=న్యూక్లియర్ సైంటిస్ట్ అనిల్ కకోద్కర్‌కు గౌరవ డాక్టరేట్
=ప్రెస్‌మీట్‌లో వీసీ రామేశ్వరరావు వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ నాలుగో స్నాతకోత్సవం శ నివారం నిర్వహించనున్నారు. స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ అణ్వస్త్ర శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ అనిల్ కకోద్కర్‌ను యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు వర్సిటీ వీసీ డాక్టర్ రామేశ్వరరావు తెలిపారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అధ్యక్షతన జరగనున్న స్నాతకోత్సవంలో యూనివర్సిటీ (2008-12 బ్యాచ్)లో వివిధ కోర్సులు పూర్తి చేసిన 1,12,737 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు, 197 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు పీహెచ్‌డీ డిగ్రీలను, 53 మందికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పనతో పాటు, సమాజ అభ్యున్నతి లక్ష్యంగా జేఎన్టీయూహెచ్ ముందుకు వెళ్తోందన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు సరికొత్త సాంకేతిక విద్యను అందించేందుకు ప్రఖ్యాత విద్యా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని, అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామన్నారు. రిజిస్ట్రార్ రమణరావు, రెక్టార్ సాయిబాబారెడ్డి, డెరైక్టర్లుజీకే విశ్వనాథ్, ఈశ్వర్‌ప్రసాద్, విజయకుమారి, ఆర్యశ్రీ, రామకృష్ణప్రసాద్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నలకు తత్తరపాటు..
సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వీసీతో సహా పలువురు డెరైక్టర్లు తత్తరపాటుకు గురయ్యారు. ప్రొఫెసర్లైనా కొన్ని అంశాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం చిత్రంగా ఉంది.
వర్సిటీ పాలక మండలి సమావేశ ంలో తీసుకున్న నిర్ణయాల (మినిట్స్)ను ఎందుకు బహిర్గతం చేయరని ప్రశ్నించగా, ఈసీ మినిట్స్ అత్యంత రహస్యమైన విషయాలని వీపీ చెప్పడం విడ్డూరం. అవును కాన్ఫిడెన్సియల్ అంటూ.. అధికారులు కూడా వంతపాడడం మరీ విచిత్రం.
స్నాతకోత్సవం నిర్వహణలో జాప్యానికి కారణాలేమని అడగ్గా.. చెప్పేందుకు వీలుకాదని వీసీ పేర్కొన్నారు.
సెమిస్టర్ పరీక్షల్లో జంబ్లింగ్ వలన ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడగ్గా, ఫిర్యాదులు వస్తేనే పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం.
ఫిల్మ్ మేనేజ్‌మెంట్, బ్యూటిషియన్ కోర్సులకు సంబంధించి వర్సిటీలో ఎటువంటి మెకానిజమ్ లేకున్నా.. అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, అనూస్ బ్యూటీ క్లినిక్స్.. తదితర సంస్థలతో ఏంవోయూలు ఎలా కుదుర్చుకున్నారని ప్రశ్నించగా, పాలకమండలి అనుమతితోనే ఏంవోయూలు కుదర్చుకున్నామంటూ అసలు సమాధానం చెప్పకుండా దాటేశారు.