ఐసీటీ వినియోగంతో అద్భుత ఫలితాలు | Outstanding results in the use of ICT | Sakshi
Sakshi News home page

ఐసీటీ వినియోగంతో అద్భుత ఫలితాలు

Published Sun, Jul 6 2014 11:45 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఐసీటీ వినియోగంతో అద్భుత ఫలితాలు - Sakshi

ఐసీటీ వినియోగంతో అద్భుత ఫలితాలు

 గెస్ట్ కాలమ్
 
అనిల్ కకోద్కర్.. ప్రపంచ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త. భారత అణుశక్తి సంఘం చైర్మన్‌గా పనిచేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. తొలుత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో రియాక్టర్ ఇంజనీరింగ్ విభాగంలో చిరుద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. భారత్ పరీక్షించిన రెండు అణ్వస్త్ర ప్రయోగ పరీక్షల్లో పాల్పంచుకున్నారు. మరోవైపు విద్యారంగంలోనూ కకోద్కర్ తన విశిష్ట సేవలను అందిస్తున్నారు. ఐఐటీ వంటి సంస్థల్లో చేపట్టాల్సిన సంస్కరణల కమిటీకి నేతృత్వం వహించి.. ఐఐటీల పురోభివృద్ధికి ఎన్నో సిఫార్సులు చేశారు. మన దేశంలో విద్యా విధానం అద్భుత ఫలితాలు సాధించాలంటే.. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని వినియోగించుకోవాలి, బోధన పద్ధతుల్లో కూడా మార్పులు రావాలి అంటున్న పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అనిల్ కకోద్కర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
బరవాని గ్రామం నుంచి బార్క్ డెరైక్టర్ వరకు మీ ప్రస్థానం గురించి చెప్పండి?

మధ్యప్రదేశ్‌లోని బరవాని నా స్వగ్రామం. ఖర్గోనేలో పాఠశాల విద్య పూర్తి చేశాను. కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ముంబై రావడం నా జీవిత గమ్యాన్నే మార్చింది. వాస్తవానికి  ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక  ఫిజిక్స్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకున్నా. అయితే, అప్పట్లో యూనివర్సిటీలో స్టూడెంట్ పాలిటిక్స్ కారణంగా ఫిజిక్స్‌లో నాణ్యమైన బోధనను ఆశించలేమని కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ చెప్పారు. దాంతో మెకానికల్  ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో అడుగుపెట్టాను. ఇందులో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే.. రొటీన్‌కు భిన్నమైన అవకాశాల కోసం అన్వేషణ కొనసాగించా. ఆ  సమయంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్‌‌క)లో ఉద్యోగం లభించింది. ఇది నా కెరీర్ పరంగా అత్యంత కీలకమైన మలుపు. నేనేంటో నిరూపించుకునే విధంగా బార్క్‌లో అవకాశాలు లభించాయి. ఆ క్రమంలో అణుశక్తిని అభివృద్ధి చేసే విషయంలో ఎన్నో ఎసైన్‌మెంట్స్ చేయగలిగాను. ఇప్పటికీ.. కొత్తగా ఆలోచించే వారికి బార్క్‌లో అవకాశాలకు ఆకాశమే హద్దు.
 
 మీ కెరీర్‌లో చిరస్మరణీయమైన విజయం?


 ఎవరి కెరీర్‌లోనైనా ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తొలి అసైన్‌మెంట్ చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఫ్లేమ్ స్ప్రేయింగ్ ఉపయోగిస్తూ లోహ పదార్థంపై అల్యూమినియం కోటింగ్ విధానాన్ని వృద్ధి చేయడం నా తొలి అసైన్‌మెంట్. పూర్తిగా ఎవరి ప్రమేయం లేకుండా దీన్ని స్వయంగా వృద్ధి చేశాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేది. ఆ తర్వాత ధ్రువ రియాక్టర్ ఆవిష్కరణలో పాల్పంచుకున్నాను. మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్‌లో రియాక్టర్ల రిహాబిలిటేషన్.. 1974, 1998లలో పోఖ్రాన్ అణు పరీక్షల్లో భాగస్వామిని కావడం వంటివి మరికొన్ని చిరస్మరణీయ మైలురాళ్లు.
 
 విద్యారంగానికి సంబంధించి.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌గా.. ప్రస్తుత ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యా విధానంపై మీ అభిప్రాయం?

 ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులను కేవలం లేబొరేటరీలు, క్లాస్ రూంలకే పరిమితం చేయడం సరికాదు. రీసెర్చ్‌పై అవగాహన కల్పించాలి. సాంకేతిక ఉత్పత్తులు/ప్రక్రియలపై సంబంధిత నైపుణ్యాలు అలవర్చాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి వివరించాలి.  క్షేత్రస్థాయి పద్ధతుల ద్వారా ఆహ్లాదకరమైన అభ్యసన విధానాన్ని అందుబాటులోకి తేవాలి. క్లాస్ రూం వాతావరణం కూడా రియల్‌లైఫ్ వర్క్ కల్చర్‌కు దగ్గరగా ఉండేలా చూడాలి. దీనివల్ల విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన లభిస్తుంది.
 
 ఐఐటీలు ప్రతి ఏటా 10 వేల పీహెచ్‌డీలు ప్రదానం చేసే విధంగా చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు. ఇది ఆచరణ సాధ్యమేనా?

 నేను ఇలా సిఫార్సు చేయడానికి బలమైన కారణం ఉంది. దేశ జీడీపీ వృద్ధికి, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీల్లో పరిశోధనలకు మధ్య గట్టి సంబంధం ఉంది. మన దేశ భౌగోళిక స్వరూపం, ప్రపంచస్థాయిలో పోటీ, అభివృద్ధి దిశగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారీ సంఖ్యలో పీహెచ్‌డీల అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐఐటీ సంస్కరణల కమిటీ చైర్మన్‌గా.. పది వేల పీహెచ్‌డీలు అనే అంశాన్ని సిఫార్సు చేశాను. ప్రస్తుతం ఐఐటీల నుంచి మూడు వేల మంది ఏటా పీహెచ్‌డీలు అందుకుంటున్నారు. త్వరలోనే ఐఐటీలు పదివేల పీహెచ్‌డీల మైలు రాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నాను. ఈ విషయంలో టెక్నాలజీపై ఆధారపడి కార్యకలాపాలు సాగించే పారిశ్రామిక, ఆర్థిక విభాగాలు తమ భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించాలి.
 
ఐఐటీ సంస్కరణల కమిటీ చైర్మన్‌గా ఎన్నో సిఫార్సులు చేసినా.. ఆర్థిక స్వయం ప్రతిపత్తికి సంబంధించిన సిఫార్సును ఐఐటీ గవర్నింగ్ కౌన్సిల్ వ్యతిరేకించడంపై మీ అభిప్రాయం?


మా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఎన్నో ఇప్పటికే అమలవుతున్నాయి. ఆర్థికపరమైన కోణంలో విశ్లేషిస్తే.. ప్రభుత్వం నిరంతరం విద్యకు కేటాయింపులు పెంచుతోంది. అందరికీ నాణ్యమైన విద్య లభించాలి. ప్రపంచ స్థాయీ ప్రమాణాలు కూడా అందుకోవాలి. ఇలా జరగాలంటే బడ్జెట్‌లో విద్యకు కేటాయించే నిధులను భారీ స్థాయిలో పెంచాలి.  నిర్దేశిత ఫీజులు చెల్లించగలిగేవారు, రుణ సదుపాయం లభించేవారికీ ఫీజు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదనేది మా ఉద్దేశం. కెరీర్ అవకాశాలు, ఉపాధి కచ్చితంగా లభించే ఐఐటీల మాదిరిగానే ఇతర ఇన్‌స్టిట్యూట్‌లను అభివృద్ధి చేయాలి. ఈ దిశగా బడ్జెట్ కేటాయింపులు పెంచాలని సూచన చేశాం. స్థూలంగా ఐఐటీ సంస్కరణల కమిటీ ఉద్దేశం.. మానవ వనరుల అభివృద్ధితోపాటు పరిశ్రమలకు, సమాజాభివృద్ధికి దోహదం చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయడం.
 
ఉన్నత విద్యాభివృద్ధికి దూర విద్య విధానం దోహదం చేస్తుందని మీరు అన్నారు. దూరవిద్య ద్వారా నాణ్యతను ఆశించగలమా?

 మనం ఎ-3(ఎనీ వన్, ఎనీ వేర్, ఎనీ టైమ్) అనుసంధాన, లైఫ్‌లాంగ్ లెర్నింగ్ అవకాశం గల విజ్ఞానాధారిత సమాజంలో ఉన్నాం. ఉన్నత విద్యలో ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీల మధ్య క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదే సమయంలో అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దూరవిద్యా విధానం ద్వారా మరింత మందికి ఉన్నత విద్యను అందుబాటులోకి తేవచ్చు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారంగా.. సమీకృత కృషితో దూర విద్యలోనూ నాణ్యతను పెంపొందించొచ్చు.
 
 దేశంలో ప్రస్తుత పరిశోధనలపై మీ అభిప్రాయం?

 మన దేశ జనాభా, సమాజాభివృద్ధికి సరిపోయే స్థాయిలో పరిశోధకులు లేరు. పరిశోధకులు, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇటీవల కాలంలో పెరుగుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని విభాగాల్లో అవి మరింత పెరగాల్సి ఉంది. ఈ క్రమంలో సమాజాన్ని, పరిశ్రమలపై ప్రభావం చూపే విధంగా అనుసంధానం చేయడం, భారతీయ లేబొరేటరీల్లో పరిశ్రమ పెట్టుబడులు పెంచడం, రీసెర్చ్‌ను కెరీర్ ఆప్షన్‌గా ఎంచుకునే విధంగా భారీ సంఖ్యలో యువ విద్యార్థులను ఆకర్షించుకునే చర్యలు తీసుకోవడం వంటివి చేపట్టాలి.
 
 జాతీయస్థాయి ఇన్‌స్టిట్యూట్‌లలోనే రీసెర్చ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. కానీ రాష్ట్రస్థాయి యూనివర్సిటీల్లో ఈ పరిస్థితి కనిపించట్లేదు. దీనికి కారణం?

 రీసెర్చ్‌లో కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలే కాకుండా.. సానుకూల దృక్పథంతో కూడిన మద్దతు ఎంతో అవసరం. ఇన్‌స్టిట్యూట్‌లు వాటంతటవే స్వీయ పరిశోధనలు సాగించే విధంగా చర్యలు చేపట్టాలి. పరిశ్రమ బృందాలతో అనుసంధానం కావాలి.
 
 యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ నివేదిక పేర్కొన్నట్లు 2015- 2050 మధ్య కాలాన్ని డెమోగ్రాఫిక్ ఆపర్చునిటీ విండోగా వినియోగించుకోవాలంటే?

 భారతీయులందరికీ సాధికారికత కల్పించే విధంగా వీలైనంత త్వరగా నూతన విద్యా విధానానికి రూపకల్పన చేయాలి. ప్రస్తుతం మనం ఎ-3 విధానంలో ఉన్నాం. కాబట్టి ఇది సులభమే. అదే విధంగా దేశంలోని అభివృద్ధి కార్యకలాపాలను విద్యా విధానంతో అనుసంధానం చేయాలి. స్కిల్స్, ప్రొసీజరల్, ట్రెడిషనల్ నాలెడ్జ్ ముఖ్య భూమిక పోషించే విధంగా విద్యను బలోపేతం చేయాలి. బోధన, నిర్వహణ పరంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రాధాన్యాన్ని బాగా పెంచాలి.
 
 నూట ఇరవై కోట్ల జనాభా ఉన్న దేశంలో కింది స్థాయి నుంచి విద్యాభివృద్ధికి మీరిచ్చే సూచన?

 సాంకేతికత, ఐటీ వనరుల నేపథ్యంలో కంటెంట్ డెవలప్‌మెంట్, నిర్వహణ విషయంలో ఐసీటీ అమలుతో అన్ని వర్గాల వారికి విద్యను సులభంగా అందుబాటులోకి తేవొచ్చు. అంతేకాకుండా ప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో.. ఇప్పటికీ మనం అనుసరిస్తున్న మెకాలే తరం నాటి పురాతన ప్రతిబంధకాలు, బ్యూరోక్రసీ, రాజకీయ బంధనాల నుంచి విముక్తి కల్పిస్తే విద్యా రంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు.
 
 నేటి తరం విద్యార్థులకు మీరిచ్చే సలహా?

 ఇంటర్నెట్ యుగం, టెక్నాలజీ విప్లవం రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు కేవలం పుస్తకాలు, ప్రయోగశాలలకే పరిమితం కాకుండా.. ప్రాపంచిక జ్ఞానాన్ని సముపార్జించేలా ముందడుగు వేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement