కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూకే) రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారింది. ఎన్నో కోర్సులు కొలువై ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో డెరైక్టర్ల పదవుల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. అధికారపార్టీ నేతలను పైసలతో ప్రసన్నం చేసుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు. పోస్టుకొక ధర నిర్ణయించి లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో వర్సిటీ పరువు మంటగలుస్తోందని విద్యార్థి లోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే గ్లోబరీనా వివాదంతో నవ్వులపాలైన వర్సిటీ ప్రతిష్ట ఈ పైరవీలతో మరింత దిగజారుతోందనే ఆందోళన
సర్వత్రా వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :జేఎన్టీయూకేలో 22 మంది డెరైక్టర్ల పదవీకాలం ముగిసింది. వీరి నియామకం చేపట్టాల్సి ఉంది. దీంతో అధ్యాపకులు ఆ పదవుల కోసం పైరవీలు మొదలెట్టారు. ఇప్పటికే వర్సిటీ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో నెలకొన్న గ్లోబరీనా వివాదం అంశం గవర్నర్ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో డెరైక్టర్ పోస్టుల కోసం సీనియర్ అధ్యాపకుల పైరవీలు సాగిస్తుండడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు డెరైక్టర్లు తమ పదవీ కాలం ముగిసినా కుర్చీలు వీడేందుకు సుముఖంగా లేరు. కొందరు కాసులు కురిపించే సీట్లకోసం సామాజిక సమీకరణలతో అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు.
కాసులు కురిపించే పదవుల కోసం కుస్తీ
రెక్టార్, రిజిస్ట్రార్, డీఏపీ, డెరైక్టర్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఛీప్ ఇంజనీర్, డెరైక్టర్ ఎవాల్యుయేషన్, ఫారెన్ యునివర్సిటీ, డెరైక్టర్ ఐఎస్‌టీ, ఇన్‌ఫర్‌మేషన్ అండ్ లైబ్రరీ సెన్సైస్, డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డెరైక్టర్ ఆఫ్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఎంపవర్‌మెంట్ ఉమెన్ గ్రీవెన్సెస్, డెరైక్టర్ ఆఫ్ లైఫ్ సైన్స్‌కోర్స్, డెరైక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, డెరైక్టర్ ఆఫ్ ఫార్మసీ, డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ పుడ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ మెనేజ్‌మెంట్ స్టడీస్, పెట్రో కెమికల్ ప్రోగ్రామ్ డెరైక్టర్, సెంటర్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఈ రీసోర్స్ డెవలప్‌మెంట్ అండ్ డిప్లాయ్‌మెంట్, ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ ఇంటరాక్షన్ ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ తదితర 22 విభాగాల్లో డెరైక్టర్ల పదవులు ఉన్నాయి.
వీటితో పాటు వర్సిటీ ఆవరణలోని కళాశాల ప్రిన్సిపాల్ పదవి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఐదు గురు అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పదవులూ కీలకంగా ఉన్నాయి. వాటిలో రిజిస్ట్రార్, రెక్టార్, డీఏపీ, డీఈ, కళాశాల ప్రిన్సిపాల్, ఛీఫ్ ఇంజనీర్, సీఈ పోస్టులు కాసులు కురిపించే పోస్టులుగా ఉన్నాయి. వీటికి ఆశావాహులు ధరలు కూడా నిర్ణయించి పైరవీలు సాగిస్తునానరు. రిజిస్ట్రార్ పోస్టుకైతే రూ.50 లక్షలపైమాటే చెల్లిస్తామని ముందుకొస్తున్నట్టు సమాచారం. రిజిస్ట్రార్ తరువాత అత్యధికంగా రూ.పాతిక లక్షలు వరకు డీఏపీ, డీఈ పోస్టులకు పైరవీలు జరుగుతున్నాయి.
అందరి కళ్లూ రిజిస్ట్రార్ సీటుపైనే !
జేఎన్టీయూకే పరిధిలో వందకు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఫీజులు, పాలనాపరంగా రూ.వందకోట్ల లావాదేవీలు జరుగుతాయి. వీటిల్లో రిజిస్ట్రార్ పదవి కీలకం. అందుకే అందరి కళ్లు ఆ సీటుపైనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు వీసీ సీటు కోట్లు పలికిన విషయం తెలిసిందే. వీసీ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న సీటు కావడంతో ఒక ప్రిన్సిపాల్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. ఈయన సామాజిక నేపథ్యంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం ద్వారా ముమ్మరంగా యత్నిస్తున్నట్టు తెలిసింది. ఈయనతోపాటు వీసీ పోస్టు కోసం ముమ్మరంగా యత్నించి విఫలమై,ఆర్థికంగా మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఒక డెరైక్టర్ కూడా వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్, ముఖ్యనేత వారసుడైన చినబాబు ద్వారా పైరవీలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రూ.70 లక్షలు కూడా ఆఫర్ చేశారని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
డీఈ పోస్టు కోసం మరో సీనియర్ ఫ్యాకల్టీ మంత్రి గంటా శ్రీనివాస్ ద్వారా ప్రయత్నిస్తున్నారని సమాచారం. రిజిస్ట్రార్ కూడా అవే యత్నాల్లో ఉన్నారని చెబుతున్నారు. తాను ప్రతిపాదించిన వారికి ఏసీఈ పోస్టు ఇవ్వాలని, ఒక డైరక్టర్ పదవిని తన సామాజిక వర్గానికి ఇవ్వాలని కాకినాడకు చెందిన ఒక ప్రజాప్రతినిధి వర్సిటీ వర్గాలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.వీసీగా చివరి వరకు యత్నించి విఫలమై రెక్టార్‌గా ఉన్న ప్రభాకరరావు కూడా రిజిస్ట్రార్ రేసులో ఉన్నారని పేర్కొంటున్నారు. గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన మరొక డెరైక్టర్ అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ద్వారా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇన్ని ఒత్తిళ్లతో విసుగెత్తిపోయిన వీసీ సహా వర్సిటీవర్గాలు డెరైక్టర్ల పంపకాలు, తెలుగు తమ్ముళ్ల పైరవీలను సీఎం పేషీకి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.
పైసలతో పైరవీలు
Published Mon, Jun 8 2015 12:35 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement