సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎంసెట్–2019 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 6 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. తర్వాత విద్యార్థులు 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లలో పొరపాట్లు సరిచేసుకోవడానికి వీలుగా 9న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇస్తారు. 11న సీట్లను కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ఓసీ, బీసీలు రూ.1,200, ఎస్సీ, ఎస్టీలు రూ.600 ప్రాసెసింగ్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంసెట్ దరఖాస్తులో పేర్కొన్న వివరాలతో దాదాపు లక్ష మంది వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన వెబ్ సర్వీసింగ్ ద్వారా పూర్తయింది. ఇప్పటికే ఆయా విద్యార్థుల మొబైల్ నెంబర్లకు ఈ సమాచారం అందించారు. ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్‌ఐసీ.ఐఎన్’ ద్వారా తమ ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందో, లేదో విద్యార్థులు తెలుసుకోవచ్చు. పరిశీలన పూర్తికానివారు, ఇతరులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో హాజరుకావాల్సి ఉంటుంది.
దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, స్పోర్ట్స్, గేమ్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుంది. జూలై 1 నుంచి 4 వరకు వీరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరెవరికి ఏయే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందో తెలిపే షెడ్యూల్‌ను ఎంసెట్ కమిటీ.. వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ పొడిగింపు!
ఫీజులు, ఈడబ్ల్యూఎస్ కోటా విషయం తేలకుంటే కౌన్సెలింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తూనే ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేయనున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదును రెండు రోజులు వాయిదా వేయాలని యోచిస్తున్నారు. వెబ్ ఆప్షన్లను ఈ నెల 3 నుంచి కాకుండా 5 లేదా 6వ తేదీ నుంచి నమోదు చేసుకొనేలా షెడ్యూల్ ప్రకటించనున్నారు. వెబ్ ఆప్షన్ల గడువును పొడిగిస్తే ఆప్షన్ల మార్పు, సీట్ల కేటాయింపు తేదీలు కూడా రెండు, మూడు రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉందని అధికారవర్గాలు వివరించాయి.
విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు..
- ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు
- ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్
- ఇంటర్మీడియెట్/తత్సమాన మార్కుల మెమోలు
- పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం (ఎస్‌ఎస్‌సీ/తత్సమాన మెమో)
- ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్
- ప్రైవేటుగా చదివినవారు ఏడేళ్లకు సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రం
- ఇతర ప్రాంతాల్లో ఉండి ఏపీకి వచ్చిన ఉద్యోగుల పిల్లలు ఏపీ రెసిడెన్స్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీ)
- తెల్లరేషన్ కార్డు/ఇతరులు ఆదాయ ధ్రువీకరణ పత్రం
- అవసరమైనవారికి లోకల్ స్టేటస్ ధ్రువపత్రం
- ఎన్‌సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగులు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చిల్డ్రన్స్.. వారికి సంబంధించిన ధ్రువపత్రాలు
Comments
Please login to add a commentAdd a comment