జేఎన్‌టీయూహెచ్‌కు హైకోర్టు ఆదేశం
మిగిలిన లోపాలను నెలరోజుల్లో సవరించుకుంటామని హామీ ఇవ్వాలి
ఆ తరువాత సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలి
హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) వాదనలవైపు హైకోర్టు మొగ్గు చూపింది. నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించుకున్న కాలేజీలను మాత్రమే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామంటూ జేఎన్‌టీయూహెచ్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి చేసిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆ వాదనల ప్రకారమే, ని బంధనలు నిర్దేశించిన మేరకు నిర్దిష్ట అర్హతలతో బోధనా సిబ్బం దిని కలిగి ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో వెంటనే చేర్చాలంటూ హైకోర్టు సోమవారం జేఎన్‌టీయూహెచ్‌ని ఆదేశించింది. జేఎన్‌టీయూ చూపిన ఇతర లోపాలనూ ప్రవేశ ప్రక్రియ ముగిసే రోజు నుంచి నెల రోజు ల్లోపు సవరించుకుంటామని పిటిషనర్ కాలేజీలన్నీ కూడా హామీ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకుంటామంటూ దరఖాస్తు చేసుకున్న కాలేజీలు విఫలమైతే ఆ తరువాత నిర్ణయం తీసుకోవచ్చని జేఎన్‌టీయూకు స్పష్టం చేసింది.
జేఎన్‌టీయూ తీరును తప్పుబట్టిన హైకోర్టు
కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించే వ్యవహారంలో జేఎన్‌టీయూ వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. జేఎన్‌టీయూ స్వయంగా తాను రూపొందించిన నిబంధనలను తానే అమలు చేయలేదని ఆక్షేపించింది. తమ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించడంతో పాటు అఫిలియేషన్లను కూడా రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాదాపు 150కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. కాలేజీల లోపాలను గుర్తించినప్పుడు వాటిని సవరించుకునేందుకు వీలుగా 174 కాలేజీలకు ముందుగానే తెలియచేయాల్సి ఉండేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. నిబంధనలు నిర్దేశించిన మేరకు నిర్దిష్ట అర్హతలతో బోధన సిబ్బంది ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో వెంటనే చేర్చాలని ఆయన జేఎన్‌టీయూ హైదరాబాద్‌ను ఆదేశించారు. అంతేగాక పలు కాలేజీల్లో సీట్ల సంఖ్య తగ్గింపు విషయంలో జేఎన్‌టీయూ ఏకపక్షంగా వ్యవహరించిందని జస్టిస్ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు.
బోధన సిబ్బంది ఉన్న కాలేజీలనే కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి
Published Tue, Aug 26 2014 12:14 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement