12 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ | telangana eamcet counselling for engineering admissions begin on june 12th | Sakshi
Sakshi News home page

12 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

Published Sat, Jun 3 2017 7:36 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

telangana eamcet counselling for engineering admissions begin on june 12th

హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 12వ తేదీ నుంచి ఎంసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఈనెల 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపట్టనుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శనివారం మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఎంసెట్‌–2017 ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాంకేతిక విద్యా కమిషనర్, ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ వాణిప్రసాద్, క్యాంపు ఆఫీసర్‌ బి.శ్రీనివాస్, జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రవేశాల షెడ్యూలును ఖరారు చేశారు. జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపును ఈనెల 10వ తేదీలోగా ఇస్తామని వెల్లడించారు. దీంతో షెడ్యూలును ప్రకటించారు. ఈనెల 12వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 16వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ వెరిఫికేషన్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఆధార్, బయోమెట్రిక్‌ తప్పనిసరి..
ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు ఈసారి ఆధార్, బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేశారు. వెరిఫికేషన్‌ సమయంలో అవి తప్పనిసరి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్‌ ర్యాంకు కార్డు, హాల్‌ టికెట్, ఆధార్‌కార్డు, ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, ఇంటర్మీడియట్‌ మెమో కమ్‌ పాస్‌ సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఈ ఏడాది జనవరి 1న, ఆ తరువాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, వికలాంగులు, స్పెషల్‌ కేటగిరీ వారు ఆయా సర్టిఫికెట్లు, నాన్‌ లోకల్‌ వారైతే వారి తల్లిదండ్రులు తెలంగాణలో గతంలో 10 ఏళ్ల పాటు నివసించినట్లు ఉన్న ధ్రువీకరణ పత్రం, రెగ్యులర్‌ స్టడీ లేని వారు ఏడేళ్లపాటు ఇక్కడ నివసించి ఉన్నట్లు నివాస ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

స్పెషల్‌ కేటగిరీ వారికి విద్యాభవన్‌లోనే
ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌కు సంబంధించిన వారు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, వికలాంగులు వంటి స్పెషల్‌ కేటగిరీకి చెందిన వారికి మాసబ్‌ ట్యాంకు సాంకేతిక విద్యా భవన్‌లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యార్థులు తమ ర్యాంకుల ప్రకారం స్వయంగా నిర్ణీత తేదీల్లో హాజరు కావాలి. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అప్పుడే మంచి కాలేజీల్లో సీటు లభించే అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి కాలేజీలో చేరే సమయంలో ట్రాన్స్‌ సర్టిఫికెట్‌ (టీసీ) అందజేయాలి.

వెబ్‌సైట్‌లో గతేడాది కేటాయింపుల వివరాలు..
గత ఏడాది ఎంసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ భాగంగా ఏ ర్యాంకుల వారీకి ఏ కాలేజీలో సీట్లు లభించాయన్న వివరాలను ్టట్ఛ్చఝఛ్ఛ్టి.nజీఛి.జీn వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ వెల్లడించారు. కాలేజీ వారీగా, కేటగిరీ వారీగా, జెండర్‌ వారీగా 2016లో ఏయే ర్యాంకుల వారీకి ఏయే బ్రాంచీల్లో సీట్లు లభించాయన్న వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వాటి ఆధారంగా ప్రవేశాల విషయంలో ఓ అంచనాకు వచ్చే వీలుందని పేర్కొన్నారు. అయితే ఈసారి అందుబాటులోకి వచ్చే కాలేజీలు, సీట్లను బట్టే కేటాయింపులు ఉంటాయని వివరించారు. ఎంసెట్‌ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించారు.

ఇదీ ప్రవేశాల షెడ్యూలు..
12–6–2017 నుంచి 21–6–2017 వరకు: సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
16–6–2017 నుంచి 22–6–2017 వరకు: వెబ్‌ ఆప్షన్లు
22–6–2017, 23–6–2017: వెబ్‌ ఆప్షన్లలో మార్పులకు అవకాశం
28–6–2017: మొదటి దశ సీట్లు కేటాయింపు
3–7–2017లోగా: కాలేజీల్లో చేరడం.
ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తేదీలు..

తేదీ                         ర్యాంకు
12–6–2017        1 నుంచి 6 వేలు
13–6–2017        6001 నుంచి 16 వేలు
14–6–2017        16,001 నుంచి 26 వేలు
15–6–2017        26,001 నుంచి 36 వేలు
16–6–2017        36,001 నుంచి 46 వేలు
17–6–2017        46,001 నుంచి 56 వేలు
18–6–2017        56,001 నుంచి 68 వేలు
19–6–2017        68001 నుంచి 80 వేలు
20–6–2017        80001 నుంచి 92 వేలు
21–6–2017        92001 నుంచి చివరి ర్యాంకు వరకు.

ర్యాంకుల వారీగా వెబ్‌ ఆప్షన్‌ తేదీలు..
తేదీలు                                         ర్యాంకు
16–6–2017, 17–6–2017        1 నుంచి 36 వేలు
18–6–2017, 19–6–2017        36001 నుంచి 56 వేలు
20–6–2017, 21–6–2017        56001 నుంచి 80 వేలు
21–6–2017, 22–6–2017        80001 నుంచి చివరి ర్యాంకు వరకు
22–6–2017, 23–6–2017        వెబ్‌ ఆప్షన్లలో మార్పులకు అవకాశం
28–6–2017                            సీట్లు కేటాయింపు, వెబ్‌సైట్‌లో వివరాలు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాలు..
ఎంసెట్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం 21 హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ వివరాలు..
► హైదరాబాద్‌లో: జేఎన్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ రామంతాపూర్, – గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఈస్ట్‌ మారేడ్‌పల్లి,

►క్యూ క్యూ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్, జూ పార్కు ఎదురుగా. – సాంకేతిక విద్యా భవన్, మాసబ్‌ ట్యాంకు – జేఎన్‌టీయూ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కూకట్‌పల్లి
► ఎస్‌ఆర్‌ఆర్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ కరీంనగర్‌
►డాక్టర్‌ బీఆర్‌ ఆంబేద్కర్‌ జీఎంఆర్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ ఫర్‌ వుమెన్‌ కరీంనగర్‌.
► ఎస్‌ ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ, ఖమ్మం
►వనపర్తి, మహబూబ్‌నగర్, బెల్లంపల్లి (ఆదిలాబాద్‌), కొత్తగూడెం, రాజగోపాల్‌పేట్‌ (సిద్ధిపేట్‌), నల్గొండ, వరంగల్, నిజమాబాద్, మెదక్‌ (వుమెన్‌) గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌లలో.
► నాగార్జున గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ నల్గొండ.
►గిరిరాజ్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌ పీజీ బ్లాక్, నిజమాబాద్‌
► యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ సుబేదారి హన్మకొండ. – కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement