Jawaharlal Nehru Technological University
-
జేఎన్టీయూకే ప్లాటినం జూబ్లీ; రారండోయ్.. వేడుక చేద్దాం..
రెండేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైన జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 15, 16 తేదీల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల 1946లో ఉమ్మడి మద్రాస్‌లో ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక 1972 జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ ఏర్పడ్డాక కాకినాడ, అనంతపురం, హైదరాబాద్ ఈ మూడు ఇంజినీరింగ్ కళాశాలలు హైదరాబాద్ యూనివర్సిటీ అధీనంలో ఉండేవి. తరువాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆగస్టు 2008లో జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దాని అధీనంలోకి జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని కళాశాలను తీసుకువచ్చారు. కళాశాల ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహణకు సిద్ధం కాగా.. 2020 జూలై 16న ఉన్నత విద్యామండలి చైర్మన్ కే.హేమచంద్రారెడ్డి, మెట్రో రైల్ మాజీ ఎండీ ఈ.శ్రీధర్, వర్చువల్ విధానంలో వీటిని ప్రారంభించారు. అప్పటి వీసీ రామలింగరాజు, ప్రిన్సిపాల్ బాలకృష్ణ కళాశాల ఆవరణలో ప్రారంభించారు. రెండేళ్ల పాటు విద్యార్థులకు అకడమిక్ వర్క్ షాపులు, ప్రముఖులతో సెమినార్లు నిర్వహిస్తూ వచ్చారు. పూర్వ విద్యార్థులు.. ప్రముఖులు ఇదే కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి ప్రముఖ స్థానాల్లో ఉన్న వారు ఉన్నారు. బెల్ సీఏండీ శాస్త్రి, శాంత బయోటెక్ అధినేత పద్మ విభూషణ్ వరప్రసాద్‌రెడ్డి, మెట్రో సీఏండీ పద్మవిభూషణ్ శ్రీధర్, ఉన్నత విద్య ముఖ్యకార్యదర్శి శ్యామలరావు ఐఏఎస్‌లు కృష్ణబాబు, రవిచంద్ర, జిల్లాకు చెందిన దివంగత ఎస్వీప్రసాద్ మాజీ ఐఏఎస్, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్ర రంగ సంస్థల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు, శాసన సభ్యులు ఉన్నారు. జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ వీసీగా చేసిన డాక్టర్ రామలింగరాజు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ఉదయభాస్కర్ ఇదే కళాశాలలో అభ్యసించారు. రెండు రోజుల పాటు కార్యక్రమాలు శుక్ర, శనివారాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా వర్సిటీ అతిథి గృహం వద్ద వాటర్ ఫాల్ పైలాన్ నిర్మిస్తున్నారు. తొలిరోజు పైలాన్ ఆవిష్కరణ, నక్షత్ర వనం సందర్శన, పరిచయాలు, సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింగరావు ప్రవచనం ఏర్పాటు చేశారు. రెండోరోజు క్రీడామైదానంలో పూర్వ విద్యార్థులు దాదాపు రూ.రెండు కోట్లతో నిర్మించే అతిథి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పూర్వ విద్యార్థులు కళాశాలలో వివిధ విభాగాలకు, పలు ల్యాబ్‌ల నిర్మాణాలకు, కళాశాల అభివృద్ధికి సహకరించనున్నారు. ఏర్పాట్లు పూర్తి ఇంజినీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల నిర్వహణకు కమిటీలు వేశాం. అవసరమైన ఏర్పాట్లు చేశాం. ఇదే కళాశాలలో అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరిన వారు ఉన్నారు. వారి సహకారంతో కళాశాలను మరింత అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపాం. దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం స్పందించి కళాశాల అభివృద్ధికి చేయూత ఇస్తామంటున్నారు. నా హాయాంలో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉంది. – డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వీసీ జేఎన్టీయూకే -
రూల్స్ అన్నారు.. అనుమతులు ఇచ్చేశారు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, రూల్స్ పాటించకపోతే అనుబంధ గుర్తింపే ఇవ్వమని జేఎన్టీయూహెచ్ నిన్నటిదాకా ఊదరగొట్టింది. అంతలోనే ఏం జరిగిందో ఏమో! బుధవారం ఒక్కరోజే ఏకంగా 108 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని 11 కాలేజీలు కూడా కలిపితే, రాష్ట్రంలో 119 కాలేజీలకు అనుమతులు వచ్చేశాయ్. ఇది ఏటా జరిగే తంతు.. అనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ ఏడాది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గతంలోకన్నా భిన్నంగా వ్యవహరిస్తామని తెలిపింది. గత నెల 25వ తేదీన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మీడియాకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌కు పీహెచ్డీ, అధ్యాపకులకు ఇతర అవసరమైన అర్హతలు ఉన్నాయా.. లేదా చూస్తామన్నారు. కాలేజీలు గుడ్డిగా అధ్యాపకుల జాబితా పంపితే.. వాళ్లు చదివిన యూనివర్సిటీలకు వెళ్లి మరీ సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. సరైన అర్హతలు లేని అధ్యాపకులతో కాలేజీలు నడిపించే విధానాన్ని మారుస్తామని వీసీ తెలిపారు. అన్ని కాలేజీలను తమ కమిటీ పరిశీలించి, అర్హతలున్నాయని తెలుసుకున్నాకే అఫిలియేషన్ ఇస్తామని ఆయన పదేపదే చెప్పారు. కమిటీ అయితే అన్ని కాలేజీలకు వెళ్లింది. ఈ పరిశీలనలో 90 శాతం కాలేజీల్లో లోపాలున్నాయని, మౌలిక వసతుల్లేవని, అధ్యాకులు నిబంధనల ప్రకారంలేరని గుర్తించినట్టు తెలిసింది. అయితే, కమిటీ పరిశీలించి.. ఇచ్చిన నివేదికను మాత్రం జేఎన్టీయూహెచ్ గోప్యంగా ఉంచింది. దీనిపై యూనివర్సిటీ అధికారులు కనీసం పెదవి విప్పేందుకు కూడా సాహసించడం లేదు. అంతలోనే ఇన్ని కాలేజీలకు అర్హులైన అధ్యాపకులు ఎలా వచ్చారో? మౌలిక సదుపాయాలు ఎలా సమకూరాయో తెలియదు కానీ.. అఫిలియేషన్ అయితే ఇచ్చేసింది. అనుమతులు సరే.. అధ్యాపకుల సంగతేంటి? అధ్యాపకుల సమస్యలు పట్టించుకోకుండా, ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులివ్వడం దారుణమని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీల ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోశ్‌కుమార్ అన్నారు. చాలా కాలేజీల్లో జీతాలే ఇవ్వడం లేదని, వేతన సంఘం సిఫార్సు చేసిన జీతాలు అందడం లేదని పేర్కొన్నారు. కాలేజీల్లో అసలు అధ్యాపకులు ఉన్నారా అనే విషయాన్ని కమిటీ పరిశీలించిందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని, అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. -
ఇదీ సంగతి: అర్హతలేని అధ్యాపకులు... అనుభవం లేని ప్రిన్సిపాళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 90 శాతం ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని గుర్తించినట్లు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ–హెచ్) వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి కాలేజీలకు ఈసారి గుర్తింపు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనల అమలు కచ్చితంగా పాటించడం సాధ్యం కాదని, ఈసారికి మినహాయింపు ఇవ్వాలంటున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ–హెచ్ అఫిలియేషన్ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇది పూర్తయితేనే ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. కమిటీ తేల్చిందేంటి? రాష్ట్రవ్యాప్తంగా 148 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 955 కోర్సులను నిర్వహిస్తున్నారు. 2021–22 లెక్కల ప్రకారం ఆయా కాలేజీల్లో 89,400 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. వాటన్నింటికీ అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఉంది. అయితే ఈ విద్యా సంవత్సరానికి జేఎన్టీయూ–హెచ్ అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో స్థితిగతులు తెలుసుకొనేందుకు ఎంసెట్ నిర్వహణకు ముందే జేఎన్టీయూ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లోని మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల వివరాలను సేకరించింది. జేఎన్టీయూ వర్గాలు పేర్కొన్న దాని ప్రకారం త్రిసభ్య కమిటీ గుర్తించిన విషయాలు ఇవీ... ►రాష్ట్రంలోని 90 శాతం కాలేజీల్లో మౌలిక వసతుల లేమి కనిపించింది. సీఎస్ఈ కోర్సులకు కీలకమైన ఆధునిక కంప్యూటర్లు లేవు. అవసరమైన సాఫ్ట్వేర్ సైతం అందుబాటులో లేదు. కొన్ని కాలేజీల్లో ఇంకా కాలం చెల్లిన కంప్యూటర్లే కనిపించాయి. ►అనుభవం లేని అధ్యాపకులు, అర్హతల్లేని ప్రిన్సిపాళ్లతో మొక్కుబడిగా నడుస్తున్నాయి. ►చాలా కాలేజీలు అధికారికంగా చూపించే ఫ్యాకల్టీ అధ్యాపకులు కనిపించలేదు. ►దాదాపు ఐదేళ్లుగా పేరున్న ఒక్క కంపెనీ కూడా ఆయా కాలేజీల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టిన దాఖలాల్లేవు. ఏఐసీటీఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి... ►కాలేజీ ప్రిన్సిపాల్ పీహెచ్డీ చేసి ఉండాలి. కనీసం 15 ఏళ్ల అధ్యాపక అనుభవం కలిగి ఉండాలి. ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులకు మార్గదర్శిగా పనిచేసి ఉండాలి. ►సైన్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు తప్పనిసరిగా పీహెచ్డీ చేసి ఉండాలి. ఇది లేనప్పుడు నెట్, స్లెట్.. ఏదో ఒకటి చేసుండాలి. ►కాలేజీలు ఎంపిక చేసే అధ్యాపకులను అఫిలియేషన్ ఇచ్చే యూనివర్సిటీ పరిశీలించి, ఆమోదించాలి. బోధించే అర్హతలున్నాయా లేదా అని పరీక్షించిన తర్వాతే గుర్తింపు ఇవ్వాలి. -
త్వరలో ఇంజనీరింగ్ విద్యార్థుల బదిలీలు
నేడు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ అనుబంధ గుర్తింపునకు నోచుకోని కళాశాలలకు చెందిన విద్యార్థుల బదిలీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను బుధవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేయనుంది. 2015-16 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 కళాశాలల వరకు అనుబంధ గుర్తింపు దక్కలేదు. ఇప్పటికే ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర కళాశాలల్లోకి బదిలీ చేయాల్సి ఉంది. దీనిపై మంగళవారం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా ఇతర కళాశాలలకు వారిని బదిలీ చేయాలని అధికారులకు సూచిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కోర్టు తీర్పునకు లోబడి విధి విధానాలకు అనుగుణంగా బదిలీ ప్రక్రియ చేపట్టేందుకు రంగం సిద్ధమైందని అధికారులు తెలిపారు. -
పైసలతో పైరవీలు
కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూకే) రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారింది. ఎన్నో కోర్సులు కొలువై ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో డెరైక్టర్ల పదవుల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. అధికారపార్టీ నేతలను పైసలతో ప్రసన్నం చేసుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు. పోస్టుకొక ధర నిర్ణయించి లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో వర్సిటీ పరువు మంటగలుస్తోందని విద్యార్థి లోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే గ్లోబరీనా వివాదంతో నవ్వులపాలైన వర్సిటీ ప్రతిష్ట ఈ పైరవీలతో మరింత దిగజారుతోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ :జేఎన్టీయూకేలో 22 మంది డెరైక్టర్ల పదవీకాలం ముగిసింది. వీరి నియామకం చేపట్టాల్సి ఉంది. దీంతో అధ్యాపకులు ఆ పదవుల కోసం పైరవీలు మొదలెట్టారు. ఇప్పటికే వర్సిటీ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో నెలకొన్న గ్లోబరీనా వివాదం అంశం గవర్నర్ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో డెరైక్టర్ పోస్టుల కోసం సీనియర్ అధ్యాపకుల పైరవీలు సాగిస్తుండడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు డెరైక్టర్లు తమ పదవీ కాలం ముగిసినా కుర్చీలు వీడేందుకు సుముఖంగా లేరు. కొందరు కాసులు కురిపించే సీట్లకోసం సామాజిక సమీకరణలతో అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. కాసులు కురిపించే పదవుల కోసం కుస్తీ రెక్టార్, రిజిస్ట్రార్, డీఏపీ, డెరైక్టర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఛీప్ ఇంజనీర్, డెరైక్టర్ ఎవాల్యుయేషన్, ఫారెన్ యునివర్సిటీ, డెరైక్టర్ ఐఎస్టీ, ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సెన్సైస్, డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డెరైక్టర్ ఆఫ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్, ఎంపవర్మెంట్ ఉమెన్ గ్రీవెన్సెస్, డెరైక్టర్ ఆఫ్ లైఫ్ సైన్స్కోర్స్, డెరైక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, డెరైక్టర్ ఆఫ్ ఫార్మసీ, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ పుడ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ మెనేజ్మెంట్ స్టడీస్, పెట్రో కెమికల్ ప్రోగ్రామ్ డెరైక్టర్, సెంటర్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఈ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్‌మెంట్, ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ ఇంటరాక్షన్ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ తదితర 22 విభాగాల్లో డెరైక్టర్ల పదవులు ఉన్నాయి. వీటితో పాటు వర్సిటీ ఆవరణలోని కళాశాల ప్రిన్సిపాల్ పదవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఐదు గురు అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పదవులూ కీలకంగా ఉన్నాయి. వాటిలో రిజిస్ట్రార్, రెక్టార్, డీఏపీ, డీఈ, కళాశాల ప్రిన్సిపాల్, ఛీఫ్ ఇంజనీర్, సీఈ పోస్టులు కాసులు కురిపించే పోస్టులుగా ఉన్నాయి. వీటికి ఆశావాహులు ధరలు కూడా నిర్ణయించి పైరవీలు సాగిస్తునానరు. రిజిస్ట్రార్ పోస్టుకైతే రూ.50 లక్షలపైమాటే చెల్లిస్తామని ముందుకొస్తున్నట్టు సమాచారం. రిజిస్ట్రార్ తరువాత అత్యధికంగా రూ.పాతిక లక్షలు వరకు డీఏపీ, డీఈ పోస్టులకు పైరవీలు జరుగుతున్నాయి. అందరి కళ్లూ రిజిస్ట్రార్ సీటుపైనే ! జేఎన్టీయూకే పరిధిలో వందకు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఫీజులు, పాలనాపరంగా రూ.వందకోట్ల లావాదేవీలు జరుగుతాయి. వీటిల్లో రిజిస్ట్రార్ పదవి కీలకం. అందుకే అందరి కళ్లు ఆ సీటుపైనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు వీసీ సీటు కోట్లు పలికిన విషయం తెలిసిందే. వీసీ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న సీటు కావడంతో ఒక ప్రిన్సిపాల్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. ఈయన సామాజిక నేపథ్యంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం ద్వారా ముమ్మరంగా యత్నిస్తున్నట్టు తెలిసింది. ఈయనతోపాటు వీసీ పోస్టు కోసం ముమ్మరంగా యత్నించి విఫలమై,ఆర్థికంగా మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఒక డెరైక్టర్ కూడా వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్, ముఖ్యనేత వారసుడైన చినబాబు ద్వారా పైరవీలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రూ.70 లక్షలు కూడా ఆఫర్ చేశారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. డీఈ పోస్టు కోసం మరో సీనియర్ ఫ్యాకల్టీ మంత్రి గంటా శ్రీనివాస్ ద్వారా ప్రయత్నిస్తున్నారని సమాచారం. రిజిస్ట్రార్ కూడా అవే యత్నాల్లో ఉన్నారని చెబుతున్నారు. తాను ప్రతిపాదించిన వారికి ఏసీఈ పోస్టు ఇవ్వాలని, ఒక డైరక్టర్ పదవిని తన సామాజిక వర్గానికి ఇవ్వాలని కాకినాడకు చెందిన ఒక ప్రజాప్రతినిధి వర్సిటీ వర్గాలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.వీసీగా చివరి వరకు యత్నించి విఫలమై రెక్టార్‌గా ఉన్న ప్రభాకరరావు కూడా రిజిస్ట్రార్ రేసులో ఉన్నారని పేర్కొంటున్నారు. గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన మరొక డెరైక్టర్ అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ద్వారా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇన్ని ఒత్తిళ్లతో విసుగెత్తిపోయిన వీసీ సహా వర్సిటీవర్గాలు డెరైక్టర్ల పంపకాలు, తెలుగు తమ్ముళ్ల పైరవీలను సీఎం పేషీకి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
జవాబు పత్రాల మూల్యాంకనంలో జేఎన్టీయూహెచ్ నిర్లక్ష్యం ప్రతిభ గల విద్యార్థులకూ పదిలోపు మార్కులు కొన్ని సబ్జెక్టుల్లో మూకుమ్మడిగా ఫెయిల్ చేసిన వైనం అనర్హులు దిద్దుతున్న ఫలితం బ్యాక్‌లాగ్స్‌తో దూరమవుతున్న ఉద్యోగావకాశాలు ఫీజులపైనే అధికారుల దృష్టి యూనివర్సిటీ తీరుపై విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థులకు సున్నా మార్కులు రావడం, అనామకుడికి సైతం అరవై శాతం మార్కులు వేయడం జేఎన్టీయూహెచ్కే చెల్లింది. ఒకప్పుడు సాంకేతిక విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(హైదరాబాద్) ప్రతిష్ట మసకబారుతోంది. అరకొర వసతులతోనే ఉన్నంతలో కష్టపడి చదివి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ వర్సిటీ పరీక్షల విభాగం ఘోరంగా విఫలమవుతోంది. ఇష్టారీతిలో మార్కులేస్తూ మూకుమ్మడిగా విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారు. నాలుగేళ్లపాటు బీటెక్ చదివి 80 శాతం మార్కులు సాధించినా, బ్యాక్‌లాగ్స్ కారణంగా ఉద్యోగావకాశాలకు అర్హత సాధించలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో ఆశలతో బీటెక్‌లో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యార్థులకు జరుగుతున్న నష్టానికి బాధ్యత వహించేందుకు కళాశాలల యాజమాన్యాలు, జేఎన్టీయూహెచ్ అధికారులు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఇవేం మార్కులు బాబోయ్! యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట కొన్ని సబ్జెక్టులు పీడకలగా మారాయి. కంప్యూటర్ సైన్స్‌లో కొన్ని, ఈసీఈ గ్రూప్‌లో కొన్ని సబ్జెక్టులను బోధించేందుకు అర్హులైన అధ్యాపకులే దొరకడం లేదు. ఒకవేళ ఉన్నా, విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దేందుకు తగిన విషయ నిపుణులు ఉన్నారా అన్నదీ ప్రశ్నార్థకమే! మేడ్చల్ పరిధిలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో ఎక్కువమంది ‘వెబ్ టెక్నాలజీ’ సబ్జెక్టులో ఫెయిల్ కావడమే ఇందుకు ఉదాహరణ. ఈ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్న 41 మంది విద్యార్థులు.. ఇటీవలి సెమిస్టర్ పరీక్షలో వెబ్ టెక్నాలజీ సబ్జెక్టు మినహా మిగిలినవన్నీ పాసయ్యారు. కోర్సు మొత్తం కలిపి 80 శాతం మార్కులు వచ్చిన ఓ విద్యార్థికి సైతం వెబ్ టెక్నాలజీ సబ్జెక్టులో ఆరు మార్కులు వచ్చాయి. 75 శాతం మార్కులున్న మరో విద్యార్థికి ఈ సబ్జెక్టులో 2 మార్కులు రాగా, 79 శాతం మార్కులున్న ఇంకొకరికి 15 మార్కులే వచ్చాయి. ఇలా మార్కులు వచ్చిన వేలాది మంది విద్యార్థులు చేసేది లేక రూ. 1000 చెల్లించి రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. నెల దాటినా జేఎన్టీయూహెచ్ అధికారులు రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేయలేదు. మరోవైపు నవంబరు 17 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనుండడంతో దిక్కుతోచని పరిస్థితి విద్యార్థులది. ఇదే రీతిన పలు కాలేజీల్లోని విద్యార్థులు మెఫా, నెట్వర్క్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులతో బెంబేలెత్తిపోతున్నారు. భవిష్యత్తుపై గొడ్డలి పెట్టు ఇలాంటి మూల్యాంకనం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. కొన్ని సబ్జెక్టుల్లో పాస్ కాని విద్యార్థులను ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలకు పిలవడం లేదు. దీంతో ప్రతిభావంతులు కూడా నిరాశకు గురవుతున్నారు. వర్సిటీ పరిధిలోని 319 అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాక్లాగ్ లేకుండా బయటకు వెళ్లిన విద్యార్థులు ఎంతమందో కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి ఉంది. తమకు ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు అడిగితే రూ.100 చెల్లించి రీకౌంటింగ్/రూ.1000చెల్లించి రీవాల్యుయేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆపై చాలెంజ్ ఎవాల్యుయేషన్ కావాలంటే రూ. 10 వేలు, ఆన్సర్ బుక్లెట్ జిరాక్సు కావాలంటే రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్లో పాసైన విద్యార్థులకు వారు చెల్లించిన సొమ్మును వాపసు ఇవ్వటం లేదు. జవాబు పత్రాలు దిద్దిన ఆచార్యుడో లేదా మార్కులను కంప్యూటర్లో నమోదు చేస్తున్న వర్సిటీ సిబ్బందో తప్పు చేస్తే, శిక్ష మాత్రం విద్యార్థులే అనుభవిస్తున్నారు. అనుభవజ్ఞులైన వర్సిటీ ప్రొఫెసర్లతో కాకుండా ప్రైవేటు కాలేజీలకు చెందిన అర్హత లేని అధ్యాపకులతోనే మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నారు. అరకొర పరిజ్ఞానంతో సదరు ఆధ్యాపకులు జవాబు పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే ఇష్టమొచ్చినట్లుగా మార్కులు వేసి విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారు. -
బయో ఆంధ్ర సదస్సు ప్రారంభించనున్న స్మృతి ఇరానీ
కాకినాడ: బయో ఆంధ్ర -2014 సదస్సు కాకినాడ జేఎన్టీయూలో వచ్చే నెల 16వ తేదీన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఆ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ తులసీ రామ్‌దాస్ వెల్లడించారు. శుక్రవారం కాకినాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఈ సదస్సు 18వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. వ్యవసాయం, రొయ్యలు, చేపల రంగాల్లో ఆధునిక సాగు పద్దతుల్ని తెలియజేసేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు వెయ్యి మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయదారులు, చేపలు, రోయ్యల సాగుదారులతోపాటు విద్యార్థులు హాజరవుతారని రామ్ దాస్ తెలిపారు. -
ఉద్యోగాలు
జేఎన్టీయూ, హైదరాబాద్ హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: సీఎస్, ఎస్ఈ, సీఎన్‌ఐఎస్, బీఐ అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంటెక్/ పీహెచ్డీ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 17 వెబ్సైట్: http://jntuh.ac.in/ హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ముంబైలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ యుయేట్ ఇంజనీర్స్ అర్హత: బీటెక్ వయసు: 25 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: గేట్-2015 స్కోర్ ఆధారంగా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: 18 డిసెంబర్ 2014 నుంచి 2 ఫిబ్రవరి 2015 వెబ్సైట్: www.hindustanpetroleum.com ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. చీఫ్ మేనేజర్ (ఎకనామిస్ట్) మేనేజర్ (ఎకనామిస్ట్) డిప్యూటీ మేనేజర్ (ఎకనామిస్ట్) చీఫ్ మేనేజర్ (రిస్క్ ఎనలిస్ట్) చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ) అర్హతలు తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. చివరి తేది: సెప్టెంబర్ 17 వెబ్సైట్: www.sbi.co.in -
