సాక్షి, హైదరాబాద్, శ్రీకాకుళం: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లోకి ప్రవేశాల్లో కీలక ప్రక్రియ అయిన సర్టిఫికెట్ల తనిఖీ సోమవారం ప్రారంభమవుతోంది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్టీసీ సమ్మె వల్ల కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్‌కు వచ్చేవారికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలు ఆలస్యమైన తరుణంలో కౌన్సెలింగ్ ప్రారంభించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉదయం 9 గంటలకు ఆ ప్రక్రియ ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 57 కేంద్రాల్లో సర్టిఫికెట్ల తనిఖీ చేపట్టనున్నారు. అందులో 34 కేంద్రాలు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో 19 కేంద్రాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్నాయి. కానీ, రాష్ట్ర విభజనకు నిరసనగా పాలిటెక్నిక్ లెక్చరర్లు ఎంసెట్ విధులను బహిష్కరిస్తున్నట్టు పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ (పాలా) సాంకేతిక విద్యా కమిషనర్‌కు నోటీసు ఇచ్చింది.
దాంతో ఇతర శాఖల సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సహాయంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించాలని.. విద్యార్థులు, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ సహాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30 వరకు జరుగనున్న ఈ ప్రక్రియలో అభ్యర్థుల గైర్హాజరు ఎక్కువగా ఉంటే షెడ్యూలును మరో నాలుగైదు రోజులు పొడిగించనున్నారు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కూడా కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని కోరింది. విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవచ్చనే వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో.. భారీ సంఖ్యలో విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది.
ఆలస్యమైతే మరింత నష్టం: సుప్రీంకోర్టు ఇచ్చిన షెడ్యూలు ప్రకారం జూన్ 30న తొలి విడత కౌన్సెలింగ్ పూర్తవ్వాలి. ఆ లెక్కన ఇప్పటికే 2 నెలలు ఆలస్యంగా షెడ్యూలు సాగుతోంది. తాజా షెడ్యూలు ప్రకారమైనా పూర్తయితే సెప్టెంబరు 15 నాటికి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూలులో అవాంతరాలు ఏర్పడితే కౌన్సెలింగ్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పే పరిస్థితి లేదు. 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్ట్యా విధులకు హాజరుకావాల్సిందిగా పాలిటెక్నిక్ అధ్యాపకులకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే విజ్ఞప్తిచేసింది. సీమాంధ్రలో కౌన్సెలింగ్ జరిగే అవకాశం లేదని పాలా అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ అన్నారు. అనుభవజ్ఞులైన లెక్చరర్లు లేకుండా, ఈ ప్రక్రియను కొనసాగించాలనుకోవడం హాస్యాస్పదమన్నారు.
నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Published Mon, Aug 19 2013 1:48 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement