సిడ్నీ: గత కొన్నేళ్లలో భారత క్రికెట్ జట్టు విదేశాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని గెలుచుకోవడం పెద్ద విశేషం. ఈ విజయాల వెనక భారత ‘ఎ’ జట్టు కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చి దిద్దిన రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉంది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం గ్రెగ్ చాపెల్ గుర్తు చేస్తున్నాడు. గతంలో తమ దేశంలో ఇలాంటి పటిష్టమైన వ్యవస్థ ఉండేదని... దానిని స్ఫూర్తిగా తీసుకొని ద్రవిడ్ భారత్‌లో ఫలితాలు సాధిస్తే తమ టీమ్ మాత్రం వెనుకబడిపోయిందని అతను అభిప్రాయపడ్డాడు.
‘చరిత్రను చూస్తే యువ ఆటగాళ్లను తీర్చిదిద్ది సీనియర్ టీమ్‌లోకి వచ్చేసరికి రాటుదేల్చే గొప్ప వ్యవస్థ ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఉంది. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. ఎంతో మంది ప్రతిభావంతులైన కుర్రాళ్లను నేను చూశాను. కానీ వారు దారితెన్నూ లేనట్లు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విషయంలో ఆస్ట్రేలియా ఇప్పటికే వెనుకబడిపోయింది. ఇంగ్లండ్ ఇందులో బాగా పని చేస్తుండగా భారత్ కూడా ఆసీస్‌ను వెనక్కి నెట్టేసింది. భారత్‌లో దీనిని రాహుల్ ద్రవిడ్ సమర్థంగా అమలు చేస్తున్నాడు. నిజానికి అతను ఆస్ట్రేలియాలో ఉన్న వ్యవస్థను చూసి నేర్చుకొని భారత్‌లో దానిని తీర్చిదిద్దాడు’ అని చాపెల్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment