ట్యాంపరింగ్‌తో పరువు ఎలాగూ పోయింది...ఏడాది పాటు బ్యాట్‌ను ఇంట్లో మూలన పెట్టేయాల్సిందే... కానీ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు వీటితో పాటు ఆర్థికపరంగా కూడా భారీ స్థాయిలో నష్టం జరగనుంది. ఆటపరంగా, ఆర్జనపరంగాఆస్ట్రేలియా క్రికెట్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్నవీరిద్దరిపై తాజా పరిణామాలతో పెద్ద దెబ్బే పడబోతోంది. ఐపీఎల్‌కు దూరం కావడంతో పెద్ద మొత్తం కోల్పోయిన వీరిద్దరు సంవత్సరం పాటు ఇతర మ్యాచ్ ఫీజుల డబ్బులు కూడాపోగొట్టుకుంటారు. అన్నింటికి మించి వ్యక్తిగత స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు దూరం కావడం వల్ల జరిగే నష్టం కూడా చాలా పెద్దది.
సాక్షి క్రీడా విభాగం: ఆస్ట్రేలియా జట్టు రాబోయే షెడ్యూల్‌ను బట్టి చూస్తే సంవత్సర కాలంలో ఆ జట్టు 12 టెస్టులు, 26 వన్డేలు, 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడబోతోంది. కచ్చితంగా మూడు ఫార్మాట్‌లలో కూడా తుది జట్టులో ఉండగలిగే స్మిత్, వార్నర్ ఈ మ్యాచ్‌లు అన్నింటికీ దూరమవుతున్నారు. ఇంగ్లండ్ పర్యటన (ఐదు వన్డేలు, ఒక టి20), పాకిస్తాన్‌తో యూఈఏలో సిరీస్ (3 టెస్టులు), స్వదేశంలో దక్షిణాఫ్రికా (ఐదు వన్డేలు, 3 టి20లు), భారత్ (నాలుగు టెస్టులు) ఇందులో అతి ప్రధానమైనవి. ఇవి కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగే సిరీస్‌లకు కూడా వీరిద్దరు దూరం కానున్నారు.
ఐపీఎల్ దెబ్బ...
స్మిత్‌ను రాజస్తాన్ రాయల్స్, వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి ముందు తమతో అట్టి పెట్టుకున్నాయి. నిబంధనల ప్రకారం ఇద్దరిని చెరో రూ. 12 కోట్ల మొత్తానికి ఆయా ఫ్రాంచైజీలు ఉంచుకున్నాయి. స్మిత్ బ్యాటింగ్‌కంటే కూడా అతని నాయకత్వ ప్రతిభకారణంగానే రాయల్స్ ఎంచుకుందనేది వాస్తవం. 45 రోజుల వ్యవధిలో అతను ఇంత పెద్ద మొత్తం కోల్పోతున్నాడు. మరోవైపు 2016లో జట్టును చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా వార్నర్‌కు సన్‌రైజర్స్ ప్రత్యేక విలువ ఇచ్చింది. అందుకే కెప్టెన్‌గా తొలగించడంలో తొందర పడలేదు. బ్యాట్స్‌మన్‌గానైనా అతడిని ఆడించాలనే ఆలోచనే చివరి నిమిషం వరకు కూడా వారిలో కనిపించింది. అయితే నేరుగా బీసీసీఐ అడ్డు చెప్పడంతో మరో అవకాశం లేకుండా పోయింది.
కాంట్రాక్ట్ మొత్తమూ...
ప్రస్తుతం స్మిత్, వార్నర్ మ్యాచ్ ఫీజు రూపంలో ఆసీస్ బోర్డు నుంచి చెరో 5 లక్షల 80 వేల ఆస్ట్రేలియా డాలర్లు తీసుకుంటున్నారు. వార్షిక కాంట్రాక్ట్ రూపంలో స్మిత్‌కు 15 లక్షల డాలర్లు, వార్నర్‌కు 8 లక్షల 16 వేల డాలర్లు లభిస్తున్నాయి. ఐపీఎల్ మొత్తంతో పాటు దీనిని కలిపితే స్మిత్ ఏడాదికి 45 లక్షల 80 వేల ఆసీస్ డాలర్లు, వార్నర్ 38 లక్షల 96 వేల ఆసీస్ డాలర్లు పోగొట్టుకుంటారు. మన కరెన్సీలో చూస్తే స్మిత్‌కు రూ. 22 కోట్ల 90 లక్షలు... వార్నర్‌కు రూ. 19 కోట్ల 48 లక్షల నష్టం జరగనుంది. ఏ రకంగా చూసినా మైదానంలో ఆట ద్వారా దక్కే ఆర్జనను వీరు భారీగా కోల్పోయినట్లే లెక్క.
స్పాన్సర్లూ వెనక్కి...
ట్యాంపరింగ్‌తో దేశ ప్రజలందరి దృష్టిలో విలన్లుగా మారిన క్రికెటర్లతో అనుబంధం కొనసాగించడం ఏ సంస్థకైనా కష్టమే. బ్రాండ్ అంబాసిడర్లుగా తమ ఉత్పత్తుల స్థాయిని పెంచాల్సినవాళ్లు చేసిన పనితో తమ ప్రతిష్ట ఇంకా దెబ్బ తినవచ్చని వారు భయపడటం సహజం. అందుకే ఇప్పుడు వీరిద్దరి స్పాన్సర్లలో ఎంత మంది కొనసాగుతారో చెప్పడం కష్టం. వార్నర్‌తో ఒప్పందం పునరుద్ధరించుకోబోమని ఎల్‌జీ ఇప్పటికే ప్రకటించింది. అతనికి నెస్లే మైలో, టయోటా, అసిక్స్, గ్రే నికోల్స్‌తో ఒప్పందం ఉంది. స్మిత్‌కు న్యూ బ్యాలెన్స్ ప్రధాన స్పాన్సర్ కాగా...జిల్లెట్, ఫిట్‌బిట్, వీట్ బిక్స్ తదితర సంస్థలతో పెద్ద ఒప్పందాలు ఉన్నాయి. క్రికెట్‌పరంగా కోల్పోయే డబ్బుతో పాటు ఇవన్నీ కూడా జత కలిస్తే ట్యాంపరింగ్ వీరిద్దరిపై ఎంత ప్రభావం చూపించబోతోందో అర్థమవుతుంది.
ఇందుకే వారికి శిక్ష
తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనను ఉల్లంఘించినందుకే ముగ్గురు ఆటగాళ్లపై చర్యలు తీసుకున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రధానంగా నాలుగు అంశాలను ఇందులో ప్రస్తావించింది. అవి 1) క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడం 2) స్థాయికి తగినట్లు ప్రవర్తించకపోవడం 3)క్రికెట్ ప్రయోజనాలకు హాని కలిగించడం 4) ఆటను వివాదాస్పదం చేయడం. వీటితోపాటు ఆటగాళ్లు వ్యక్తిగతంగా చేసిన తప్పులనూ పేర్కొంది. దాని ప్రకారం ఎవరెలా అంటే...
స్టీవ్ స్మిత్:
1. బంతి ఆకారాన్ని కృత్రిమంగా మార్చే ఆలోచన గురించి ఇతడికి తెలుసు.
2. ట్యాంపరింగ్ ప్రణాళిక అమలు కాకుండా నిరోధించలేదు.
3. ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువును మైదానంలో దాచి ఉంచేందుకు ప్రయత్నించడం.
4. బాన్‌క్రాఫ్ట్ ప్రయత్నాలపై మ్యాచ్ అఫీషియల్స్, ఇతరులను తప్పుదారి పట్టించడం.
5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలతో పాటు ప్లాన్‌ను పొడిగించి, అందులో అందరినీ భాగస్వాములుగా చేసేందుకు ప్రయత్నించడం.
డేవిడ్ వార్నర్:
1. ట్యాంపరింగ్ ఆలోచనను రూపొందించడం.
2. బంతి ఆకారం దెబ్బతీసేలా జూనియర్ ఆటగాడికి సూచనలు చేయడం.
3. బంతి స్వరూపాన్ని ఎలా మార్చవచ్చో సలహాలివ్వడంతో పాటు వివరించి చూపడం.
4. ప్లాన్ అమలును నిరోధించడంలో విఫలమవడం.
5. తన పరిజ్ఞానంతో మ్యాచ్ అధికారులను తప్పుదోవ పట్టించడం, ట్యాంపరింగ్‌లో భాగం కావడం.
6. మ్యాచ్ అనంతరం కూడా తన ఆలోచనను స్వచ్ఛందంగా వెల్లడించకపోవడం.
బాన్‌క్రాఫ్ట్:
1. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ఆలోచనలో నేరుగా పాల్గొనడం.
2. ట్యాంపరింగ్ ప్రయత్నాన్ని కొనసాగించడం
3. తన దగ్గర ఉన్న వస్తువును దాచి ఉంచేందుకు ప్రయత్నించడం.
4. మ్యాచ్ అధికారులు, ఇతరులను తప్పుదారి పట్టించడం.
5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం.
Comments
Please login to add a commentAdd a comment