
మేఘాలయ హోటల్‌లో ఎన్‌ఆర్‌ఐ మహిళ అనుమానాస్పద మృతి
ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై అనేక అనుమానాలు
ఆ గదిలో ఉన్న ఆమె మిత్రుడిని కాపాడే ప్రయత్నం?
కేసు మాఫీకి భారీగా ఒప్పందం జరిగినట్లు ఆరోపణలు
విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్ కథా చిత్రం.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒక ఎన్‌ఆర్‌ఐ మహిళ, ఒక వైద్యుడు మధ్య ఏం జరిగిందన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. విశాఖకు చెందిన ఒక వైద్యుడు రెండు వారాలకు పైగా హోటల్‌లోనే ఎందుకు బస చేశాడు? అమెరికా పౌరసత్వం కలిగిన మహిళ విశాఖకు ఎందుకు వచ్చింది? ఆమె ఆ వైద్యుడు ఉన్న రూమ్ నెంబర్ 229లో ఎందుకు ఉంది? వారి మధ్య గొడవ జరగడానికి గల కారణమేంటి? కొద్ది నిమిషాల్లోనే ఆమె బాత్‌రూమ్‌లో నగ్నంగా విగతజీవిగా ఎలా మారింది?
పోలీసులకు ఎవరు సమాచారమిచ్చారు? కిటికీ గానీ, హుక్‌గానీ లేని బాత్‌రూమ్‌లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఆ సమయంలో వైద్యుడు అక్కడే ఉన్నాడా? రెండు రోజుల పాటు ఈ ఘటన బయటకు రాకుండా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎఫ్‌ఐఆర్‌లో వైద్యుడి పేరును చేర్చారా? లేదా? అతడి సెల్‌ఫోన్‌లో ఎవరి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి? హోటల్ గదిలో పోలీసులు ఎటువంటి సామగ్రి గుర్తించారు? ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ కేసు సమాచారం ఇవ్వకపోవడం వెనుక మర్మమేంటి?
ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక ఊహకందని ప్రశ్నలు థ్రిల్లర్ సినిమాకు మించి సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తున్నాయి. అయితే విశాఖ పోలీసులు మాత్రం ఆ ప్రశ్నలన్నింటినీ పక్కనపెట్టి.. సింపుల్‌గా అనుమానాస్పద మృతి అని తేల్చేశారు. ఈ కేసు విషయంలో పోలీసుల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. అదే రోజు సాయంత్రం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కూడా శనివారం వరకు బయటకు రాకుండా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందుకోసం రూ.కోటి వరకు ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పోలీసుల తీరే ఈ ఆరోపణలు చెలరేగడానికి తావిస్తోంది.
వైద్యుడు ఫ్యామిలీ ఫ్రెండ్?
విశాఖకు చెందిన వైద్యుడు పిల్లా శ్రీధర్ రెండు వారాలకు పైగా హోటల్ మేఘాలయలో బస చేస్తున్నారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన కాకర్లపూడి రోజా ప్రస్తుతం వివాహం చేసుకొని యూఎస్‌లో స్థిరపడ్డారు. రోజా కుటుంబానికి శ్రీధర్ ఫ్యామిలీ ఫ్రెండ్‌గా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం రోజా విశాఖకు వచ్చి శ్రీధర్ ఉన్న గదిలోనే ఉంటోంది. అయితే గత గురువారం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కొద్ది నిమిషాల్లోనే ఆమె బూత్‌రూమ్‌లో అనుమానాస్పదంగా మృతి చెందింది.
పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరు?
ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న విషయం సస్పెన్స్‌గా మారింది. అయితే మహిళ బాత్‌రూమ్‌లో ఉరి వేసుకొని చనిపోయిందని హోటల్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రూమ్‌లో శ్రీధర్ మాత్రమే ఉంటే.. హోటల్ మేనేజర్‌కు ఆమె చనిపోయిందన్న విషయం ఎలా తెలిసింది? ఆత్మహత్య చేసుకోవాలనుకునే రోజా ఎందుకు నగ్నంగా ఉంది. ఫ్యాన్ హుక్, కిటీకీ గానీ లేని బాత్‌రూమ్‌లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. పోలీసులు వచ్చిన సమయంలో శ్రీధర్ రూమ్‌లోనే ఉన్నారా? పోలీసులు అతడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారా? లేదా అన్న విషయం తేలాల్సి ఉంది.
ఎందుకంత గోప్యం..
గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే అదే రోజు సాయంత్రం 5.30కి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి విషయం బయటకు పొక్కడంతో మీడియా త్రీటౌన్ సీఐ రమణయ్యను సంప్రదించారు. అసలు అటువంటి ఘటనే జరగలేదని, తప్పుడు సమాచారమని చెప్పి తప్పించుకున్నారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించకపోవడం గమనార్హం.
చదవండి: భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..
కేసు మాఫీకి ప్రయత్నాలు?
ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్‌ఆర్‌ఐ మహిళది హత్యా? ఆత్మహత్య? అన్నది తేలాల్సి ఉంది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వార్తలకు పోలీసుల వ్యవహార శైలే బలాన్ని చేకూరిస్తున్నాయి. ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఒక ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శనివారం మహిళ మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదిక ఆధారంగా కేసులో చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment