాఖ్యానించాడు.
తన నిర్ణయం జట్టుకు కూడా ఉపయోగపడుతుందని, అన్నీ మరచి కొత్త ఆరంభంతో ముందుకు వెళ్లేందుకు అది అవసరమని లీమన్ ఉద్వేగంగా చెప్పాడు. ‘ఇద్దరు యువ ఆటగాళ్లు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు అసాధారణం. స్మిత్ ఏడవడం చూస్తే నాకు చాలా బాధ వేసింది. మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు’ అని లీమన్ అన్నాడు. తాను రాజీనామా చేయడం లేదని ఇంతకు ముందే ప్రకటించినా... స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను చూసిన తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు అతను స్పష్టం చేశాడు. ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియా కోచ్‌గా లీమన్ బాధ్యతలు చేపట్టాడు.
మళ్లీ మాట్లాడతా...
చిన్నతనం నుంచి నేను అభిమానించిన క్రీడపై మచ్చపడేలా చేసినందుకు దేశంలోని, ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరికి క్షమాపణలు కోరుతున్నాను. ఇది నా భార్య, పిల్లలకు తీవ్ర భావోద్వేగ సమయం. ఇప్పుడు నా ప్రాధాన్యం నా పిల్లలను నిద్ర పుచ్చడమే. మనసు కొంత స్థిమితపడ్డాక రెండు రోజుల్లో మళ్లీ మాట్లాడతాను. ఏడాది నిషేధ సమయాన్ని కుటుంబం, స్నేహితులు, సన్నిహితులతో గడపాలని అనుకుంటున్నా.
కుటుంబంతో వార్నర్
పూర్తి బాధ్యత నాదే...
ట్యాంపరింగ్ ఘటన నా నాయకత్వ వైఫల్యమే. అందుకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఇతరులెవరినీ నిందించలేను. చేసిన తప్పునకు పర్యవసానాలను ఎదుర్కొంటున్నాను. గొప్ప వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు. ఇలా చేసేందుకు అనుమతించడం నా నిర్ణయ లోపం. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్‌లో జరగదని హామీ ఇస్తున్నాను. ఇది జీవితాంతం చింతించాల్సిన విషయం. అందరికీ పాఠం. కానీ నష్టం భర్తీకి చేయగలిగినంత చేస్తా. ఓ మార్పునకు నేనో కారణం కావొచ్చు.
కాలంపై ఆశగా ఉన్నా. కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందగలనన్న నమ్మకం ఉంది. ప్రపంచంలోనే క్రికెట్ గొప్ప క్రీడ. ఇది నా జీవితం. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఉన్నత స్థితి, గౌరవం పొందా. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఓ నిర్ణయం తీసుకునేటపుడు దాని ప్రభావం ఎవరిపై ఉంటుందో ఆలోచించాలి. అది తల్లిదండ్రులనూ ఇబ్బంది పెట్టొచ్చు. వృద్ధాప్యంలోని నా తండ్రి బాధను చూడండి. నా చర్యతో అమ్మ కూడా బాధపడుతోంది. అందరి మనసులను తీవ్రంగా గాయపర్చినందుకు ఆస్ట్రేలియా ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను.
Comments
Please login to add a commentAdd a comment