భారత అణు కార్యక్రమంలో కీలక పాత్ర
న్యూఢిల్లీ: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, భారత అణ్వస్త్ర పరీక్షల్లో కీలక భూమిక పోషించిన శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజగోపాల చిదంబరం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో కన్నుమూశారని అణు శక్తి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 88 ఏళ్ల చిదంబరం 1974లో, 1998లో భారత్ చేపట్టిన అణు పరీక్షల్లో ప్రధాన పాత్ర పోషించారు. చిదంబరం మృతి వార్త తెల్సి ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు.
‘‘భారత అణు కార్యక్రమ పితామహుల్లో ఒకరైన చిదంబరం దేశ శాస్త్రసాంకేతికత, వ్యూహాత్మక శక్తిసామర్థ్యాల మెరుగు కోసం అవిశ్రాంతంగా కృషిచేశారు. ఆయన చేసిన సేవలను యావత్ భారతావని, భవిష్యత్ తరాలు చిరకాలం గుర్తుంచుకుంటాయి’’అని మోదీ అన్నారు. భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహదారుగా 17 సంవత్సరాలపాటు కీలక సేవలు అందించారని శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్మరించుకున్నారు. ఆయన అసాధారణ శాస్త్రీయ మేథస్సు భారతదేశానికి ఎంతో సాయపడిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు.
అణు భౌతిక శాస్త్రంలో కృషి
1936 నవంబర్ 12నలో తమిళనాడులోని చెన్నైలో జన్మించిన చిదంబరం మీరట్‌లోని సనాతన్ ధర్మ్ పాఠశాలలో, చెన్నైలోని మైలాపూర్ స్కూల్‌లో చదువుకున్నారు. తర్వాత చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. బెంగళూరులో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీజీ చదివారు. అణుకార్యక్రమాల్లో పాల్గొంటూనే దాదాపు 60 సంవత్సరాలపాటు ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పనిచేసే అరుదైన వ్యక్తి చిదంబరం.
1962లో బాబా అణు పరిశోధనా కేంద్రం(బార్క్)లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత 1990లో బార్క్‌కు ఛైర్మన్ అయ్యారు. 1990–1993వరకు ఛైర్మన్‌గా ఉన్నారు. 1993–2000 కాలంలో కేంద్ర అణుఇంధన మంత్రితి్వశాఖకు కార్యదర్శిగా కొనసాగారు. 2001–2018 కాలంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. అంతర్జాతీయ అణుఇంధన సంస్థ(ఐఏఈఏ) గవర్నర్ల బోర్డ్‌కు 1994–95కాలంలో ఛైర్మన్‌గా సేవలందించారు.
సొంతంగా ప్లుటోనియం తీసుకొచ్చి..
1967 నుంచి భారత అణుపరీక్షలకు సంబంధించి ప్రాజెక్టుల్లో పనిచేయడం మొదలెట్టారు. 1974లో భారత్ తొలిసారిగా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ద పేరిట అణుపరీక్షలు చేపట్టింది. ఆ మిషన్‌లో అణుశాస్త్రవేత్తగా కీలక భూమిక పోషించారు. ముంబై నుంచి ఫ్లుటోనియంను ఈయనే స్వయంగా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌కు తీసుకొచ్చారు. 1998లో ఆపరేషన్ శక్తిపేరిట పోఖ్రాన్–2 అణుపరీక్షల సమయంలోనూ చిదంబరం న్యూక్లియర్ ఎనర్జీ బృందానికి సారథ్యం వహించారు.
నాటి రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) చైర్మన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్‌తో కలిసి పోఖ్రాన్ అణుపరీక్షను స్వయంగా పర్యవేక్షించారు. ఆనాడు 1998 మే 11 నుంచి మే 13వ తేదీ వరకు ఐదుసార్లు అణుపరీక్షలు జరిగాయి. దేశం కోసం అవిశ్రాంతంగా కృషిచేసినందుకు గుర్తింపుగా ఆయనకు భారత ప్రభుత్వం 1975లో పద్మ శ్రీతో, 1999లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌లనూ పొందారు. జాతీయ, అంతర్జాతీయ సైన్స్ అకాడమీల్లో సభ్యునిగా ఉన్నారు. ఎందరో యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఈయన స్ఫూర్తిదాతగా నిలిచారు. చిదంబరంకు భార్య చెల్లా, కుమార్తెలు నిర్మల, నిత్య ఉన్నారు.
Deeply saddened by the demise of Dr. Rajagopala Chidambaram. He was one of the key architects of India’s nuclear programme and made ground-breaking contributions in strengthening India’s scientific and strategic capabilities. He will be remembered with gratitude by the whole…
— Narendra Modi (@narendramodi) January 4, 2025
Comments
Please login to add a commentAdd a comment