నల్లగొండకు చెందిన ఓ ఎస్టీ విద్యార్థికి 2016లో ఐఐటీ గాంధీనగర్‌లో సీటొచ్చింది. రాష్ట్రం నుంచి స్కాలర్ షిప్ వస్తుందని చెప్పడంతో అందులో చేరాడు. ఏడాది గడిచింది.. రాష్ట్రం నుంచి ఎలాంటి స్కాలర్‌షిప్ రాలేదు. ఇక 2017లో అతడి తమ్మునికి ట్రిపుల్‌ఐటీ భువనేశ్వర్‌లో సీటొచ్చింది. అతడిదీ అదే పరిస్థితి.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఆర్థిక సాయం చేస్తామన్నారు. కానీ అది అందకపోవడంతో ఉన్న మూడెకరాల భూమిని అమ్ముకొని చదువుకోవాల్సి వస్తోంది.
వరంగల్‌కు చెందిన మరో విద్యార్థికి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2017లో సీటొచ్చింది. ఉన్న భూమని తాకట్టు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ కోసం వరంగల్‌లోని ఓ బ్యాంకును సంప్రదించారు. పట్టణంలో సొంత ఇళ్లు ఉంటే తనఖా పెట్టాలని చెప్పారు. వరంగల్‌లో ఇల్లు లేదు.. ఊర్లో భూమి ఉంది తనఖా పెడతామంటే బ్యాంకు అధికారులు ఒప్పుకోలేదు. వ్యవసాయ భూములపై విద్యా రుణం ఇస్తే.. చెల్లించకపోతే కష్టమని ఏ బ్యాంకూ ఇవ్వట్లేదని తెగేసి చెప్పారు. దీంతో రెండెకరాలు అమ్ముకొని ఆ విద్యార్థి చదువుకుంటున్నాడు.
– సాక్షి, హైదరాబాద్
వడ్డెల ఆశ్రిత్ 17వ ర్యాంకు.. అంబటి సాత్విక్ 27వ ర్యాంకు.. ఎల్.గోవింద శివ నాగదేవ్ 28వ ర్యాంకు.. రోహన్ గణేశ్ 34వ ర్యాంకు.. పి.పవన్‌చైతన్య 41వ ర్యాంకు.. వీరంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన 2017 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాపర్లు.. అంతా ఐఐటీల్లో చేరారు. కానీ వారికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. వారే ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తోంది.. ఎంసెట్ రాసి రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో చేరే టాప్ 10 వేల ర్యాంకర్లకు ప్రభుత్వమే మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తోంది. జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకులతో రాష్ట్రం పేరును నిలబెడుతున్న వేల మంది విద్యార్థులకు రాష్ట్రం నుంచి ప్రోత్సాహం కరువైంది. ఫలితంగా జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చేరుతున్న అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని కాలేజీల్లో చేరిన వారికిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో చేరుతున్న వారికీ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఏటా 9 వేల మంది..
ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థలైన ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, తదితర సాంకేతిక విద్యా సంస్థల్లో ఏటా 6 వేల మందికిపైగా ప్రతిభావంతులనైన తెలంగాణ విద్యార్థులు చేరుతున్నారు. వారంతా టాప్ 2 వేల లోపు ర్యాంకులు సాధించినవారే. ఇక టాప్ 5 వేల ర్యాంకు వరకు చూస్తే మరో 3 వేల మంది వరకు విద్యార్థులు ఉంటారు. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా వారంతా ఆయా విద్యా సంస్థల్లో చేరుతున్నారు. వారెవరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కానీ, స్కాలర్‌షిప్ కానీ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2016లో 10,383 మంది..
ఇతర రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదువు కోసం 2017 విద్యా సంవత్సరంలో 8,551 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్లను తీసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. 2016 విద్యా సంవత్సరంలో 10,383 మంది విద్యార్థులు మైగ్రేషన్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. వారంతా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ తదితర విద్యా సంస్థల్లో చేరేందుకు వెళ్లిపోయారు. అలాంటి వారికి ప్రభుత్వం చేయూతనిస్తే బాగా చదువుకునే అవకాశముంటుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
బాలికలకైనా ఇస్తే..
రాష్ట్రంలో బాలికా విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ విషయంపై దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు బాలికలకైనా రాష్ట్రం నుంచి ప్రత్యేక స్కాలర్‌షిప్ విధానం కానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కానీ వర్తింపజేయాలని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment