ప్రవేశాలు ఖరారు చేయొద్దు | engineering, pharmacy admissions not to be conformed | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు ఖరారు చేయొద్దు

Published Wed, Sep 10 2014 1:40 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ప్రవేశాలు ఖరారు చేయొద్దు - Sakshi

ప్రవేశాలు ఖరారు చేయొద్దు

* ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌పై సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించిన హైకోర్టు ధర్మాసనం
* లోపాలు సరిదిద్దుకోని కాలేజీలనూ వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో చేర్చండి
* ఈ కళాశాలల్లో ప్రవేశాలను మాత్రం ఖరారు చేయవద్దు
* కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని విద్యార్థులకు చెప్పండి
* జేఎన్‌టీయూకు ధర్మాసనం ఆదేశం
* కాలేజీల పిటిషన్లపై 12 నుంచి తుది విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి సూచన
 
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అన్ని కాలేజీలను చేర్చాలంటూ సింగిల్ జడ్జి గతవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం సవరించింది. లోపాలను సరిదిద్దుకోలేదని చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలను సైతం ప్రాథమిక కౌన్సెలింగ్‌లో చేర్చాలని, అయితే వీటి విషయంలో సింగిల్ జడ్జి తిరిగి నిర్ణయం వెలువరించే వరకు ప్రవేశాలను మాత్రం ఖరారు చేయవద్దని హైదరాబాద్ జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ను ధర్మాసనం ఆదేశించింది.

ఈ కాలేజీల్లో ప్రవేశాలన్నీ సింగిల్ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని కౌన్సెలింగ్ సమయంలోనే విద్యార్థులందరికీ తెలియచేయాలని వర్సిటీకి స్పష్టం చేసింది. ఈ కాలేజీలకు రెండు రోజుల్లో తిరిగి నోటీసులు జారీ చేయాలని జేఎన్‌టీయూను ఆదేశించింది. కాలేజీల్లో కంప్యూటర్ల వివరాలు, విద్యార్థులు, బోధనా సిబ్బంది సంఖ్యతోపాటు విద్యార్థి, అధ్యాపకులు నిష్పత్తి తదితర అంశాలపై నిర్దిష్ట సమాచారాన్ని కోరుతూ నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. కాలేజీలు ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నుంచి తుది విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ జడ్జికి స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.

హైకోర్టును ఆశ్రయించిన అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జేఎన్‌టీయూ సోమవారం అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. జేఎన్‌టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించగా, కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదించారు. తొలుత రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ మొత్తం 272 ఇంజనీరింగ్ కాలేజీలు, 90 ఫార్మసీ కాలేజీలు ఉండగా.. 145 ఇంజనీరింగ్, 50 ఫార్మసీ కాలేజీల్లోనే నిబంధనల మేర బోధనా సిబ్బందితో సహా ఇతర సౌకర్యాలున్నాయని తెలిపారు. వాటిని మాత్రమే పీజీ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని కోర్టుకు    నివేదించారు.
 
 హామీలివ్వడం మామూలే
 ‘కౌన్సెలింగ్‌లో ఎవరికి స్థానం కల్పించాలన్న దానిపై మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పినా కూడా సింగిల్ జడ్జి పట్టించుకోకుండా అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 272 ఇంజనీరింగ్ కాలేజీల్లో 266 కాలేజీలు సమాచారం వెల్లడించగా ఇందులో 145 కాలేజీలు మాత్రమే పూర్తి సంతృప్తికరమైన సమాచారం ఇచ్చాయి. 90 ఫార్మసీ కాలేజీలకు గాను 50 కాలేజీలే సంతృప్తికరంగా స్పందించాయి. పూర్తి సమాచారాన్ని పరిశీలించిన తరువాతనే అన్ని సౌకర్యాలున్న కాలేజీలనే కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని నిర్ణయిం చాం. లోపాలున్నాయని మేం చెప్పడం, సవరించుకుంటామని కాలేజీలు లిఖితపూర్వక హామీలివ్వడం ఏటా పరిపాటిగా మారిపోయింది. అందుకనే సౌకర్యాలు లేని కాలేజీలకు కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించలేదు’
 - కె.రామకృష్ణారెడ్డి (ఏజీ)
 
 కోర్టు ఉత్తర్వులంటే జేఎన్‌టీయూకు గౌరవం లేదు
 ‘కాలేజీల్లో సౌకర్యాల గురించి మే, జూన్ నెలల్లోనే జేఎన్‌టీయూ తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేసింది. లోపాలే ప్రధాన సమస్య అయితే వాటి గురించి అప్పుడే కాలేజీలకు చెప్పి ఉండాల్సింది. అప్పుడు మౌనంగా ఉండి తీరా కౌన్సెలింగ్ సమయంలో లోపాలు ఉన్నాయంటూ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చకపోవడం దారుణం. ప్రతి విషయంలోనూ జేఎన్‌టీయూ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. వారి నిబంధనలను వారే పట్టించుకోవడం లేదు. 174 కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని సింగిల్ జడ్జి గత నెల 25న ఉత్తర్వులిస్తే యూనివర్సిటీ ఏ మాత్రం పట్టించుకోలేదు. కోర్టు ఉత్తర్వులంటే వారికి ఏ మాత్రం గౌరవం లేదు. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’
- డి.ప్రకాశ్‌రెడ్డి (కాలేజీల తరపు న్యాయవాది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement