ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెదురు | Engineering colleges to miss | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెదురు

Published Tue, Aug 19 2014 3:28 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెదురు - Sakshi

ఇంజనీరింగ్ కాలేజీలకు చుక్కెదురు

వెబ్ కౌన్సెలింగ్ నిలుపుదల కుదరదన్న హైకోర్టు
 
హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం జరుగుతున్న వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తమ కాలేజీలను తొలగించడాన్ని సవాలు చేస్తూ ఆగమేఘాలపై హైకోర్టును ఆశ్రయించిన ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలకు నిరాశే ఎదురైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రక్రియు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతానికి అటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ నెలాఖరుకల్లా కౌన్సెలింగ్‌ను పూర్తి చేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని చెప్పింది. పూర్తి వివరాలతో ఈ నెల 21కల్లా కౌంటర్ దాఖలు చేయాలని జేఎన్‌టీయూను ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేవంటూ 174 కాలేజీల అఫిలియేషన్‌ను జేఎన్‌టీయూ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అఫిలియేషన్ రద్దు... వెబ్ కౌన్సెలింగ్ జాబితానుంచి తమ కాలేజీల పేర్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ దాదాపు 130కి పైగా ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు హైకోర్టులో అత్యవసరంగా హౌజ్‌మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేశాయి.

న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, సరసాని సత్యంరెడ్డి, ఆర్.రఘునందన్‌రావు, న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, తెల్లప్రోలు శ్రీచరణ్ తదితరులు వాదనలు వినిపించగా, జేఎన్‌టీయూ తరఫున తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదించారు.

జేఎన్‌టీయూ చర్యలు ఏకపక్షం...

 ‘2014-15 విద్యా సంవత్సరానికి పిటిషనర్ల కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జేఎన్‌టీయూ మాత్రం ముందస్తుగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా, మా వాదనలు వినకుండా కాలేజీల అఫిలియేషన్లను రద్దు చేసింది. అంతేకాక మా కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి సైతం తొలగించింది. ఈ విషయంలో జేఎన్‌టీయూ పూర్తి ఏకపక్షంగా వ్యవహరించింది. మా కాలేజీల్లో ఏం లోపాలున్నాయో, ఏం సౌకర్యాలు లేవో చెబితే, వాటిని సరిదిద్దుకుంటాం. ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఏకంగా అఫిలియేషన్లను నిలిపివేయుడం అన్యాయం. మా కాలేజీల్లో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతుల పట్ల ఏఐసీటీఈనే సంతృప్తి చెంది గుర్తింపు నిమిత్తం అనుమతులు మంజూరు చేసింది. ఆ అనుమతుల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తగిన ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు అఫిలియేషన్లను నిలిపివేయుడం వల్ల విద్యార్థులకు జరిగిన నష్టం మాటేమిటి..? జేఎన్‌టీయూ చర్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ, పిటిషనర్ల కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలి. విషయుం తేలేవరకన్నా కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేయాలి ’అని పిటిషనర్ల తరఫు సీనియుర్ న్యాయువాదులు కోర్టును అభ్యర్థించారు.

‘సుప్రీం’ ఆదేశాల ప్రకారమే..

తరువాత జేఎన్‌టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘నోటీసులు జారీ చేయని మాట వాస్తవమే. వరుస సెలవుల వల్ల నోటీసులు జారీ చేయడం సాధ్యం కాలేదు. పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదు. పిటిషనర్లు ఈ రోజు (సోమవారం) ఉదయం 10 గంటల సమయంలో ఈ కేసుకు సంబంధించిన కాగితాలను ఇచ్చారు. వాటిని లోతుగా అధ్యయనం చేయకుండా పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడం సాధ్యం కాదు. మౌలిక సదుపాయాలు లేని కాలేజీలకు అనుమతులు ఇవ్వకూడదన్నది మా నిర్ధిష్ట వైఖరి. అందులో భాగంగానే మౌలిక సదుపాయాలు లేని కాలేజీల అఫిలియేషన్‌ను రద్దుచేసి, ఆ కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగిం చాం. ఇందులో నిబంధనల ఉల్లంఘన లేదు. పైగా ఈ నెల 31లోపు కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నుంచి తరగతులను ప్రారంభించాలని సుప్రీం ఆదేశించింది. కాబట్టి వెబ్ కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేయడానికి వీల్లేదు. 19న సమగ్ర సర్వే ఉన్నందున 20న ఆయా కాలేజీలకు నోటీసులిస్తాం. ఆ నోటీసులను ఆయా కాలేజీల వెబ్‌సైట్‌లలోనే ఉంచుతాం. లోపాలను సరిదిద్దుకుని వచ్చిన కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తాం. రెండో దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఆ కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు. సౌకర్యాల విషయంలో ఈ కాలేజీలన్నీ గతంలో ప్రమాణపూర్వక అఫిడవిట్లు ఇచ్చాయి. అయితే వాటిని ఇప్పటి వరకు అమలు చేయలేదు. 21 కల్లా కౌంటర్ దాఖలు చేస్తాం. 22న విచారణ చేపట్టండి’ అని ఆయన న్యాయమూర్తిని కోరారు.

ఏజీ వాదనతో మారిపోయిన పరిస్థితి...

మొదట కాలేజీల తరఫు సీనియర్ న్యాయవాదుల వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించినట్లు కనిపించింది. ఎప్పుడైతే అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి కోర్టు దృష్టికి తీసుకువచ్చారో మొత్తం పరిస్థితి మారిపోయింది. మధ్యంతర ఉత్తర్వులిస్తే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లవుతుందని పరోక్షంగా ఆయన చెప్పడంతో న్యాయమూర్తి పునరాలోచనలో పడ్డారు. అందులో భాగంగానే కాలేజీలు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ, కౌంటర్ దాఖలుకు ఆదేశాలిచ్చారు.

సీఎస్‌తో కాలేజీ యాజమాన్యాల భేటీ

కాగా జేఎన్‌టీయూహెచ్ నుంచి అఫిలియేషన్లు లభించని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిసినట్టు తెలిసింది. తమ కళాశాలను కూడా ప్రస్తుత కౌన్సెలింగ్‌లో అనుమతించాలని కోరినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement