Nuclear Scientist
-
బాండ్ సినిమాల్లోలాగా.. టెక్నాలజీ చేసిన ఘోర హత్య ఇది
AI In Mohsen Assassination: అర్టిఫిషీయల్ ఇంటెలిజెన్సీ.. దాదాపు ప్రతీ రంగం ఇప్పుడు ఈ సాంకేతికత చుట్టూరానే రౌండేస్తోంది. ఈ తరుణంలోనే ఈ టెక్నాలజీకి ఫుల్ డిమాండ్ ఏర్పడుతుండగా.. కాసుల్ని కురిపించే వ్యాపారం నడుస్తోంది. అయితే ఈ టెక్నాలజీ వినాశనం దిశగా అడుగులు వేయడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉండి.. ఓ సైంటిస్ట్ మేధావిని హత్యగావించిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రముఖ చర్చకు దారితీసింది. జేమ్స్ బాండ్ డై అనదర్ డే సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉండి.. శత్రువుని శాటిలైట్ సిస్టమ్ వ్యవస్థ ద్వారా మట్టుపెడతారు. హాలీవుడ్‌లోనే కాదు.. మన సినిమాల్లోనూ ఇలాంటి సీన్లు చూపిస్తుంటారు. ఆ టైంకి అవి అతిశయోక్తిగా అనిపించినప్పటికీ.. వాస్తవ ప్రపంచంలోనూ సినిమాను తలదన్నే అలాంటి ఘటనే ఇరాన్ సైంటిస్ట్ మోహెసన్ హత్య. ది టైమ్స్, న్యూయార్స్ టైమ్స్ తాజా కథనాలతో ఇప్పుడు ఈ అంశం తెర మీదకు వచ్చింది. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్.. మోహ్సెన్ ఫక్రిజదెహ్ మమబది. కిందటి ఏడాది నవంబర్‌లో దారుణ హత్యకు గురయ్యారు. భార్యతో కలిసి విహారయాత్రను ముగించుకుని.. ఇంటికి తిరిగి వస్తున్న టైంలో ఆటానమస్ శాటిలైట్ ఆపరేటెడ్ గన్ సాయంతో ఆయన్ని హత్య చేశారు. ప్రపంచంలో ఈ తరహాలో హత్యకు గురైన మొదటి వ్యక్తి మోహ్సెన్. పూర్తిగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ఉపయోగించి.. చుట్టుపక్కల ఎవరికీ ఏం కాకుండా ఈ హత్యకుట్రను అమలు చేయడం విశేషం. ఏం జరిగిందంటే.. ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ సైన్స్‌గా మెహ్సెన్కు పేరుంది. నిజానికి 2009లోనే ఆయనపై తొలిసారి హత్యాప్రయత్నం జరగ్గా.. తృటిలో తప్పించుకున్నారు. 2019లో మరో దఫా హెచ్చరికలు జారీ అయినప్పటికీ.. ఆయన తేలికగా తీసుకున్నారు. నవంబర్ 27, 2020న కాస్పియన్ సముద్ర తీరంలోని ఇంటి నుంచి తూర్పు టెహ్రాన్‌లోని అబ్జార్డ్ ఇంటికి ఎస్కార్ట్ మధ్య బయలుదేరాడు మోహ్సెన్ ఫక్రిజదెహ్. కాసేపట్లో ఇంటికి చేరుతారనే సమయానికి ఓ సిగ్నల్ దగ్గర ఆయనపైకి తుటాలు సంధించారెవరో. సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే.. చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోయేసరికి గందరగోళానికి గురయ్యాడు. ప్రమాదంలో మెహ్‌సెన్ భార్యకిగానీ, భద్రతా సిబ్బంది ఎవరికీగానీ చిన్నగాయం కూడా కాలేదు. అలా మెహ్సెన్ను మాత్రమే మట్టుపెట్టాలనే లక్ష్యాన్ని ప్రత్యర్థులు పూర్తి చేశారు. భారీ గన్.. సింగిల్ క్లిక్ ఇదేం ఆశ్చర్యం కలిగించే అంశం కాదు. డ్రోన్ దాడులు అందరికీ తెలిసినవే. స్థావరాలు, మనుషులు.. టార్గెట్లు ఏవైనాసరే ఫిక్స్ చేసి దాడులు చేయడం డ్రోన్ దాడుల ప్రత్యేకత. ఇవి గురి తప్పే సందర్భాలు చాలా తక్కువ. అలాగే డ్రోన్ తరహా దాడులు జరిగినప్పుడు అలారాలు మోగడం సహజం. కానీ, ఏఐ టెక్నాలజీ అలా కాదు. అవి నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితంగా, గుట్టుచప్పుడు కాకుండా చేరుకుంటాయి. అందుకే మోహ్సెన్ హత్యకుట్రలో ఈ సాంకేతికతను ఉపయోగించారు. టన్ను బరువుండే బెల్జియం ఆధారిత ఎఫ్ఎన్ ఏంఏజీ మెషిన్ గన్ను దాడికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఎక్కడో బయటి దేశం నుంచి కంప్యూటర్ ఆపరేటింగ్ ద్వారా శాటిలైట్ లింక్ సాయంతో మోహ్సెన్ మీద కాల్పులు జరిపారు. కారు వేగం.. కదలికలను సైతం నిశితంగా పరిశీలించిన ఆ ఏఐ బేస్డ్ గన్.. అరవై సెకన్లలో 15 బుల్లెట్లు పేల్చింది. చివరికి టార్గెట్‌ను పూర్తి చేసింది. వాళ్ల పనేనా? అంతా అనుకున్నట్లు ఇది ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కాదు. అమెరికా-ఇజ్రాయెల్ కుమ్మక్కై ఆయన్ని మట్టుపెట్టాయని ఈ కథనాల సారాంశం. గూఢాచర్యంలో కొత్త ఒరవడిని సృష్టించింది ఈ దాడి అని ఆ కథనాలు పేర్కొన్నాయి. రోబోటిక్స్ టెక్నాలజీని ఉపయోగించి.. టార్గెట్‌ను నాశనం చేయడమే ఈ కొత్త విధానం. 2020 సమ్మర్ నుంచి ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ మోస్సాద్ టీం, మెహ్‌సెన్ హత్యకుట్రకు ప్రణాళిక అమలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. దాడికి సంబంధించి ఇరాన్ దగ్గర తగిన ఆధారాలు లేవు. ఒకవేళ తుపాకీ దానికదే నాశనం అయ్యే టెక్నాలజీ యాక్సెస్ ఉంటే మాత్రం.. ఈ కుట్రకు సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టడంలో ఇరాన్‌కు దారులు మూసుకుపోయినట్లే అవుతుంది. కంప్యూటరైజ్డ్ మెషిన్ గన్.. ఆన్ సైట్ ఆపరేటివ్స్‌కు దూరంగా.. ఎక్కడో కమాండ్ సెంటర్లో ఉంటూ.. నిమిషంలోనే దాడి పూర్తి చేయడం సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లో అది అర్టిఫియల్ టెక్నాలజీతో సాధ్యమని ఇప్పుడు మీరూ ఒప్పుకుంటారు కదా!. చదవండి: పాత ఫొటోల్ని క్వాలిటీగా మార్చే ఏఐ టెక్నాలజీ.. మీరూ వాడొచ్చు -
శాస్త్రవేత్త హత్య: రియాద్ పాత్రను ఖండించిన సౌదీ!
రియాద్ : ఇరాన్‌కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొహ్సేన్ ఫక్రీజాదే హత్యలో రియాద్ పాత్ర ఉందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సౌదీ సీనియర్ మంత్రి మంగళవారం విరుచుకుపడ్డారు. ఇరాన్లో జరిగే ప్రతికూలతలు ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్ , సౌదీని నిందించడానికి తగదని సౌదీ విదేశాంగ మంత్రి అదెల్ అల్ జుబీర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇరాన్లో భూకంపం, వరదలకు కూడా తమనే నిందించేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. హత్యలకు పాల్పడటం సౌదీ అరేబియా విధానం కాదని ఆయన తెలిపారు. ఇరాన్, దాని శత్రువుల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో రాజధాని టెహ్రాన్ వెలుపల శుక్రవారం జరిగిన బాంబు దాడిలో ఫఖ్రిజాదే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జువాద్ జరీఫ్ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఇజ్రయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుల మధ్య రహస్య సమావేశం జరిగిన తర్వాత ఈ హత్య జరిగిందని ఆరోపించింది. ఇతర గల్ఫ్ దేశాల మాదిరిగా కాకుండ, సౌదీ అరేబియా-షియా శక్తి ఇరాన్‌తో దశాబ్దాల నాటి శత్రుత్వంతో ఉంది. గత నెలలో, నెతన్యాహు సౌదీ అరేబియాలో క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో చర్చలు జరిపినట్లు మీడియా, ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నెతన్యాహు మొసాద్ గూడాచారి ఏజెన్సీ చీఫ్ యోసేఫ్ మీర్ కోహెన్, ప్రిన్స్ మొహమ్మద్‌తో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీతో కలిసి నియోమ్‌లో సమావేశమయ్యారని సారాంశం. అయితే అలాంటి సమావేశం జరగలేదని రియాద్ ఖండించింది. సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు కానీ, ఇరాన్‌పై ఉన్న శత్రుత్వం ఆధారంగా ఇరువర్గాల సంబంధాలను పెంచుకుంటున్నాయి. ఫఖ్రిజాదేపై దాడి వెనుక ఇజ్రాయెల్ ఉందంటూ అమెరికన్ అధికారితో పాటు, మరో ఇద్దరు ఇంటలిజెన్స్ అధికారులు ధ్రువీకరించారని ఇండియా టైమ్స్ తెలిపింది. శాస్త్రవేత్తను హతమార్చడం ద్వారా ఇజ్రాయెల్‌లో గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఇరాన్ అధ్యక్షడు హసన్ రౌహాని ఆరోపించారు. అయితే తన దేశం ఉచ్చులో పడదని స్పష్టం చేశారు. -
పశ్చిమాసియా శాంతికి ముప్పు
అమెరికాలో రిపబ్లికన్ల నుంచి డెమొక్రాటిక్ పార్టీకి అధికార మార్పిడి ఖాయమని తేలిన తరుణంలోనే ఇరాన్లో అత్యున్నతస్థాయి అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదేను శుక్రవారం దేశ రాజధాని టెహ రాన్లో కొందరు దుండగులు కాల్చి చంపారు. ఇరాన్ శాస్త్రవేత్తలపై దాడులు మొదటిసారి కాదు. పదేళ్లుగా అవి కొనసాగుతూనే వున్నాయి. ఫక్రిజాదేతోపాటు ఆయన సహచరులు గతంలో ఇదే తరహాలో దుండగులకు లక్ష్యంగా మారారు. ఈ దాడుల సూత్రధారులు ఒకరే అని సందేహం కలి గేలా అవన్నీ ఎప్పుడూ ఒకే తీరులో వుంటాయి. టెహరాన్‌లో శాస్త్రవేత్తలు తమ విధులు ముగిం చుకుని కారులో ఇంటికెళ్తుండగా హఠాత్తుగా విరుచుకుపడి దాడి చేయడం, అంతే వేగంతో మటు మాయం కావడం రివాజుగా వస్తోంది. నలుగురు శాస్త్రవేత్తలు ఆ దాడుల్లో మరణిస్తే ఫక్రిజాదే ఒక్కరే సురక్షితంగా బయటపడ్డారు. కానీ ఈసారి మాత్రం ఆయన దుండగుల తూటాలను తప్పించు కోలేకపోయారు. ఆయన అత్యున్నత శ్రేణి శాస్త్రవేత్త మాత్రమే కాదు... కీలకమైన ఇరాన్ రివల్యూ షనరీ గార్డ్స్‌లో బ్రిగేడియర్ జనరల్ స్థాయి అధికారి కూడా. పరిశోధనలు మొదలుకొని క్షిపణుల్లో ఇమిడిపోయే అణ్వస్త్రాల రూపకల్పన వరకూ ఉన్న భిన్న ప్రక్రియలకు సంబంధించి వేర్వేరుచోట్ల జరిగే పనులను ఆయన సమన్వయం చేస్తున్నారు. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చాన్నా ళ్లుగా ఆయనపై గురిపెట్టాయి. వాటి ఒత్తిడి వల్ల కావొచ్చు... ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పని చేసే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) కూడా ఫక్రిజాదేతో మాట్లాడటానికి అనుమతించమని చాలాసార్లు ఇరాన్ ప్రభుత్వాన్ని కోరింది. అందుకు ఇరాన్ అంగీకరించలేదు. చూడటానికి ఇరాన్లో నిఘా వ్యవస్థ గట్టిగానే పనిచేస్తున్నట్టు కనబడుతుంది. గూఢచారులన్న అనుమానంతో అడపా దడపా విదేశీయుల్ని, స్థానికుల్ని అరెస్టు చేయడం...విచారణ జరిపి శిక్షించడం జరుగుతూనే వుంటుంది. కానీ పైకి కనబడేంత పటిష్టంగా ఆ వ్యవస్థ లేదని తరచు జరిగే దాడులు నిరూపిస్తున్నాయి. అణు కార్యక్రమాన్ని చాలా దగ్గరనుంచి పర్యవేక్షించేవారికి తప్ప అందులో పాలుపంచుకునే శాస్త్రవేత్తల పేర్లు, వారి ఇతర వివరాలు సాధారణ పౌరులకు తెలిసే అవకాశం లేదు. తరచుగా జరుగుతున్న దాడులు గమనిస్తే చాలా కీలకమైన స్థాయిలో వుండే వ్యక్తులే అవతలివారికి ఉప్పందిస్తున్నారని అర్థమవుతుంది. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ 2007లో అనుమానిత ఇరాన్ శాస్త్రవేత్తల జాబితా రూపొందించింది. వారంతా విద్యావేత్తలుగా చెప్పుకుంటున్నా అణు కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని తేల్చింది. అందులో ఫక్రిజాదా కూడా వున్నారు. ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు ఇజ్రాయెల్‌నే వేలెత్తి చూపుతోంది. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం గురించి అమెరికా, ఇతర అగ్రరాజ్యాలకూ వున్న ఆందోళన ఈనాటిది కాదు. అది అణ్వస్త్ర దేశంగా మారితే మొదట పశ్చిమాసియా, ఆతర్వాత ప్రపంచం పెను విధ్వంసం చవిచూడాల్సి వస్తుందని అవి భావిస్తున్నాయి. కనుకనే కఠినమైన ఆంక్షలు విధించి ఇరాన్‌ను దాదాపు ఏకాకిని చేశాయి. దశాబ్దాల తరబడి సాగిన ఆ ఆంక్షలు ఇరాన్‌ను అన్నివిధాలా కుంగదీశాయి. ప్రాణావసరమైన మందులు దొరక్క, నిత్యావసరాలు లభించక కటకటలాడారు. అయినా అణ్వాయుధ శక్తిగా ఎదిగేందుకు ఇరాన్ చేసే ప్రయత్నాలను ఆ ఆంక్షలు అడ్డ గించలేకపోయాయి. ఈ క్రమంలో అమెరికా, యూరప్ దేశాలు బాగా నష్టపోయాయి. బాలిస్టిక్ క్షిపణులకు అణ్వస్త్రాన్ని జతచేయగల సత్తా ఇరాన్‌కి వుందని తేలిపోయింది. కనుకనే బెట్టు తగ్గించి ఆ దేశంతో బేరసారాలకు దిగాయి. అణ్వస్త్రం ఆలోచన మానుకుంటే ఆంక్షలు ఎత్తేస్తామని చెప్పాయి. ఏడెనిమిది నెలలపాటు సుదీర్ఘ చర్చలు జరిపి ఒప్పించాయి. 2015లో ఒప్పందంపై సంత కాలయ్యాయి. దాని ప్రకారం కేవలం 3.67 శాతంమాత్రమే శుద్ధి చేసిన ఇంధనం వుంచుకోవచ్చని, అది కూడా 300 కిలోలు దాటరాదని పరిమితి పెట్టారు. ఇరాన్ వద్ద అప్పటివరకూ 90 శాతం శుద్ధి చేసిన యురేనియం ఇంధనం 10,000 కిలోలమేర వుండేది. అయినా ఇరాన్ అంగీకరించింది. ఐఏఈఏ క్షుణ్ణంగా తనిఖీ చేసి అంతా సవ్యంగా వుందని ధ్రువీకరించడంతో ఆంక్షల్లో చాలా భాగం రద్దుచేశారు. తీరా డోనాల్డ్ ట్రంప్ ఆ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామని నిరుడు ప్రకటించారు. మళ్లీ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. యూరప్ దేశాలు మాత్రం అమెరికాతో విభేదించి ఆ ఒప్పందంలో కొనసాగాయి. ఇజ్రాయెల్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇరాన్తోసహా అందరి అనుమానం ఇప్పుడు ఆ దేశంపైనే. పర్యవసానాలేమైనా ఇరాన్‌ను తీవ్రంగా నష్టపరచాలన్నదే దాని సంకల్పం. ట్రంప్ సైతం ఇరాన్‌పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాడికి దిగాలని ఇటీవలకాలంలో ఆలోచించారని... విదే శాంగమంత్రి పాంపియో, మిలిటరీ చీఫ్ మార్క్ మిల్లీ తదితరులు హెచ్చరించడంతో ఆయన వెనక్కితగ్గారని చెబుతారు. ఇప్పుడు జరిగిన దాడికి ఆయన మద్దతుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనవరిలో అధ్యక్ష పదవి స్వీకరించబోయే జో బైడెన్‌కు పశ్చిమాసియా సంక్షోభం పెద్ద పరీక్షగానే మారొచ్చు. ట్రంప్ హయాంలో అణు ఒప్పందం నుంచి తప్పుకున్నాక ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమంలో చాలా ముందుకుపోయింది. దానికి మళ్లీ నచ్చజెప్పి ఒప్పించడం, భవిష్యత్తులో ఈ పరిస్థితి ఏర్పడదని నమ్మించడం అంత సులభమేమీ కాదు. ఏదేమైనా అణ్వస్త్ర కార్యక్రమంలో పాలుపంచుకునే శాస్త్రవేత్తలను మట్టుబెడితే అంతా చక్కబడుతుందని భావించడం... కిరాయి మూకలతో, దొంగ దాడులతో వేరే దేశాన్ని అదుపు చేయగలమనుకోవడం తెలివితక్కువతనం. అలాంటివారివల్ల ప్రపంచ శాంతికి ముప్పు కలుగుతుంది. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దడానికి, అది మరింత ఉగ్రరూపం ధరించకుండా వుండేందుకు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మతిమాలిన చర్యలకు కారకులైనవారిని అభిశంసించాలి. -
ఇరాన్ శాస్త్రవేత్త దారుణహత్య
టెహ్రాన్ : ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త మొహ్సేన్ ఫక్రీజాదే(59) శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. టెహ్రాన్‌లో శివారులో తన వాహనంలో వెళ్తున్న ఫక్రిజాదేపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే తీవ్రంగా గాయపడ్డ ఫక్రీజాదే ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఇరాన్ రక్షణశాఖకు చెందిన రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ అధిపతిగా ఫక్రిజాదే పనిచేశారు.ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది. ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. టెహ్రాన్‌లో హత్యకు గురైన మొహసేన్ వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని.. అయితే హత్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా ఇరాన్ ప్రయత్నిస్తుందని లేఖలో తెలిపారు. (చదవండి : మాంసం ముద్దలు విసురుతూ నిరసన) 'ఇరాన్ శాస్త్రవేత్త ఫక్రీజాదేను ఉగ్రవాదులు దారుణ హత్య చేశారు. ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ నేరస్తుల పిరికితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హత్య తాము చేయలేదంటూ డబుల్ గేమ్ ఆడుతున్న ఇజ్రాయెల్ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మా శాస్త్రవేత్త హత్యకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం.' కాగా గతంలోనూ ఫక్రీజాదేపై పలుసార్లు హత్యాయత్నాలు జరిగినా తృటిలో తప్పించుకున్నారు. అయితే ఈ హత్యపై ఇజ్రాయెల్ ఇంతవరకు స్పందించలేదు. -
కరోనాతో పద్మశ్రీ శేఖర్ బసు కన్నుమూత
న్యూఢిల్లీ: కరోనాతో ఇటీవల పలువురు ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. కేంద్రమంత్రి సురేష్ అంగడి బుధవారం కరోనాతో మృతి చెందగా ఆయన మరణ వార్త మరవక ముందే టాలీవుడ్ ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించారు. తాజాగా అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్, పద్మశ్రీ డాక్టర్ శేఖర్ బసు(68) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. కరోనాతో పాటు కిడ్నీ సమస్యలతోనూ బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు తెల్లవారుజామున 4.50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. (కరోనాతో తెలుగు హాస్య నటుడు మృతి) మెకానికల్ ఇంజనీర్ అయిన డాక్టర్ బసు దేశంలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ తయారీలో కీలకపాత్ర పోషించారు. దేశంలో అణువిద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు కృషి చేశారు. 2015 అక్టోబర్ 23 నుంచి 2018 సెప్టెంబర్ 17 వరకు అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గానూ బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2014లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. (నటుడు విజయ్‌కాంత్‌కు కరోనా) -
ఐసీటీ వినియోగంతో అద్భుత ఫలితాలు
గెస్ట్ కాలమ్ అనిల్ కకోద్కర్.. ప్రపంచ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త. భారత అణుశక్తి సంఘం చైర్మన్‌గా పనిచేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. తొలుత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో రియాక్టర్ ఇంజనీరింగ్ విభాగంలో చిరుద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. భారత్ పరీక్షించిన రెండు అణ్వస్త్ర ప్రయోగ పరీక్షల్లో పాల్పంచుకున్నారు. మరోవైపు విద్యారంగంలోనూ కకోద్కర్ తన విశిష్ట సేవలను అందిస్తున్నారు. ఐఐటీ వంటి సంస్థల్లో చేపట్టాల్సిన సంస్కరణల కమిటీకి నేతృత్వం వహించి.. ఐఐటీల పురోభివృద్ధికి ఎన్నో సిఫార్సులు చేశారు. మన దేశంలో విద్యా విధానం అద్భుత ఫలితాలు సాధించాలంటే.. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని వినియోగించుకోవాలి, బోధన పద్ధతుల్లో కూడా మార్పులు రావాలి అంటున్న పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అనిల్ కకోద్కర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.. బరవాని గ్రామం నుంచి బార్క్ డెరైక్టర్ వరకు మీ ప్రస్థానం గురించి చెప్పండి? మధ్యప్రదేశ్‌లోని బరవాని నా స్వగ్రామం. ఖర్గోనేలో పాఠశాల విద్య పూర్తి చేశాను. కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ముంబై రావడం నా జీవిత గమ్యాన్నే మార్చింది. వాస్తవానికి ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఫిజిక్స్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకున్నా. అయితే, అప్పట్లో యూనివర్సిటీలో స్టూడెంట్ పాలిటిక్స్ కారణంగా ఫిజిక్స్‌లో నాణ్యమైన బోధనను ఆశించలేమని కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ చెప్పారు. దాంతో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో అడుగుపెట్టాను. ఇందులో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే.. రొటీన్‌కు భిన్నమైన అవకాశాల కోసం అన్వేషణ కొనసాగించా. ఆ సమయంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క)లో ఉద్యోగం లభించింది. ఇది నా కెరీర్ పరంగా అత్యంత కీలకమైన మలుపు. నేనేంటో నిరూపించుకునే విధంగా బార్క్‌లో అవకాశాలు లభించాయి. ఆ క్రమంలో అణుశక్తిని అభివృద్ధి చేసే విషయంలో ఎన్నో ఎసైన్మెంట్స్ చేయగలిగాను. ఇప్పటికీ.. కొత్తగా ఆలోచించే వారికి బార్క్‌లో అవకాశాలకు ఆకాశమే హద్దు. మీ కెరీర్లో చిరస్మరణీయమైన విజయం? ఎవరి కెరీర్‌లోనైనా ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తొలి అసైన్మెంట్ చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఫ్లేమ్ స్ప్రేయింగ్ ఉపయోగిస్తూ లోహ పదార్థంపై అల్యూమినియం కోటింగ్ విధానాన్ని వృద్ధి చేయడం నా తొలి అసైన్మెంట్. పూర్తిగా ఎవరి ప్రమేయం లేకుండా దీన్ని స్వయంగా వృద్ధి చేశాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేది. ఆ తర్వాత ధ్రువ రియాక్టర్ ఆవిష్కరణలో పాల్పంచుకున్నాను. మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్లో రియాక్టర్ల రిహాబిలిటేషన్.. 1974, 1998లలో పోఖ్రాన్ అణు పరీక్షల్లో భాగస్వామిని కావడం వంటివి మరికొన్ని చిరస్మరణీయ మైలురాళ్లు. విద్యారంగానికి సంబంధించి.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌గా.. ప్రస్తుత ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా విధానంపై మీ అభిప్రాయం? ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులను కేవలం లేబొరేటరీలు, క్లాస్ రూంలకే పరిమితం చేయడం సరికాదు. రీసెర్చ్‌పై అవగాహన కల్పించాలి. సాంకేతిక ఉత్పత్తులు/ప్రక్రియలపై సంబంధిత నైపుణ్యాలు అలవర్చాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి వివరించాలి. క్షేత్రస్థాయి పద్ధతుల ద్వారా ఆహ్లాదకరమైన అభ్యసన విధానాన్ని అందుబాటులోకి తేవాలి. క్లాస్ రూం వాతావరణం కూడా రియల్‌లైఫ్ వర్క్ కల్చర్‌కు దగ్గరగా ఉండేలా చూడాలి. దీనివల్ల విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. ఐఐటీలు ప్రతి ఏటా 10 వేల పీహెచ్‌డీలు ప్రదానం చేసే విధంగా చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు. ఇది ఆచరణ సాధ్యమేనా? నేను ఇలా సిఫార్సు చేయడానికి బలమైన కారణం ఉంది. దేశ జీడీపీ వృద్ధికి, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీల్లో పరిశోధనలకు మధ్య గట్టి సంబంధం ఉంది. మన దేశ భౌగోళిక స్వరూపం, ప్రపంచస్థాయిలో పోటీ, అభివృద్ధి దిశగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారీ సంఖ్యలో పీహెచ్‌డీల అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐఐటీ సంస్కరణల కమిటీ చైర్మన్‌గా.. పది వేల పీహెచ్‌డీలు అనే అంశాన్ని సిఫార్సు చేశాను. ప్రస్తుతం ఐఐటీల నుంచి మూడు వేల మంది ఏటా పీహెచ్‌డీలు అందుకుంటున్నారు. త్వరలోనే ఐఐటీలు పదివేల పీహెచ్‌డీల మైలు రాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నాను. ఈ విషయంలో టెక్నాలజీపై ఆధారపడి కార్యకలాపాలు సాగించే పారిశ్రామిక, ఆర్థిక విభాగాలు తమ భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించాలి. ఐఐటీ సంస్కరణల కమిటీ చైర్మన్‌గా ఎన్నో సిఫార్సులు చేసినా.. ఆర్థిక స్వయం ప్రతిపత్తికి సంబంధించిన సిఫార్సును ఐఐటీ గవర్నింగ్ కౌన్సిల్ వ్యతిరేకించడంపై మీ అభిప్రాయం? మా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఎన్నో ఇప్పటికే అమలవుతున్నాయి. ఆర్థికపరమైన కోణంలో విశ్లేషిస్తే.. ప్రభుత్వం నిరంతరం విద్యకు కేటాయింపులు పెంచుతోంది. అందరికీ నాణ్యమైన విద్య లభించాలి. ప్రపంచ స్థాయీ ప్రమాణాలు కూడా అందుకోవాలి. ఇలా జరగాలంటే బడ్జెట్లో విద్యకు కేటాయించే నిధులను భారీ స్థాయిలో పెంచాలి. నిర్దేశిత ఫీజులు చెల్లించగలిగేవారు, రుణ సదుపాయం లభించేవారికీ ఫీజు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదనేది మా ఉద్దేశం. కెరీర్ అవకాశాలు, ఉపాధి కచ్చితంగా లభించే ఐఐటీల మాదిరిగానే ఇతర ఇన్స్టిట్యూట్లను అభివృద్ధి చేయాలి. ఈ దిశగా బడ్జెట్ కేటాయింపులు పెంచాలని సూచన చేశాం. స్థూలంగా ఐఐటీ సంస్కరణల కమిటీ ఉద్దేశం.. మానవ వనరుల అభివృద్ధితోపాటు పరిశ్రమలకు, సమాజాభివృద్ధికి దోహదం చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయడం. ఉన్నత విద్యాభివృద్ధికి దూర విద్య విధానం దోహదం చేస్తుందని మీరు అన్నారు. దూరవిద్య ద్వారా నాణ్యతను ఆశించగలమా? మనం ఎ-3(ఎనీ వన్, ఎనీ వేర్, ఎనీ టైమ్) అనుసంధాన, లైఫ్‌లాంగ్ లెర్నింగ్ అవకాశం గల విజ్ఞానాధారిత సమాజంలో ఉన్నాం. ఉన్నత విద్యలో ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీల మధ్య క్రెడిట్ ట్రాన్స్ఫర్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదే సమయంలో అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దూరవిద్యా విధానం ద్వారా మరింత మందికి ఉన్నత విద్యను అందుబాటులోకి తేవచ్చు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా.. సమీకృత కృషితో దూర విద్యలోనూ నాణ్యతను పెంపొందించొచ్చు. దేశంలో ప్రస్తుత పరిశోధనలపై మీ అభిప్రాయం? మన దేశ జనాభా, సమాజాభివృద్ధికి సరిపోయే స్థాయిలో పరిశోధకులు లేరు. పరిశోధకులు, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇటీవల కాలంలో పెరుగుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని విభాగాల్లో అవి మరింత పెరగాల్సి ఉంది. ఈ క్రమంలో సమాజాన్ని, పరిశ్రమలపై ప్రభావం చూపే విధంగా అనుసంధానం చేయడం, భారతీయ లేబొరేటరీల్లో పరిశ్రమ పెట్టుబడులు పెంచడం, రీసెర్చ్‌ను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకునే విధంగా భారీ సంఖ్యలో యువ విద్యార్థులను ఆకర్షించుకునే చర్యలు తీసుకోవడం వంటివి చేపట్టాలి. జాతీయస్థాయి ఇన్స్టిట్యూట్లలోనే రీసెర్చ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. కానీ రాష్ట్రస్థాయి యూనివర్సిటీల్లో ఈ పరిస్థితి కనిపించట్లేదు. దీనికి కారణం? రీసెర్చ్‌లో కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలే కాకుండా.. సానుకూల దృక్పథంతో కూడిన మద్దతు ఎంతో అవసరం. ఇన్స్టిట్యూట్లు వాటంతటవే స్వీయ పరిశోధనలు సాగించే విధంగా చర్యలు చేపట్టాలి. పరిశ్రమ బృందాలతో అనుసంధానం కావాలి. యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ నివేదిక పేర్కొన్నట్లు 2015- 2050 మధ్య కాలాన్ని డెమోగ్రాఫిక్ ఆపర్చునిటీ విండోగా వినియోగించుకోవాలంటే? భారతీయులందరికీ సాధికారికత కల్పించే విధంగా వీలైనంత త్వరగా నూతన విద్యా విధానానికి రూపకల్పన చేయాలి. ప్రస్తుతం మనం ఎ-3 విధానంలో ఉన్నాం. కాబట్టి ఇది సులభమే. అదే విధంగా దేశంలోని అభివృద్ధి కార్యకలాపాలను విద్యా విధానంతో అనుసంధానం చేయాలి. స్కిల్స్, ప్రొసీజరల్, ట్రెడిషనల్ నాలెడ్జ్ ముఖ్య భూమిక పోషించే విధంగా విద్యను బలోపేతం చేయాలి. బోధన, నిర్వహణ పరంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రాధాన్యాన్ని బాగా పెంచాలి. నూట ఇరవై కోట్ల జనాభా ఉన్న దేశంలో కింది స్థాయి నుంచి విద్యాభివృద్ధికి మీరిచ్చే సూచన? సాంకేతికత, ఐటీ వనరుల నేపథ్యంలో కంటెంట్ డెవలప్మెంట్, నిర్వహణ విషయంలో ఐసీటీ అమలుతో అన్ని వర్గాల వారికి విద్యను సులభంగా అందుబాటులోకి తేవొచ్చు. అంతేకాకుండా ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో.. ఇప్పటికీ మనం అనుసరిస్తున్న మెకాలే తరం నాటి పురాతన ప్రతిబంధకాలు, బ్యూరోక్రసీ, రాజకీయ బంధనాల నుంచి విముక్తి కల్పిస్తే విద్యా రంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు. నేటి తరం విద్యార్థులకు మీరిచ్చే సలహా? ఇంటర్నెట్ యుగం, టెక్నాలజీ విప్లవం రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు కేవలం పుస్తకాలు, ప్రయోగశాలలకే పరిమితం కాకుండా.. ప్రాపంచిక జ్ఞానాన్ని సముపార్జించేలా ముందడుగు వేయాలి. -
రేపు జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవం
=న్యూక్లియర్ సైంటిస్ట్ అనిల్ కకోద్కర్‌కు గౌరవ డాక్టరేట్ =ప్రెస్మీట్లో వీసీ రామేశ్వరరావు వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ నాలుగో స్నాతకోత్సవం శ నివారం నిర్వహించనున్నారు. స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ అణ్వస్త్ర శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ అనిల్ కకోద్కర్ను యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు వర్సిటీ వీసీ డాక్టర్ రామేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అధ్యక్షతన జరగనున్న స్నాతకోత్సవంలో యూనివర్సిటీ (2008-12 బ్యాచ్)లో వివిధ కోర్సులు పూర్తి చేసిన 1,12,737 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు, 197 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు పీహెచ్డీ డిగ్రీలను, 53 మందికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పనతో పాటు, సమాజ అభ్యున్నతి లక్ష్యంగా జేఎన్టీయూహెచ్ ముందుకు వెళ్తోందన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు సరికొత్త సాంకేతిక విద్యను అందించేందుకు ప్రఖ్యాత విద్యా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని, అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామన్నారు. రిజిస్ట్రార్ రమణరావు, రెక్టార్ సాయిబాబారెడ్డి, డెరైక్టర్లుజీకే విశ్వనాథ్, ఈశ్వర్ప్రసాద్, విజయకుమారి, ఆర్యశ్రీ, రామకృష్ణప్రసాద్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నలకు తత్తరపాటు.. సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వీసీతో సహా పలువురు డెరైక్టర్లు తత్తరపాటుకు గురయ్యారు. ప్రొఫెసర్లైనా కొన్ని అంశాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం చిత్రంగా ఉంది. వర్సిటీ పాలక మండలి సమావేశ ంలో తీసుకున్న నిర్ణయాల (మినిట్స్)ను ఎందుకు బహిర్గతం చేయరని ప్రశ్నించగా, ఈసీ మినిట్స్ అత్యంత రహస్యమైన విషయాలని వీపీ చెప్పడం విడ్డూరం. అవును కాన్ఫిడెన్సియల్ అంటూ.. అధికారులు కూడా వంతపాడడం మరీ విచిత్రం. స్నాతకోత్సవం నిర్వహణలో జాప్యానికి కారణాలేమని అడగ్గా.. చెప్పేందుకు వీలుకాదని వీసీ పేర్కొన్నారు. సెమిస్టర్ పరీక్షల్లో జంబ్లింగ్ వలన ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడగ్గా, ఫిర్యాదులు వస్తేనే పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం. ఫిల్మ్ మేనేజ్మెంట్, బ్యూటిషియన్ కోర్సులకు సంబంధించి వర్సిటీలో ఎటువంటి మెకానిజమ్ లేకున్నా.. అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, అనూస్ బ్యూటీ క్లినిక్స్.. తదితర సంస్థలతో ఏంవోయూలు ఎలా కుదుర్చుకున్నారని ప్రశ్నించగా, పాలకమండలి అనుమతితోనే ఏంవోయూలు కుదర్చుకున్నామంటూ అసలు సమాధానం చెప్పకుండా దాటేశారు.