న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో పాల్గొనే ముందు అన్ని అంశాలు చూసుకొని, మున్ముందు రాబోయే సమస్యలను అంచనా వేసి సంతకాలు పెట్టాలని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) తమ ఆటగాళ్లను హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశంలోకి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఐపీఎల్‌లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లంతా ఒక రకంగా చిక్కుకుపోయారు. నేరుగా స్వదేశం వెళ్లలేక ఇప్పుడు మాల్దీవుల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనినే ఏసీఏ గుర్తు చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) వాయిదా పడిన సమయంలో కూడా లిన్, క్రిస్టియాన్, కటింగ్ కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ‘భవిష్యత్తులో ఇలాంటి స్థితి రాకూడదని కోరుకుంటున్నా. అయితే ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు కాస్త హోంవర్క్ చేసుకుంటే మంచిది. కరోనా కారణంగా ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. మన దేశంలో అయితే అంతా బాగుండి మీరంతా ఎంతో స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. సరిహద్దులు మూసేసి ప్రయా ణాలపై ఆంక్షలు పెడతారని ఆటగాళ్లూ ఊహించలేదు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన పెరగడం సహజం’ అని ఏసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ అన్నారు.
మైక్ హస్సీ మినహా....
కరోనా పాజిటివ్‌గా తేలిన చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మినహా మిగతా ఆస్ట్రేలియన్లంతా మాల్దీవులకు చేరుకున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించిన ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)... ప్రభుత్వ ఆంక్షల్లో సడలింపులు వచ్చేవరకు వారంతా మాల్దీవులలోనే ఉండి ఆస్ట్రేలియాకు బయల్దేరతారని చెప్పారు. హస్సీ మాత్రం కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయల్దేరతాడు. హస్సీ, బౌలింగ్ కోచ్ బాలాజీలను ముందు జాగ్రత్తగా సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించింది. ఇక్కడ తమకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్నాయని... అవసరమైతే చెన్నైలో చికిత్స అందించడం సులువవుతుందని సీఎస్‌కే వర్గాలు వెల్లడించాయి. ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు చేరుకున్న తర్వాతే ధోని తన ఇంటికి బయల్దేరనున్నాడు. ఎలాంటి ఆంక్షలులేని ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆటగాళ్లు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు దూరమవుతున్న న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్ కూడా స్వదేశం వెళ్లిపోగా... విలియమ్సన్, సాన్‌ట్నర్, జేమీసన్ మాత్రం భారత్‌లోనే ఉండి మే 11న ఇంగ్లండ్‌కు బయల్దేరతారు.
‘మా మెడికల్ పాలసీ పని చేస్తుందా’
భారత్‌లో కరోనా పరిస్థితుల వార్తలు సోషల్ మీడియాలో చదువుతూ భయపడిన ఐపీఎల్ విదేశీ క్రికెటర్లు లీగ్‌లోకి కూడా కరోనా ప్రవేశించడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. భారత ఆటగాళ్లు వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించినా విదేశీ క్రికెటర్లలో భయం మరింత పెరిగిపోయిందని సన్‌రైజర్స్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి అన్నాడు. ‘అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కానీ వైరస్ ఎలా బబుల్‌లోకి వచ్చిందో తెలీదు. ఒక్కసారి కరోనా సహచరుడికి వచ్చిందని తెలిశాక ఆటగాళ్లంతా భయపడిపోయారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు అప్పటికే ఇక్కడి పరిస్థితులు, ఆక్సిజన్ సమస్యలు, బెడ్‌లు లేకపోవడంలాంటి వార్తలు చదివి ఉండటంతో మరింత బెంగ పెరిగిపోయింది. కొందరు క్రికెటర్లయితే నాకు ఇక్కడ కోవిడ్ వస్తే పరిస్థితి ఏమిటి. నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ భారత్‌లో పని చేస్తుందా అని కూడా అడిగేశారు’ అని గోస్వామి వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే లీగ్ వాయిదా ప్రకటనకు ముందు క్రికెటర్లలో ఎంతటి అభద్రతా భావం నెలకొందో అర్థమవుతుంది.
‘హోం వర్క్’ చేసి సంతకాలు పెట్టండి
Published Fri, May 7 2021 6:30 AM | Last Updated on Fri, May 7 2021 7:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment