టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ రీఎంట్రీలో అదరగొట్టాడు. 360 రోజుల తర్వాత కాంపిటేటివ్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన షమీ.. వచ్చీ రాగానే రంజీ మ్యాచ్‌లో తన ప్రతాపం చూపించాడు. రంజీల్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించే షమీ మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు.
తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన షమీ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమీ బ్యాట్‌తోనూ రాణించాడు. 36 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించడంతో మధ్యప్రదేశ్‌పై బెంగాల్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది.
MOHAMMAD SHAMI PICKED 7 WICKETS IN HIS FIRST COMPETITIVE MATCH IN 360 DAYS. ❤️pic.twitter.com/e231mVfTDM
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2024
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ 228 పరుగులకు ఆలౌటైంది. షాబాజ్ అహ్మద్ (92), అనుస్తుప్ మజుందార్ (44) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆర్మన్ పాండే, కుల్వంత్ కేజ్రోలియా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ 167 పరుగులకే కుప్పకూలింది. షమీ (4/54) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సేనాపతి (47), రజత్ పాటిదార్ (41) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
61 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ 276 పరుగులకు ఆలౌటైంది. విృత్తిక్ ఛటర్జీ (52) అర్ద సెంచరీతో రాణించగా.. సుదీప్ ఘరామీ (40), సుదీప్ ఛటర్జీ (40), వృద్దిమాన్ సాహా (44), షమీ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.
338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. షమీ (3/102), షాబాజ్ అహ్మద్ (4/48), రోహిత్ కుమార్ (2/47), మొహమ్మద్ కైఫ్ (షమీ తమ్ముడు) (1/50) ధాటికి 326 పరుగులకు ఆలౌటైంది. సేనాపతి (50), శుభమ్ శర్మ (61), వెంకటేశ్ అయ్యర్ (53) మధ్యప్రదేశ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment