![Package details of students IIT jobs are secret: andhra pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/IIT.jpg.webp?itok=Zkutv-Jb)
ఉద్యోగాలు పొందిన విద్యార్థులు, ప్యాకేజీల వివరాలు గోప్యం
ఈ మేరకు ఐఐటీల ప్లేస్‌మెంట్స్ కమిటీ ప్రాథమిక నిర్ణయం
విద్యార్థులు ఒకరితో ఒకరు పోల్చుకోకుండా ఉండటానికి..
తద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడానికే అంటున్న ఐఐటీలు
మద్దతు తెలుపుతున్న ప్రొఫెసర్లు, విద్యార్థులు
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)(IIT)లు. ఇంజనీరింగ్ విద్య అనగానే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మొదట గుర్తుకొచ్చేవి ఇవే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించి ఐఐటీలో సీటు సాధిస్తే జాక్‌పాట్ కొట్టినట్టేనని విద్యార్థులు భావిస్తారు. బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగాలు పొందాలన్నా, అత్యుత్తమ వార్షిక వేతన ప్యాకేజీలు దక్కాలన్నా అది ఐఐటీలతో మాత్రమే సాధ్యమనే అభిప్రాయం సర్వత్రా ఉంది.
ఈ నేపథ్యంలో ఏటా జరిగే ఆయా ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్(Placements)పై అంతా ఆసక్తి కనబరుస్తుంటారు. కేవలం ఇంజనీరింగ్ ఔత్సాహికులే కాకుండా మిగతా వారు కూడా ఏ స్థాయిలో ఐఐటీల విద్యార్థులు వేతన ప్యాకేజీలు దక్కించుకున్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈసారి ఎక్కువ ఐఐటీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ విషయంలో గోప్యత పాటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు వెల్లడించింది కొన్ని ఐఐటీలే ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి గతేడాది డిసెంబర్ 1నే ఆయా ఐఐటీల్లో ఆన్ క్యాంపస్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే విద్యార్థులకు ఏ స్థాయిలో వేతన ప్యాకేజీలు లభించాయో ఇప్పటివరకు కొన్ని ఐఐటీలు మాత్రమే బయటకు సమాచారాన్ని వెల్లడించాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూరీ్క, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ–బీహెచ్‌యూ ఈ కోవలో ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఐఐటీలన్నీ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి.
కారణాలు ఇవేనా?
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి బయటకు సమాచారాన్ని వెల్లడించకపోవడానికి కారణం ఉందని ఐఐటీల ప్రొఫెసర్లు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, వారి సంక్షేమం కోసమే తాము ప్లేస్‌మెంట్స్ సమాచారాన్ని వెల్లడించడం లేదని అంటున్నారు. వేతన ప్యాకేజీల గురించి ఒకరితో మరొకరు పోల్చుకోవడం వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం çపడుతోందని.. అందుకే ఇలా చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన అన్న ఐఐటీల ప్లేస్‌మెంట్స్ కమిటీ (ఏఐపీసీ) సమావేశంలో ఉద్యోగ నియామక వివరాలు, వేతన ప్యాకేజీల వివరాలు వెల్లడించవద్దని ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాయి.
వారం లేదా పక్షం రోజులకోసారి..
సాధారణంగా దేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో రెండు దశల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఉంటాయి. డిసెంబర్‌లో మొదటి దశ, జనవరి – జూన్ మధ్య రెండో దశ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు సాధించినవారి సమాచారాన్ని రోజువారీ కాకుండా వారానికోసారి లేదా 15 రోజులకోసారి విడుదల చేయాలని ఐఐటీల ప్లేస్‌మెంట్స్ కమిటీల సమావేశంలో ఆయా సంస్థలు ప్రతిపాదించాయి. ప్లేస్‌మెంట్స్ గురించి మీడియాలో వచ్చే వార్తలు విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా, వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూడాలన్నదే తమ ఏఐపీసీ కన్వీనర్ ప్రొఫెసర్ కౌశిక్ పాల్ తెలిపారు.
కొత్త ఐఐటీల ప్లేస్‌మెంట్స్ నివేదికలు అప్పుడే..
చాలా ఐఐటీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సమయంలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన కంపెనీల పేర్లు, అత్యధిక, మధ్యస్థ ప్యాకేజీలు, ఆఫర్‌ను పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య, వాటిలో అంతర్జాతీయ ఆఫర్‌ల సంఖ్య వంటివాటి గురించి రోజూ సమాచారమిచ్చేవి. అయితే ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ధార్వాడ్, మరికొన్ని కొత్త ఐఐటీలు 2024–25 సెషన్‌లో ప్లేస్‌మెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో ఒకేసారి తుది ప్లేస్‌మెంట్ నివేదికను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి.
ఐఐటీల నిర్ణయానికి మద్దతు
విద్యార్థుల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీల వివరాలను బహిర్గతం చేయకూడదనే నిర్ణయానికి పలువురు ఐఐటీ ప్రొఫెసర్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ప్లేస్‌మెంట్లు, మంచి ప్యాకేజీలు పొందిన విద్యార్థుల వివరాలను బహిరంగంగా వెల్లడిస్తే ఇవి.. ప్లేస్‌మెంట్ దక్కనివారు, మంచి పే ప్యాకేజీలు పొందనివారిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఐఐటీ ధన్‌బాద్‌లో కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ సౌమ్యా సింగ్ అన్నారు.
విద్యార్థులు ఏమంటున్నారంటే..
మొదటి ప్రయత్నంలో మంచి ప్లేస్‌మెంట్ దక్కకపోతే నిరుత్సాహం చెందాల్సిన అవసరంలేదని ఐఐటీ మద్రాస్‌లో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి రిత్విక్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐఐటీయన్లపై మీడియా నివేదికలు ఒత్తిడి పెంచలేవన్నాడు. ఆందోళన చెందకుండా ఇతర పరీక్షలు, ఇంటర్వ్యూలపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.
ప్రొఫెసర్లు, విద్యార్థుల మద్దతు..
ఏది ఏమైనప్పటికీ విద్యార్థుల ప్లేస్‌మెంట్లు, ప్యాకేజీల గురించి ఏ ఐఐటీ మీడియాకు వెల్లడించకూడదని ఏఐపీసీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఐఐటీల ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయానికి ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా మద్దతు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఐఐటీల నిర్ణయం ఆందోళన తగ్గిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్లేస్‌మెంట్లు, ప్యాకేజీల వివరాలు మీడియాలో రాకపోవడం మంచిదని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఒకరు అభిప్రాయపడ్డారు.
లేదంటే తమ ఇంటి ఇరుగుపొరుగువారు తన గురించి తన తల్లిదండ్రులను ఆరా తీస్తారని.. ఇది వారిపై అనవసర ఆందోళన పెంచుతుందన్నారు. అంతేకాకుండా ఇతర విద్యార్థులతో తనను పోల్చుతారని.. ఇది కూడా తన తల్లిదండ్రులను ఒత్తిడిలోకి నెడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్లేస్‌మెంట్లు, ప్యాకేజీ వివరాలను బహిరంగంగా వెల్లడించవద్దని ఐఐటీలు మంచి నిర్ణయమే తీసుకున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment