బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొందరు నెటిజన్లు ఆసీస్ క్రికెటర్లపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆసీస్ క్రికెటర్లపై ‘వ్యక్తిగత దూషణలు’ ప్రోత్సహించేవిధంగా ఆయన ట్వీట్ ఉండటంతో.. డేవిడ్ వార్నర్ భార్య క్యాండైస్ ఘాటుగా స్పందించింది. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడించింది. అయితే, క్రికెటర్లపై ‘వ్యక్తిగత దూషణ’ను తాను ప్రోత్సహించడం లేదని వాన్ వివరణ ఇచ్చుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ బౌలర్ బెన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం.. ఈ వివాదంలో జట్టు కెప్టెన్ స్టీవ్ స్మీత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై వేటుపడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లపై సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆగ్రహంపై వాన్ స్పందిస్తూ.. ‘తమకు వ్యక్తిగత దూషణ ఎదురవుతోందని ఆసీస్ ఆటగాళ్లు అధికారికంగా ఫిర్యాదుచేయడం నాకు కితకితలు తెప్పిస్తోంది’ అని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై క్యాండైస్ ఆగ్రహంగా స్పందించింది. ‘నీకు నవ్వు తెప్పించడం నాకు ఆనందంగా ఉంది. కాబట్టి, నీ భార్యా, పిల్లలకు కూడా ఇదే ట్రీట్‌మెంట్ ఎదురైతే.. నువ్వు ఆమోదిస్తావన్నమాట’ అంటూ కౌంటర్ ఇచ్చింది.
అయితే, దానిని తాను అంగీకరించబోనని, అయితే, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన ఆధారంగానే బయట ప్రతిస్పందన వ్యక్తమవుతుందని, ఈ విషయాన్ని గుర్తించాలని వాన్ మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చారు. ఆస్ట్రేలియా జట్టు తాజా దక్షిణాఫ్రికా పర్యటన వివాదాల మధ్య నడుస్తున్న సంగతి తెలిసిందే. వార్నర్ భార్య క్యాండైస్, న్యూజీల్యాండ్ రగ్బీ స్టార్ సోని బిల్ విలియమ్స్‌కు ఎఫైర్ ఉందని, 2007లో సిడ్నీలో వీరు గడిపారనే పుకార్లను మైదానంలో సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీ కాక్.. వార్నర్‌ను రెచ్చగొట్టేలా పేర్కొనడంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగే పరిస్థితి నెలకొంది. దక్షిణాఫ్రికా అభిమానులు కూడా ఈ ఎఫైర్ గురించి మైదానంలో వ్యాఖ్యలు చేయడం, సొని బిల్ మాస్కులు ధరించి రావడం ఆసీస్ ఆటగాళ్లను రెచ్చగొట్టింది. ఈ నేపథ్యంలో వెలుగుచూసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ ఆటగాళ్ల ప్రతిష్టను దిగజార్చింది.
Comments
Please login to add a commentAdd a comment