బోధన సిబ్బంది ఉన్న కాలేజీలనే కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి
జేఎన్టీయూహెచ్కు హైకోర్టు ఆదేశం మిగిలిన లోపాలను నెలరోజుల్లో సవరించుకుంటామని హామీ ఇవ్వాలి ఆ తరువాత సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలి హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల విషయంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) వాదనలవైపు హైకోర్టు మొగ్గు చూపింది. నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించుకున్న కాలేజీలను మాత్రమే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామంటూ జేఎన్టీయూహెచ్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చేసిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ వాదనల ప్రకారమే, ని బంధనలు నిర్దేశించిన మేరకు నిర్దిష్ట అర్హతలతో బోధనా సిబ్బం దిని కలిగి ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో వెంటనే చేర్చాలంటూ హైకోర్టు సోమవారం జేఎన్‌టీయూహెచ్‌ని ఆదేశించింది. జేఎన్టీయూ చూపిన ఇతర లోపాలనూ ప్రవేశ ప్రక్రియ ముగిసే రోజు నుంచి నెల రోజు ల్లోపు సవరించుకుంటామని పిటిషనర్ కాలేజీలన్నీ కూడా హామీ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకుంటామంటూ దరఖాస్తు చేసుకున్న కాలేజీలు విఫలమైతే ఆ తరువాత నిర్ణయం తీసుకోవచ్చని జేఎన్టీయూకు స్పష్టం చేసింది. జేఎన్టీయూ తీరును తప్పుబట్టిన హైకోర్టు కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించే వ్యవహారంలో జేఎన్టీయూ వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. జేఎన్టీయూ స్వయంగా తాను రూపొందించిన నిబంధనలను తానే అమలు చేయలేదని ఆక్షేపించింది. తమ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించడంతో పాటు అఫిలియేషన్లను కూడా రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాదాపు 150కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. కాలేజీల లోపాలను గుర్తించినప్పుడు వాటిని సవరించుకునేందుకు వీలుగా 174 కాలేజీలకు ముందుగానే తెలియచేయాల్సి ఉండేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. నిబంధనలు నిర్దేశించిన మేరకు నిర్దిష్ట అర్హతలతో బోధన సిబ్బంది ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో వెంటనే చేర్చాలని ఆయన జేఎన్టీయూ హైదరాబాద్‌ను ఆదేశించారు. అంతేగాక పలు కాలేజీల్లో సీట్ల సంఖ్య తగ్గింపు విషయంలో జేఎన్టీయూ ఏకపక్షంగా వ్యవహరించిందని జస్టిస్ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. -
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆన్లైన్ వ్యవస్థ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని జ వహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఇకపై ఆన్లైన్లో నిర్వహించనుంది. గతంలో మూడు వారాల నుంచి మూడు నెలల సమయం తీసుకునే ఈ ప్రక్రియ ఇకపై ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మూడు నుంచి నాలుగు రోజుల్లోగా పూర్తికానుంది. యూనివర్సిటీ అధికారులు ఇప్పటివరకు మాన్యువల్ విధానాన్నే అవలంభిస్తుండడంతో ధ్రువపత్రాలు పరిశీలనలో అంతులేని జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు పొందిన విద్యార్థులకు ఒక్కోమారు తీరని నష్టం వాటిల్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ట్రయల్న్ విజయవంతం జేఎన్టీయూహెచ్ అనుబంధ, అఫిలియేటెడ్ కళాశాలల్లో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన విద్యార్థులు దేశీయంగా, అంతర్జాతీయంగా ఏవైనా విద్యా సంస్థలు(యూనివర్సిటీలు), ఉద్యోగ సంస్థల్లో చేరుతుంటారు. వీరి విద్యార్హత పత్రాలు నిజమైనవో, కావోనని నిర్ధారించుకునేందుకు ఆయా సంస్థలు వెరిఫికేషన్ కోసం జిరాక్స్ ప్రతులను జేఎన్టీయూహెచ్కు పోస్టుద్వారా పంపుతుంటాయి. కొన్నిసార్లు వెరిఫికేషన్ రిపోర్టు రాక ఆయా సంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. మరికొన్ని సందర్భాల్లో ఆయా సంస్థలు పోస్టు ద్వారా పంపిన పత్రాలు మిస్ అయిన సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యలో.. జేఎన్టీయూహెచ్ ఆన్లైన్ ద్వారా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు గత వారం రోజులుగా నిర్వహించిన ట్రయల్న్ రవిజయవంతమైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఇండియా వరకే ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సదుపాయాన్ని ప్రస్తుతానికి దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, ఉద్యోగాలిచ్చే సంస్థలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా 2010 తర్వాత డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేశామని, అంతకు ముందు చదివిన విద్యార్థుల వివరాలను త్వరలోనే అప్లోడ్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ధ్రువపత్రాల వెరిఫికేషన్ కోరే సంస్థలు జేఎన్టీయూహెచ్ వెబ్సైట్లో ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజనల్ డిగ్రీ, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోలను జిరాక్సు పత్రులను మాత్రమే ఆన్లైన్లో వెరిఫికేషన్ కోసం పంపాలి. విద్యార్థి హాల్‌టికెట్ నంబరు తప్పనిసరిగా నమోదు చేయాలి. -
4న జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఐదవ స్నాతకోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. రెండేళ్లుగా స్నాతకోత్సవం నిర్వహణ తేదీలు వరుసగా పలుమార్లు వాయిదా పడుతుండడంతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు వర్సిటీ సిబ్బందిలోనూ అయోమయం నెలకొంది. ఈ అయోమయానికి తెరదించుతూ సెప్టెంబరు 4న ఉదయం 11 గంటల నుంచి స్నాతకోత్సవం నిర్వహించాలని వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి యూనివర్సిటీల చాన్స్‌లర్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ నుంచి అనుమతి కూడా లభించింది. సుమారు లక్షమంది విద్యార్థులకు ఒరిజనల్ డిగ్రీ పట్టాలు, ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, పరిశోధనలు పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీలను స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారు. ఓడీ దరఖాస్తులకు గడువు పెంపు.. జేఎన్టీయూహెచ్ పరిధిలో పరిధిలో 4 అనుబంధ, 448 ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4.5లక్షలమంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తుండగా, ప్రతియేటా 70-80వేలమంది విద్యార్థులు తమకోర్సులు పూర్తి చేసుకొని ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళుతుంటారు. స్నాతకోత్సవం అనంతరం విద్యార్థులందరికీ ఒరిజినల్ డిగ్రీలను యూనివర్సిటీ అందజేస్తుంది. వచ్చేనెల 4న స్నాతకోత్సవానికి జరగనున్న నేపథ్యంలో.. ఆన్లైన్లో ఓడీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని ఈనెల 11 వరకు పొడిగించారు. 2012-13 సంవత్సరానికి చెందిన విద్యార్థులు 59 వేలమంది, 2013-14 సంవత్సరానికి చెందిన విద్యార్థులు 39 వేలమంది ఇప్పటికే ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు. 50 మందికి గోల్డ్ మెడల్స్ .. 2013-14 విద్యా సంవత్సరానికి గాను జేఎన్టీయూహెచ్ బంగారు పతకాలకు ఎంపికైన విద్యార్థుల్లో జేఎన్టీయూ హైదరాబాద్ కళాశాల నుంచి ప్రణవినాయుడు(సివిల్), జ్యోతి(ఈఈఈ), స్నేహ(మెకానికల్), హర్షిత(ఈసీఈ), సుజన(సీఎస్ఈ), అఖిలకృష్ణ(మెటలర్జీ), మంథని కళాశాలకు చెందిన అన్వేష్(సివిల్), భాస్కర్(మైనింగ్), వెంకటేశ్(మైనింగ్ మెషినరీ), జగిత్యాల కళాశాలకు చెందినశంతన్తేజ(ఈఈఈ), సంధ్యారాణి(మెకానికల్), రహేలా(ఈసీఈ), సృజన(సీఎస్ఈ), నవ్య(ఐటీ) ఉన్నారు. ఈసీఈ విద్యార్థిని హర్షితకు ఏకంగా ఐదు బంగారు పతకాలు, ప్రణవి నాయుడు మూడు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. వీరితో పాటు మరో 24మంది ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు గోల్డ్‌మెడల్స్‌కు ఎంపికైనట్లు యూనివ ర్సిటీ అధికారులు వెల్లడించారు. -
‘జేఎన్టీయూలో నియామకాలు ఆపండి’
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అధ్యాపక ఖాళీల నియామకాలను తక్షణమే నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోరారు. ఆదివారం సాయంత్రం వర్సిటీకి చెందిన పలువురు టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు పొన్నాలను కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ 186 టీచింగ్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారని, సీమాంధ్ర ప్రాంతం వారిని నియమించేందుకే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన పొన్నాల వెంటనే వర్సిటీ ఉపకులపతి రామేశ్వర్‌రావుకు ఫోన్ చేసి నియామకాలను ఆపాలని కోరారు. -
రేపు జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవం
=న్యూక్లియర్ సైంటిస్ట్ అనిల్ కకోద్కర్‌కు గౌరవ డాక్టరేట్ =ప్రెస్మీట్లో వీసీ రామేశ్వరరావు వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ నాలుగో స్నాతకోత్సవం శ నివారం నిర్వహించనున్నారు. స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ అణ్వస్త్ర శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ అనిల్ కకోద్కర్ను యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు వర్సిటీ వీసీ డాక్టర్ రామేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అధ్యక్షతన జరగనున్న స్నాతకోత్సవంలో యూనివర్సిటీ (2008-12 బ్యాచ్)లో వివిధ కోర్సులు పూర్తి చేసిన 1,12,737 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు, 197 మంది రీసెర్చ్ స్కాలర్స్‌కు పీహెచ్డీ డిగ్రీలను, 53 మందికి బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పనతో పాటు, సమాజ అభ్యున్నతి లక్ష్యంగా జేఎన్టీయూహెచ్ ముందుకు వెళ్తోందన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు సరికొత్త సాంకేతిక విద్యను అందించేందుకు ప్రఖ్యాత విద్యా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని, అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నామన్నారు. రిజిస్ట్రార్ రమణరావు, రెక్టార్ సాయిబాబారెడ్డి, డెరైక్టర్లుజీకే విశ్వనాథ్, ఈశ్వర్ప్రసాద్, విజయకుమారి, ఆర్యశ్రీ, రామకృష్ణప్రసాద్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నలకు తత్తరపాటు.. సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వీసీతో సహా పలువురు డెరైక్టర్లు తత్తరపాటుకు గురయ్యారు. ప్రొఫెసర్లైనా కొన్ని అంశాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం చిత్రంగా ఉంది. వర్సిటీ పాలక మండలి సమావేశ ంలో తీసుకున్న నిర్ణయాల (మినిట్స్)ను ఎందుకు బహిర్గతం చేయరని ప్రశ్నించగా, ఈసీ మినిట్స్ అత్యంత రహస్యమైన విషయాలని వీపీ చెప్పడం విడ్డూరం. అవును కాన్ఫిడెన్సియల్ అంటూ.. అధికారులు కూడా వంతపాడడం మరీ విచిత్రం. స్నాతకోత్సవం నిర్వహణలో జాప్యానికి కారణాలేమని అడగ్గా.. చెప్పేందుకు వీలుకాదని వీసీ పేర్కొన్నారు. సెమిస్టర్ పరీక్షల్లో జంబ్లింగ్ వలన ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడగ్గా, ఫిర్యాదులు వస్తేనే పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం. ఫిల్మ్ మేనేజ్మెంట్, బ్యూటిషియన్ కోర్సులకు సంబంధించి వర్సిటీలో ఎటువంటి మెకానిజమ్ లేకున్నా.. అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, అనూస్ బ్యూటీ క్లినిక్స్.. తదితర సంస్థలతో ఏంవోయూలు ఎలా కుదుర్చుకున్నారని ప్రశ్నించగా, పాలకమండలి అనుమతితోనే ఏంవోయూలు కుదర్చుకున్నామంటూ అసలు సమాధానం చెప్పకుండా దాటేశారు. -
బీ‘టఫ్’
ఇంటర్ బ్రిలియంట్స్... ఎంసెట్ టాపర్స్... ఇంజనీరింగ్‌లో మాత్రం ఫెయిల్. ఇటీవల విడుదలైన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు చెబుతున్న చేదు నిజమిది. ఈ తీరుకు కారణాలేంటి? దీనికి పరిష్కారాలేంటి? ‘సాక్షి ’ విశ్లేషణాత్మక కథనం... సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 289 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, వీటిలో చదువుతున్న విద్యార్థులు 2.5 లక్షలకు పైమాటే. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70,872 మంది. వీరంతా గతేడాది ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి వివిధ సాంకేతిక కోర్సుల్లో అడుగిడినవారే. ప్రతిభావంతులైన ఈ విద్యార్థులు గత మేలో జరిగిన ఇంజనీరింగ్ వార్షిక పరీక్షల్లో మాత్రం గుడ్లు తేలేశారు. జేఎన్టీయూహెచ్ గతవారం విడుదల చేసిన ఫలితాల ప్రకారం మొదటి సంవత్సరం ఉత్తీర్ణత (34.59 శాతమే) పాస్ మార్కులు కూడా దాటలేదు. ఈ తీరుకు కారణాలేంటని పరిశీలిస్తే ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా సిబ్బంది లేకపోవడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తోంటే.. విద్యార్థులకు ఇంటర్ తర్వాత విపరీతమైన స్వేచ్ఛ లభించడమే కారణమేనని ఆచార్యులు అంటున్నారు. విద్యార్థులు మాత్రం తాము పరీక్షలు బాగానే రాస్తున్నామని, మార్కులు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఆందోళన ఇంజినీరింగ్ ఫస్టియర్ ఫలితాలను చూసి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రతియేటా మార్చినెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు పూర్తయినప్పటి నుంచి ఇంజినీరింగ్‌లో చేరేవరకు సుమారు ఐదు నెలల పాటు విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరమవడం, ఇంటర్ వరకు తమ పిల్లల చదువు పట్ల ఎంతో శ్రద్ధ చూపే తల్లిదండ్రులు, బీటెక్ కోర్సుల్లో చేరిన విద్యార్థులను అంతగా పట్టించుకోకపోవడమే దీనికి కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా.. ఇంటికి సమీపంలోని జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఇంటర్ పుస్తకాలను గంటల కొద్దీ బట్టీలు కొట్టేవారని... ప్రస్తుతం నగరానికి దూరంగా ఉండే ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరడం వల్ల గంటల కొద్దీ సమయం బస్సుల్లోనే గడుపుతుండటం వల్ల చదువుకు ఇబ్బందవుతుందని వారు విశ్లేషిస్తున్నారు. దానికితోడు ఇంజినీరింగ్ విద్యార్థులకు లభిస్తోన్న విపరీతమైన స్వేచ్ఛ.. వారి వార్షిక పరీక్షా ఫలితాలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఇంజనీరింగ్ సిలబస్ విభిన్నం టెన్త్, ఇంటర్‌లతో పోలిస్తే ఇంజనీరింగ్ సిలబస్ విభిన్నంగా ఉంటుంది. బీటెక్‌లో అపరిమితమైన సిలబస్ ఉండడంతో విద్యార్థులు భారంగా భావిస్తారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారడం, నివాస ప్రాంతాలకు కళాశాలలు దూరంగా ఉండడం, సీనియర్స్ నుంచి ర్యాగింగ్.. తదితర అంశాలు కూడా ఫస్టియర్ విద్యార్థులకు ప్రతిబంధకాలుగా మారతాయి. మరో ముఖ్యమైన విషయమేమంటే.. ఎక్కువ శాతం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫస్టియర్ విద్యార్థులకు సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని కనబర్చడం లేదు. ఫస్టియర్‌లో వార్షిక పరీక్షలకు ఎక్కువ సబ్జెక్టులు ఒకేసారి రాయాల్సి రావడం కూడా ఉత్తీర్ణత తగ్గడానికి మరో కార ణం. - ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్‌కుమార్, మెకానికల్ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్ ఆకర్షణల వలయంలో ఉక్కిరిబిక్కిరి ఇంటర్ వరకు స్వేచ్ఛ లేకుండా చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో చేరగానే జైలు నుంచి బయటకు వచ్చినట్లు ఫీలవుతారు. సహజంగానే ఈ వయసులో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా ఎన్నో ఆకర్షణ (స్మార్ట్ ఫోన్లు, బైక్‌లు, వెరైటీ దుస్తులు.. తదితరాలు)లకు లోనవుతారు. అదేవిధంగా ఇంటర్ వరకు విద్యార్థిని కంటికి రెప్పలా అంటిపెట్టుకునే తల్లిదండ్రులు.. తమ పిల్లాడు ఇంజనీరింగ్‌లో చేరాక నాలుగేళ్లపాటు ఇట్టే వదిలేస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చదువు మందగిస్తుంది. పరీక్షలు రాసేందుకు 70 శాతం హాజరు ఉంటే చాలని యూనివర్సిటీ అధికారులు నిర్దేశించడం విడ్డూరమే. అంటే.. ఎటువంటి వైద్య కారణాలు లేకున్నా 30 శాతం తరగతులు ఎగ్గొట్టమని చె ప్పినట్లవుతోంది. 90శాతం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థులకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే బోధిస్తున్నారు. టెన్త్, ఇంటర్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధిస్తుంటే చక్కగా వినే విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్ చెప్పే తరగతులు బోర్ కొట్టించక మానవు. బ్యాక్‌లాగ్‌లు ఉంటే నాలుగేళ్లలో ఎప్పుడో ఒకప్పుడు పూర్తి చేయవచ్చులేనన్న భావనతో కూడా విద్యార్థులు ఫస్టియర్ పరీక్షల పట్ల శ్రద్ధ కనబర్చడం లేదని తెలుస్తోంది. - గంపా నాగేశ్వరరావు, సైక్రియాటిస్ట్ ఐదారు కోర్సులకే ఆదరణ.. బీటెక్‌లో పేరుకు 30 ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నా.. ఎక్కువమంది విద్యార్థులు చేరుతోంది ప్రధానంగా ఐదారు కోర్సుల్లోనే. గత ఐదేళ్లుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్దే ఆధిపత్యం కొనసాగుతుండగా, ఐటీలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రమే. గతేడాది(2012-13) ఈసీఈ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు వరుసగా.. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈఈఈ, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లోనే చేరారు. మిగిలిన 24 కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఏ కోర్సులోనూ వెయ్యి దాటలేదు. కొన్ని కోర్సుల్లోనైతే ఆ సంఖ్య 100కి లోపే. ఫలితాలను పరిశీలిస్తే.. ఈసీఈలో 41.96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, సివిల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత కేవలం 22.93 శాతమే. సీఎస్ఈలో 35.83 శాతం, ఈఈఈలో 34.56 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 25.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరిష్కారాలివీ... ఇంజనీరింగ్‌లో కొత్తగా చేరిన విద్యార్థులకు కోర్సు పట్ల, ఆపై ఉద్యోగావకాశాల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా ఓరియెంటేషన్(అవగాహన) కార్యక్రమాలను కళాశాలల్లో ఏర్పాటు చేయాలి. బాహ్య ప్రపంచంలో రకరకాల ఆకర్షణలకు గురికాకుండా, విద్యార్థులు తమంతట తాము నియంత్రించుకునేలా మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. తల్లిదండ్రులు సెమిస్టర్ల వారీగా విద్యార్థి ప్రగతిని సమీక్షించాలి. ఇలా చేస్తే కొద్దిపాటి భయంతోనైనా విద్యార్థి చదువు పట్ల శ్రద్ధ చూపుతాడు. ఏళ్ల తరబడి ఒకే మాదిరి సిలబస్ కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా కోర్సుల సిలబస్ మార్పుపై యూనివర్సిటీలు దృష్టి పెట్టాలి. ఔట్ డేటెడ్ సిలబస్‌తో బోర్ ఫీలయ్యే విద్యార్థులు.. కొత ్త సిలబస్ అంటే ఎక్కువ శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు ఎంజాయ్‌మెంట్‌తో పాటు ప్రతి సెమిస్టర్‌లోనూ సబ్జెక్టులు మిగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. బహుళజాతి కంపెనీల్లో బ్యాక్‌లాగ్స్ ఉన్నా, కనీసం 60-65 శాతం మార్కులు లేకున్నా ఉద్యోగాలకు దూరం పెడుతున్నారు. కళాశాలలో జరిగే తరగతులకు రెగ్యులర్‌గా వెళుతూ ఇంటివద్ద కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట చదువుకుంటే చాలు అత్యుత్తమ ఫలితాలు ఇట్టే సొంతమవుతాయి. -
ఈసీ వద్దన్నా.. వీసీ కానిచ్చేశారు!
సాక్షి, సిటీబ్యూరో : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పాలకమండలి, ఉపకులపతిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. పలు ప్రైవేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంలో యాజమాన్యం అనుసరిస్తోన్న తీరును పాలకమండలి సభ్యులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలకమండలి అభ్యంతరాలను పక్కనపెట్టిన ఉపకులపతి, ఇతర అధికారులు ఎంచక్కా ఎంవోయూలను కానిచ్చేశారు. ఈ నేపథ్యంలో.. పాలకమండలి సమావేశం జరిగితే తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, గత రెండు నెలలుగా సమావేశాలను ఏర్పాటు చేయడం లేదని సమాచారం. గతంలో నెలకు రెండు మార్లు సమావేశాలు నిర్వహించిన అధికారులు.. రెండు నెలలువుతున్నా పాలకమండలి సమావే శం ఏర్పాటుపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహేంద్ర‘టెక్’పై ఎంత ప్రేమో! పలు సాంకేతిక కోర్సుల నిర్వహణ కోసం జేఎన్టీయూహెచ్తో ఎంఓయూ కుదుర్చుకునేందుకు నగరంలోని మహేంద్ర టెక్ సంస్థ గతేడాది నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. మహేంద్ర టెక్ సంస్థతో అవగాహనకు జేఎన్టీయూహెచ్ పాలకమండలి తొలిదశలోనే తిరస్కరించింది. అయినప్పటికీ యూని వర్సిటీ యాజమాన్యం పదేపదే ఈ ప్రతిపాదనలను ఈసీ సమావేశంలో పెడుతుండటంపై సభ్యుల నుం చి సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేటు సంస్థ నిర్వహించే టెక్నికల్ కోర్సులకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి అనుమతి లేకపోవడం, కోర్సులకు వసూలు చేసే ఫీజులు భారీగా ఉండడం, సంస్థ ప్రతిపాదనల్లో సామాజిక బాధ్యతను విస్మరించడం.. తదితర ప్రతికూల అంశాలను పాలకమండలి ఎత్తి చూపింది. గుట్టుగా కానిచ్చేశారు ఏఐసీటీఈ అనుమతి లేనిదే మహేంద్ర టెక్‌తో ఎంవోయూ తగదని గత ఐదు సమావేశాల్లోనూ పాలకమండలి స్పష్టం చేసింది. అయినప్పటికీ గతనెల 29న సదరు సంస్థతో జేఎన్టీయూహెచ్ యాజమాన్యం ఎంవోయూ కుదుర్చుకుంది. పాలకమండలి వద్దన్నా.. ఉపకులపతి మాత్రం కానిచ్చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారంలో పెద్దెత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ రమణరావును వివరణ కోరగా.. ‘ఏఐసీటీఈ అనుమతి ఉంటేనే ఏం వోయూ కుదుర్చుకోవాలని ఈసీ సూచిం చింది. అయితే.. టెక్ మహేంద్ర సంస్థ తాము నిర్వహించబోయే కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ప్రస్తుతానికి ఆ సంస్థతో కేవలం ‘కండిషనల్ ఎంవో యూ’ మాత్రమే కుదుర్చుకున్నాం. ఏఐసీటీఈ అనుమతి లేకుండా సదరు సంస్థ ఎటువంటి కోర్సు లు నిర్వహించేందుకు వీలు కాదు’ అన్నారు.