కామెరాన్ బెన్‌క్రాఫ్ట్
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్నఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విధించిన శిక్షను సవాలు చేయబోనని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంతో నిషేదానికి గురైన మరో ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ సైతం స్మిత్ బాటలోనే నడుస్తానని తెలిపాడు. తాను సైతం సీఏ శిక్షను సవాలు చేయడం లేదని ఈ నిషేద కాలాన్ని పూర్తిచేసుకోని ఆస్ట్రేలియా ప్రజల మనసు గెలుచుకున్న తర్వాతే మైదానంలో అడుగుపెడుతానని స్పష్టం చేశాడు.
కెప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా ఈ యువ ఆటగాడు ఉప్పుకాగితంతో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తీవ్ర దుమారం చెలరేగగా క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తోపాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది, బెన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేదం విధించింది. ఈ నిషేదాన్ని సవాలు చేసే అవకాశం కూడా కల్పించింది. అయితే తాము చేసిన తప్పుకు సరైన శిక్షే అని భావించిన స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లు సవాలు చేయడం లేదని ప్రకటించారు. ఈ వివాదంపై ఇప్పటికే పశ్చాతాపం వ్యక్తం చేసిన వార్నర్ సవాలు అంశంపై మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీవ్ర శిక్షలు విధించిందని, వారికి విధించిన శిక్షలను తగ్గించాలని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) డిమాండ్ చేస్తూ మద్దతు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment