* పలు కేంద్రాల్లో నిలిచిపోయిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
* పెరిగిన విద్యార్థుల హాజరు
* నేటినుంచి మరో 3 కొత్త కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ధ్రువపత్రాల తనిఖీ ప్రక్రియ మంగళవారం కూడా అనేక కేంద్రాల్లో కొనసాగలేదు. సీమాంధ్రలో మొత్తం 34 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేయగా సమైక్య ఉద్యమం కారణంగా తొలిరోజు కేవలం 15 కేంద్రాల్లోనే ఈ ప్రక్రియ సజావుగా సాగింది. రెండోరోజు మరో కేంద్రంలో కూడా ధ్రువపత్రాల తనిఖీ నిలిచిపోయింది. అయితే ఈ ప్రాంతంలో సర్టిఫికెట్ల తనిఖీకి హాజరైన విద్యార్థుల సంఖ్య కొంతమేర పెరిగింది.
రెండోరోజు సీమాంధ్రలో 14 కేంద్రాల్లో 3,529 మంది సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యారు. అలాగే తెలంగాణలో 22 కేంద్రాలకు గాను 5,268 మంది హాజరయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియను సమీక్షించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు నేతృత్వంలో మంగళవారం రాత్రి మండలిలో సమావేశం జరిగింది. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, మండలి కార్యదర్శి సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ పాల్గొన్నారు. అజయ్‌మిశ్రా సీమాంధ్ర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి కౌన్సెలింగ్ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు మరింత తోడ్పాటు అందించాలని కోరారు.
కాగా బుధవారం నుంచి అదనంగా మరో 3 సహాయక కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అంబేద్కర్ వర్సిటీ, విజయనగరం జిల్లాలోని జేఎన్టీయూ కళాశాల, ఒంగోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను హెల్ప్‌లైన్ సెంటర్లుగా వినియోగించనున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటివరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదని, కొత్త కేంద్రాల ఏర్పాటు ఆ జిల్లాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని మండలి చైర్మన్ తెలిపారు. ఈ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరవ్వాల్సిన ర్యాంకర్లకు షెడ్యూలును వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
సీమాంధ్ర కు పొరుగున ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని, ఇవి గురువారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో కూడా కొత్తగా కొన్ని కేంద్రాలు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. సర్టిఫికెట్ల తనిఖీ జరగని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈనెల 30లోపు ఎప్పుడు ఈ ప్రక్రియలో పాల్గొన్నా సరిపోతుందని వివరించారు.
రెండోరోజూ అదే తీరు
Published Wed, Aug 21 2013 3:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement