certificates verifications
-
ఏపీసెట్ కౌన్సెలింగ్ వాయిదా
ఏయూక్యాంపస్ (విశాఖ): రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2020 సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించాల్సిన రెండో దశ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా వేశామన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల స్కానింగ్ కాపీలను అటెస్టేషన్ చేసి మెంబర్ సెక్రటరీ apsetau@gmail.comకు మే 10వ తేదీలోగా పంపాలని సూచించారు. -
వెబ్సైట్లో రెండు శాఖల జాబితా
సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కసరత్తు తీవ్రతరం చేశారు. జిల్లా కలెక్టర్ హరి కిరణ్ నేతృత్వంలో ఆయా శాఖలకు సంబంధించిన పోస్టుల విషయంలో మెరిట్‌జాబితాతోపాటు కటాఫ్, అర్హతపొందిన అభ్యర్థుల జాబితాను రూపొందిస్తున్నారు. సాక్షి కడప : జిల్లావ్యాప్తంగా 7791 పోస్టులకు ఈనెల మొదటి వారంలో జరిగిన పరీక్షకు 1,30,966 మంది హాజరయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఈనెల 19న రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. రెండురోజులుగా కలెక్టరేట్‌తోపాటు వివిధ విభాగాల్లోనూ, సంబంధిత శాఖ కార్యాలయాలలోనూ తుది ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు, నాలుగు రోజులుగా అధికారులంతా ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. రెండు రోజుల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశముంది. జిల్లాలో సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ లిస్టుతోపాటు ఇతర జాబితాలను రెండు శాఖల అధికారులు ఇప్పటికే వెబ్సైట్లో పొందుపరిచారు. మత్స్యశాఖతోపాటు సెరికల్చర్‌శాఖకు సంబంధించి తక్కువ పోస్టులు ఉండడంతో....వేగవంతంగా ప్రక్రియ ముగిసింది. మిగతా విభాగాలలో ఎక్కువ పోస్టులతోపాటు అభ్యర్థులు కూడా ఎక్కువగానే ఉండడంతో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు శాఖల జాబితా మంగళవారం వెలువడనున్న నేపథ్యంలోలో మిగతా మరికొన్ని శాఖలకు సంబంధించిన అభ్యర్థుల అర్హత జాబితాపై కసరత్తు చేస్తున్నారు.ఎంపికైన అభ్యర్థుల ఈ మెయిల్ ఐడీతోపాటు ఫోన్ మెసెజ్ ద్వారా సమాచారం పంపనున్నారు. సమాచారం అందుకున్న అభ్యర్థులు ఆయా తేదీల్లో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. పక్కాగా జాబితా :కలెక్టర్ తుది జాబితాను పక్కాగా రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి కిరణ్ వెల్లడించారు. ఎక్కడా కూడా తప్పిదం జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే రెండు శాఖల జాబితా వెల్లడైందన్నారు. మిగిలిన శాఖల జాబితాకు ఒకటి, రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. రెండు రోజుల్లో జాబితాల ప్రక్రియ పూర్తయ్యాక కాల్‌లెటర్లు పంపుతామని వివరించారు. -
6 నుంచి ‘టీజీటీ’ సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ ఆప్షనల్స్) పోస్టుల భర్తీలో భాగంగా రెండోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మార్చి 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. 6వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. వెరిఫికేషన్‌కు వెంట తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్ల వివరాలు, హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాను తమ వెబ్సైట్లో పొందవచ్చని వివరించింది. అభ్యర్థుల కొరత, మొదట నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గైర్హాజరు వంటి కారణాలతో రెండోసారి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు పిలిచినట్లు తెలిపింది. -
నేడు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురం సప్తగిరిసర్కిల్ : చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అందజేసిన కాపు, బలిజల దరఖాస్తులను శుక్రవారం పరిశీలించనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ నాగముణి తెలిపారు. ఈమేరకు గురువారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పెన్నార్ భవన్ సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉంటుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న గ్రూపు సభ్యులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, బ్యాంకు వివరాలతోపాటు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–275539లో సంప్రదించాలన్నారు. -
రెండోరోజూ అదే తీరు
* పలు కేంద్రాల్లో నిలిచిపోయిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ * పెరిగిన విద్యార్థుల హాజరు * నేటినుంచి మరో 3 కొత్త కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ధ్రువపత్రాల తనిఖీ ప్రక్రియ మంగళవారం కూడా అనేక కేంద్రాల్లో కొనసాగలేదు. సీమాంధ్రలో మొత్తం 34 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేయగా సమైక్య ఉద్యమం కారణంగా తొలిరోజు కేవలం 15 కేంద్రాల్లోనే ఈ ప్రక్రియ సజావుగా సాగింది. రెండోరోజు మరో కేంద్రంలో కూడా ధ్రువపత్రాల తనిఖీ నిలిచిపోయింది. అయితే ఈ ప్రాంతంలో సర్టిఫికెట్ల తనిఖీకి హాజరైన విద్యార్థుల సంఖ్య కొంతమేర పెరిగింది. రెండోరోజు సీమాంధ్రలో 14 కేంద్రాల్లో 3,529 మంది సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యారు. అలాగే తెలంగాణలో 22 కేంద్రాలకు గాను 5,268 మంది హాజరయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియను సమీక్షించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు నేతృత్వంలో మంగళవారం రాత్రి మండలిలో సమావేశం జరిగింది. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, మండలి కార్యదర్శి సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ పాల్గొన్నారు. అజయ్‌మిశ్రా సీమాంధ్ర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి కౌన్సెలింగ్ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు మరింత తోడ్పాటు అందించాలని కోరారు. కాగా బుధవారం నుంచి అదనంగా మరో 3 సహాయక కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అంబేద్కర్ వర్సిటీ, విజయనగరం జిల్లాలోని జేఎన్టీయూ కళాశాల, ఒంగోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను హెల్ప్‌లైన్ సెంటర్లుగా వినియోగించనున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటివరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదని, కొత్త కేంద్రాల ఏర్పాటు ఆ జిల్లాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని మండలి చైర్మన్ తెలిపారు. ఈ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరవ్వాల్సిన ర్యాంకర్లకు షెడ్యూలును వెబ్సైట్లో పొందుపరిచారు. సీమాంధ్ర కు పొరుగున ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని, ఇవి గురువారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో కూడా కొత్తగా కొన్ని కేంద్రాలు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. సర్టిఫికెట్ల తనిఖీ జరగని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈనెల 30లోపు ఎప్పుడు ఈ ప్రక్రియలో పాల్గొన్నా సరిపోతుందని వివరించారు. -
నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్, శ్రీకాకుళం: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లోకి ప్రవేశాల్లో కీలక ప్రక్రియ అయిన సర్టిఫికెట్ల తనిఖీ సోమవారం ప్రారంభమవుతోంది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆర్టీసీ సమ్మె వల్ల కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్‌కు వచ్చేవారికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలు ఆలస్యమైన తరుణంలో కౌన్సెలింగ్ ప్రారంభించాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉదయం 9 గంటలకు ఆ ప్రక్రియ ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 57 కేంద్రాల్లో సర్టిఫికెట్ల తనిఖీ చేపట్టనున్నారు. అందులో 34 కేంద్రాలు సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో 19 కేంద్రాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉన్నాయి. కానీ, రాష్ట్ర విభజనకు నిరసనగా పాలిటెక్నిక్ లెక్చరర్లు ఎంసెట్ విధులను బహిష్కరిస్తున్నట్టు పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ (పాలా) సాంకేతిక విద్యా కమిషనర్‌కు నోటీసు ఇచ్చింది. దాంతో ఇతర శాఖల సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సహాయంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించాలని.. విద్యార్థులు, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ సహాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30 వరకు జరుగనున్న ఈ ప్రక్రియలో అభ్యర్థుల గైర్హాజరు ఎక్కువగా ఉంటే షెడ్యూలును మరో నాలుగైదు రోజులు పొడిగించనున్నారు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కూడా కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని కోరింది. విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవచ్చనే వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో.. భారీ సంఖ్యలో విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆలస్యమైతే మరింత నష్టం: సుప్రీంకోర్టు ఇచ్చిన షెడ్యూలు ప్రకారం జూన్ 30న తొలి విడత కౌన్సెలింగ్ పూర్తవ్వాలి. ఆ లెక్కన ఇప్పటికే 2 నెలలు ఆలస్యంగా షెడ్యూలు సాగుతోంది. తాజా షెడ్యూలు ప్రకారమైనా పూర్తయితే సెప్టెంబరు 15 నాటికి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ షెడ్యూలులో అవాంతరాలు ఏర్పడితే కౌన్సెలింగ్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పే పరిస్థితి లేదు. 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్ట్యా విధులకు హాజరుకావాల్సిందిగా పాలిటెక్నిక్ అధ్యాపకులకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే విజ్ఞప్తిచేసింది. సీమాంధ్రలో కౌన్సెలింగ్ జరిగే అవకాశం లేదని పాలా అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ అన్నారు. అనుభవజ్ఞులైన లెక్చరర్లు లేకుండా, ఈ ప్రక్రియను కొనసాగించాలనుకోవడం హాస్యాస్పదమన్నారు.